బుల్లి నేస్తమా.. మళ్లీ రావమ్మా.
చిన్నారి నేస్తాల విలువను గుర్తించడంలో ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్న నగరం.. పిచ్చుకల పిలుపు కోసం ఆరాట పడుతోంది. లంకంత ఇళ్లల్లో లక్కపిడతంత చోటును వాటి కోసం కేటాయించేందుకు సిద్ధపడుతోంది. అది చాలనుకుంటున్న పిచ్చుకలు తిరిగొస్తున్నాయి.
రేడియేషన్
పొల్యూషన్ సృష్టించి తమను దూరంగా వెళ్లగొట్టిన మనిషి తప్పును తెలుసుకుని తమ పెద్ద మనసును చాటుకుంటున్నాడు. దీనికి నిదర్శనంగా నగరంలో పలు ఇళ్లల్లో వెలుస్తున్న పిచ్చుకగూళ్లలో బుల్లిపిట్టలు ఇప్పుడిప్పుడే సవ్వడి చేస్తున్నాయి.
పిలవకున్నా మన ఇంటికి వచ్చేవి... గుమ్మాల ముంగిట గూళ్లు కట్టుకునేవి... నిత్యం పలకరించే నేస్తాలయ్యేవి. మనకి హానికలిగించే పురుగుల్ని ఆరగించే అభయహస్తాలయ్యేవి. మరిప్పుడేవి..? మనిషితో కలిసి మెలిసి జీవించడంలో మరో మనిషికన్నా తామే గొప్ప అని నిరూపించిన నిన్నటి బుల్లి ‘భాగ్యాలు’... నేటి మన ఆధునిక ఆరాటాలకు జడిసి‘పోయాయి’. అయిష్టంగానే మనల్ని విడిచిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే వీటి విలువను గుర్తిస్తున్న ఆధునిక సమాజం ఆలస్యంగానైనా పిచ్చుకకు స్వాగతం పలుకుతోంది.
కిచకిచల కళ్యాణ్‌నగర్..
యూసఫ్‌గూడలోని కళ్యాణ్‌నగర్ ఫేజ్ 2లో ఉన్న రామరాజు ఇంటికి వెళితే ఆయన ఇంటిపైన ఉన్న టైగార్డెన్‌లో దాదాపు 10కి పైగా పిచ్చుక గూళ్లు కనిపిస్తాయి. ‘ప్రస్తుతం మా ఇంట్లో ఒక పిచ్చుక స్థిరనివాసం ఏర్పరచుకుంది. అలాగే మరో రెండు నిత్య అతిథులుగా మారాయి. ఒకటి గుడ్డు కూడా పెట్టింది’ అంటూ రామరాజు ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ కాలనీలోనే దాదాపు 300 దాకా ‘స్పారో నెస్ట్‌బాక్స్’లు ఏర్పాటు చేశారు. గత మూడేళ్లుగా ఈ తరహా బాక్స్‌లు ఉచితంగా అందిస్తున్న సంబంధిత విభాగం అత్యధికంగా గూళ్లు పంపిణీ చేసింది కళ్యాణ్‌నగర్ కాలనీ వాసులకే కావడం గమనార్హం. నగరంలోని బాగ్‌లింగంపల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్... వంటి ప్రాంతాల్లో ఈ నెస్ట్‌బాక్స్‌లను విరివిగా పంపిణీ చేశామని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్నితాలజీ విభాగానికి చెందిన రవీందర్‌రెడ్డి చెప్పారు. తాము నగరంలో పంపిణీ చేసిన పలు గూళ్లకు పిచ్చుకలు వస్తున్నాయని, మరికొన్ని చిన్ని పక్షులు కూడా ఈ గూళ్లను వినియోగించుకుంటున్నాయని చెప్పారాయన.
శివారు గ్రామాల్లో జోరు..
రేడియేషన్, కాలుష్యం వంటి సమస్యలున్నప్పటికీ, వీలున్నంత వరకూ మన ఇళ్లలో వీటికి అవసరమైన గూళ్లు ఏర్పాటు చేస్తే పిచ్చుకలు మనుగడ సాగించే అవకాశం ఉందని రవీందర్‌రెడ్డి అంటున్నారు. టై గార్డెన్స్, ఇంటి ఆవరణలో పచ్చని ల్యాండ్ స్కేప్ వంటి పరిసరాలు వీటిని ఇట్టే ఆకర్షిస్తాయని చెప్పారాయన. ప్రస్తుతం నగర శివార్లలోని హయత్‌నగర్, హిమాయత్‌సాగర్ ప్రాంతం, అజీజ్‌నగర్, ఇబ్రహీంపట్నంలోని పలు గ్రామాల్లో పిచ్చుకలు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నాయని, వీటి సంతతిని పెంపొందించేందుకు ఆయా ప్రాంతాల్లో నెస్ట్‌బాక్స్‌లు అధికంగా పంపిణీ చేస్తున్నామన్నారు.
పిచ్చుకలు నివసించడానికి అన్ని విధాలుగా అనుకూలంగా రూపొంది, గుడ్లు పెట్టేందుకు ఉపకరించే బాక్స్‌లు వీరు అందిస్తున్నారు. కేవలం 16 సెం.మీ పొడవు 24 నుంచి 39 గ్రాములలోపు బరువుండే వీటికి పెద్దగా ఆహారం కూడా అవసరం లేదు. ధాన్యపు గింజల దగ్గర్నుంచి పురుగుల దాకా ఏది దొరికితే అది తింటాయి. పిలిస్తే పలకడానికి మనిషికి మనిషే కరవైపోతున్న ఈరోజుల్లో.. పిలవకున్నా వచ్చి మనతో చెలిమి చేసే ఈ చిన్ని నేస్తాల కోసం స్నేహహస్తం అందిద్దాం. వాటి కోసం ఓ చిన్ని గూడు నిర్మిద్దాం అంటున్నారు పిచ్చుకల ప్రేమికులు.