భారత పౌరుషానికి, ప్రతీకారాగ్నికి బాలాకోట్ బూడిదగుట్టయింది. మన వీరుల ధైర్యసాహసాలకి గురి తప్పని దృఢ సంక ల్పానికి బాలాకోట్ బాంబుదాడి చిన్న శాంపిల్. కోట్లాదిమంది భారత ప్రజానీకానికి కొండంత ధైర్యం మన త్రివిధ దళాలు. వారిని మనసారా అభినందిస్తూ, వారి త్యాగనిరతికి నీరాజనాలర్పిస్తోంది. మన బలగాల్లో నలభైమందిని దొంగదెబ్బతో పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకను సరిగ్గా అది జరిగిన పన్నెండో రోజున ఉగ్రవాద శిబిరాన్ని సమాధి చేశారు. ప్రాణానికి పది ప్రాణాలు బలి తీసుకుని మన వీరులకు ఆత్మశాంతి కావించారు. అప్పటిదాకా ఉడికిపోతున్న భారత జాతి కొద్దిగా చల్లబడింది. అయినా, అకారణంగా పోయిన మనవారు తిరిగిరారు. ఆ నష్టం, ఆ బాధ ఎన్నటికీ తీరనిది.
యుద్ధ క్షేత్రంలో ఎన్నో దళాలు, ఎన్నో శాఖలు ప్రాణాలకు తెగించి పనిచేస్తుంటాయ్. వాహనాలకి ఇంధనం నింపేవారి నించి, వైద్య సేవలందించే కాంపౌండర్లు, నర్సుల దాకా యుద్ధం గెలుపుకి కీలక కారకులే. ఆ రోజు అత్యంత విజయవంతంగా నడిపించిన ఉగ్ర శిబిర విమాన దాడిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయ్. గురి తప్పకుండా బాంబులవాన కురిపించి, ఉగ్రమూకల్ని బూడిదగుట్టలుగా మిగిల్చి, అన్ని యుద్ధ విమానాలూ విజయోత్సాహంతో మాతృభూమిపై వాలిన తర్వాతే ప్రధాని నిద్రకు ఉపక్ర మించారట. ఇంత మాత్రం చొరవ దేశ ప్రధానికి ఉండటం అభినందనీయమే గానీ ఆశ్చర్య కారకం కాదు. సొంతగడ్డమీది భారతీయులే కాదు, ప్రపం చంలో ఉన్నవారంతా ఊగిపోయారు. ఉత్సవాలు చేసుకున్నారు.
ప్రధాని మోదీ ‘నేనున్నా నేనున్నా. ఈ దేశం సురక్షిత దేశాల్లో ఉంది. నిశ్చింతగా ఉండండి’ అంటూ అభయ సందేశం ఇచ్చారు. అసలే గందరగోళంలో ఉన్న మోదీ వ్యతిరేక వర్గానికి ఈ దాడితో బుర్ర శ్రుతి తప్పింది. మన సైనిక బలాల శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని మోదీ ఖాతాలో జమ చేసుకోవడం, ఈ సన్నివేశాన్ని రాజకీయం చేయడం పరమ దివాలాకోరుతనం అంటూ మైకుల్లో ఆక్రోశించారు. నిజమే, ఇలాంటి సందర్భంలో ఏ ప్రధాని పీఠం మీదున్నా ఈ మాత్రం తెగువ చేస్తాడు. మోదీకి సమయం కలిసి వచ్చింది. అసలా మాటకొస్తే త్రివిధ దళాధిపతి మన రాష్ట్రపతి, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్– ఎక్కడా వారిపేర్లు రాలేదు.
ఎక్కడైనా అధినాయకుని పేర్లు, ఫొటోలు మాత్రమే తెరకెక్కుతాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే, రాజు యువరాజు పేర్లు మినహా ఎంతమంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయ్? పాపం, మంత్రులు మాట్లాడినా, ‘... గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి ఆదేశం మేరకు...’ అని ప్రారంభించి ఆ విధంగా ముందుకు వెళ్తారు. ‘ఆయన పేరు లేకుండా స్పీచి సాగితే సారుకి బీపర్లు వెళ్తాయట. అసలే టెక్నాలజీ మా సారు గుప్పెట్లో ఉంటది’ అన్నాడొక పెద్దాయన వ్యంగ్యంగా.
ఇంత జరిగితే ఏమీ జరగనట్టు శత్రు దేశం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అలాంటి ఫైవ్ స్టార్ ఉగ్రవాద శిబిరాలు రాజ లాంఛనాలతో పాకిస్తాన్ నేలమీద నడుస్తున్న మాట నిజం. తేలుకుట్టిన దొంగలాగా కిక్కురుమనక ఊరుకున్నారు. శాంతి మంత్రాలు వల్లిస్తున్నారు. యుద్ధం ఎవరికీ లాభదాయకం కాదని పాక్ ప్రధాని ధర్మపన్నాలు చెబుతున్నారు. జెనీవా ఒప్పందాన్ని గౌరవించి అభినందన్ విడుదలకి మడత పేచీలు లేకుండా అంగీకరించారు. అంతవరకు సంతోషం. ప్రపంచ అగ్రదేశా లన్నీ భారత్‌ని సమర్థించాయి. సంయమనం పాటించమని సూచిస్తున్నాయ్. చైనా మునుపటి వైఖరిని మార్చుకున్న ధోరణి పొడసూపింది. దీంతో పాకిస్తాన్ చాలా వైనంగా మాట్లాడుతూనే, బీరాలు పోతోంది. మోదీ వ్యతిరేక శక్తులకు ఇది ఆకస్మికంగా వచ్చిన సమస్య. ఇప్పుడు చంద్రబాబు మోదీని దేశద్రోహిగా ఏపీ విరోధిగా, ఓర్వలేని కుళ్లుమోతు నేతగా జన హృదయాల్లోకి ఎక్కించడం కొంచెం చాలా కష్టం అనిపిస్తోంది. అతి త్వరలో వచ్చే అనేక పరిణామాలు మోదీని ఇంకో రెండు మెట్లు పైకి ఎక్కిస్తే చాలా కష్టం వ్యతిరేక వర్గానికి.
వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు
Comments
Please login to add a commentAdd a comment