మనకు తొట్టతొలి పిట్టకథ రామాయణం. క్రౌంచ మిథు నాన్ని ఒక బోయ చంపాడు. తొలి సహగమనం కూడా అక్కడే జరిగింది. శోకం లోంచి శ్లోకం పుట్టింది. మహేతిహాసానికి నాంది వాక్యమైంది. క్రౌంచ పక్షుల్ని వాడుకలో కవుజు పిట్టలంటారు. చుక్కల చుక్కల రెక్కలతో చూడముచ్చటగా ఉంటాయి. పిట్టమాంస ప్రియులు కవుజు రుచి పరమాద్భుతం అంటారు. వేటగాళ్లు దీన్ని చాలా తెలివైన పిట్టగా చెబుతారు. అనవసరంగా ఇది ఎక్కడా కూత వెయ్యదు. కూతతో ఉనికిని చాటుకుని ప్రాణం మీదికి తెచ్చుకోదు. అందుకే వేటగాళ్లు దీన్ని వేటాడాలంటే కవుజు సాయమే తీసుకుంటారు. షికారీల దగ్గర పెంపుడు కవుజులుంటాయ్. నూకలుజల్లి కౌజుల్ని అక్కడ వదులుతారు. పెంపుడు కౌజు చేత ‘ఇక్కడ మేతలు న్నాయ్ రమ్మని’ కూతలు వేయిస్తారు. పాపం నమ్మి బయటి కవుజులు వచ్చి ముగ్గులో వాల్తాయ్. మరు క్షణం వేటగాడి వలలో పడతాయి. మనిషి తిండి కోసం ఎవరినైనా ఎన్ని మోసాలైనా చేస్తాడు.
దేశంలో పిట్టలు, అనేకానేక పక్షి జాతులు కను మరుగవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది ప్రకృతి ప్రియుల్ని చాలా బాధపెడుతోంది. నగ రీకరణ, అడవుల కొరత, పర్యావరణ కాలుష్యం, మనిషి జిహ్వ చాపల్యం–ఇవన్నీ పిట్టలు కనుమ రుగు అవడానికి కారణం. ఎక్కడ దాక్కున్నా మనిషి పిట్టల్నీ బతకనీయడం లేదు.మనిషి భూమిని, ఆకా శాన్ని, సముద్రాన్నీ ఇప్పటికే వశపరచుకున్నాడు. ఇప్పుడు ఇతర గోళాలమీద దృష్టి సారించాడు. చివ రకు మనిషి త్రివిక్రముడిగా మిగులుతాడో, భస్మాసు రుడుగా కనుమరుగు అవుతాడో కొన్ని తరాలు ఆగి చూడాల్సి ఉంది. అనేకానేక పరిశోధనల తర్వాత పక్షులు కూడా డైనోసార్స్ నుంచే ఆవిర్భవించాయని తేల్చి చెప్పారు. సమస్త చరాలకు డైనోయే మూల మని రుజువైంది. మనదేశంలో చాలామంది పక్షి ప్రియులున్నారు. వాళ్లు టెలిస్కోపులు, కెమెరాలు వేసుకుని కంచెలెంబడి అస్తమానం తిరుగుతుం టారు. వాటి కూతల్ని రికార్డు చేసి ఆనందిస్తుంటారు. ఒకప్పుడు ఎటుచూసినా గుంపులుగా కనిపించే కాకులు ఇప్పుడు అపురూపమైపోయాయి. పిచ్చు కలు ఇళ్లలో కిచకిచలాడుతూ, అద్దాల్ని చూసి ఆడు కుంటూ ఎక్కడంటే అక్కడ గూళ్లుపెట్టి గుడ్లు పెడుతూ నానా యాగీ చేస్తుండేవి. ఇప్పుడు లేవు. సెల్‌ఫోన్ టవర్స్ రేడియేషన్ కారణంగా పిచుకలు పోయాయని చెబుతారు.
పల్లెటూళ్లలో అతిపెద్ద పరి మాణంలో రాబందులు, కనిపించేవి. ఇవ్వాళ వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. వాటిని పెంచ డానికి లక్షలు వెచ్చించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. చెట్ల తొర్రలో కాపురముండే రామ చిల కలు, గువ్వలు, గోరువంకలు ఒకనాడు మనుషుల బాల్యాన్ని ఆనందంగా నింపేవి. అన్నం తినక మారాం చేసే పిల్లలకు చందమామ, పావురాలు, రామచిలకల్ని చూపి తల్లలు బువ్వలు తినిపించే వారు. తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట. ఎగిరే ఇంద్ర ధనుస్సులా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూద్దా మంటే విజయదశమి పండగరోజు కూడా దర్శనమీ యడం లేదు. తక్కువ ఎగురుతూ, ఎక్కువ పరు గులు పెడుతుండే కంచెకోడి బలే రంగురంగుల పిట్ట. నిజంగా దాన్ని చూసి ఎన్నాళ్లు అయిందో. కోయిల కూతకి బదులు కూత వేస్తూ పిల్లలని కవ్వించేది. అది ఎప్పుడూ కన్పించడం తక్కువే. ఇప్పుడు ఉగాది పండగ చిత్రాల్లో పంచాంగం పక్కన, మామిడి పిందెల సరసన వేపకొమ్మకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది నల్లటి కోయిల.
తీతువుపిట్ట అరుపులు విన్నాంగానీ ఎప్పుడూ అది కంటపడలేదు. వడ్రంగిపిట్ట బాగా పరిచయం. మునుపు తమిళనాట పక్షి తీర్థం అని క్షేత్రం ప్రసిద్ధి. సరిగ్గా మధ్యాహ్నం వేళకు ఎక్కడినుంచో అయిదు గద్దలు అక్కడకు దిగేవి. అర్చక స్వాములు సమర్పిం చిన ప్రసాదం తిని తిరిగి ఎగిరిపోయేవి. ఏరోజూ వేళ తప్పేవి కావు. వాటిని గరుత్మంత అవతారాలుగా భావించేవారు. పాతికేళ్ల క్రితం వంద ఉన్న చాలా పక్షులు ప్రస్తుతం మూడు, అయిదుకి పడిపోయాయి. ఇప్పటికీ ఎక్కువ రకాల పక్షులు, పాములు తిరుమల ఏడుకొండలమీదే ఉన్నాయని చెబుతారు. పక్షుల్ని సంరక్షించే బాధ్యత ఏడుకొండలవాడికే అప్పగిం చాలి. అనువైన ఒక కొండని పక్షి ఆశ్రయంగా, కణ్వా శ్రమంగా తీర్చిదిద్దాలి. అపురూపమైన అరుదైన పక్షి జాతుల్ని స్వామి సన్నిధిలో కాపాడాలి.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ
Comments
Please login to add a commentAdd a comment