కూతలు... కేకలు... పరుగులు
అక్షర తూణీరం
ఎవరో ఒకాయన, ‘‘రుతుపవనాలు వెనక్కి తిరిగాయంటే రాష్ట్రంలో నీతినియ మాలు లేకనే. మా హయాంలో పవనాలు పిలిస్తే పలికేవి. వద్దంటే వానలు... ధర్మం నాలుగున్నర పాదాల మీద నడిచేది’’ అంటూ ఆవేశపడుతున్నాడు.
ఏడాది నుంచి పరిస్థితి అయోమయంగా ఉంది. సగం దేహం వేడినీళ్ల లోనూ, సగం చన్నీళ్లలోనూ ఉన్నట్టుంది. తల హైదరా బాద్‌లో, కాళ్లు అమరా వతిలో ఉండిపోయాయి. అటు ఢిల్లీ నేతలు, ఇటు తెలుగునేతలు శరవేగంగా జరిగిపోతున్న అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నారు. ఈ మధ్య, ఓ పెద్ద రైల్వేస్టేషన్‌లో దిక్కుతోచక నిలబడిపోయినట్టు అని పిస్తోంది.
కూతలు... కేకలు... పొగలు... పరుగులు. దూరంగా ఎత్తు మీద ఆగిపోయిన పెద్ద గడియారం. సందడిలో సందడిగా పలు భాషల్లో ఏవో అనౌన్స్‌మెంట్లు. ప్లాట్‌ఫాం చివర రైల్‌రోకో జరుగుతోంది. ఎందుకంటే- కేంద్ర రాష్ట్ర ఉద్యో గులు లంచాలడిగితే ఫలానా నంబర్‌ని సంప్రతిం చండని సెల్‌ఫోన్‌లో ప్రభుత్వం ప్రచారం చేస్తోం దట. ఆఫీసులలో కోసీట్లకి ఎదురుగా సీసీ కెమె రాలు బిగించారట. ఆఫీసు క్యాంటీన్లలో కూడా నిఘా పెట్టారట. ఇది హేయం, అమానుషం. సాటి మనిషిని అనుమానించడం, అవమానించడం కాదా! ఇది మానవహక్కుల ఉల్లంఘనే ముమ్మా టికీ. ‘‘నశించాలి! ప్రభుత్వ ఏకపక్ష ధోరణి నశించాలి!’’ నినాదాలు స్టేషనంతా ప్రతిధ్వనిస్తు న్నాయి. ప్లాట్‌ఫాం బ్రిడ్జి మెట్ల మీద ఒక బృందం బైఠాయించింది. వాళ్లెవరండీ అంటే బోస్టన్ టీ పార్టీ అన్నారు.
ఒక్కసారిగా అందరూ కొత్త కండువాల కోసం ఎగబడే సరికి, రేటు గణనీయంగా పడి పోయిందిట. గిట్టుబాటు ధరకోసం ఆందోళన సాగిస్తున్నారు. మధ్యలో దండతో ఉన్నాయన ఆమ రణ దీక్షలో ఉన్నారు. వార్తా మాథ్యమాల మనుషులు మైకులతో కనిపించారు. ఇప్పుడు స్టేషన్లో మాటువేసి, పెద్ద మనుషుల స్పందనలను రికార్డ్ చేస్తున్నారు. ఎవరో ఒకాయన, ‘‘రుతు పవనాలు వెనక్కి తిరిగా యంటే రాష్ట్రంలో నీతినియమాలు లేకనే. మా హయాంలో పవనాలు పిలిస్తే పలికేవి. వద్దంటే వానలు... ధర్మం నాలుగున్నర పాదాల మీద నడిచేది’’ అంటూ ఆవేశపడుతున్నాడు. ఇంతలో ఒకాయన నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అరిచాడు. దేనిని, దేనికి అన్నారెవరో. సందర్భం వచ్చినప్పుడు చెబుతా. ఇప్పటికైతే ఖండిస్తున్నా.
‘‘నేనా, నేనొక కవిని. జనకవిని. రైలే నా ఆదర్శం. రైలే నా జెండా. పట్టాల మీద గాడి తప్పకుండా వెళ్లే ఒక మహాశక్తి. అలజడులకు, ఉద్యమాలకు ఆహుతి అవుతుంది. అగ్నిపునీత అవుతుంది. అక్షరాల్ని భుజాన వేసుకు తిరుగు తున్న వాణ్ణి. నా దగ్గర మట్టివాసన వేస్తుంది’’ ఔను. వేస్తోంది.
రేపట్నించి రైళ్లలో సమస్త కూరలు అమ్మే ఏర్పాటు చేస్తాం. వంటలు చేసుకునే స్త్రీపురుష ప్రయాణికులకు వెసులుబాటు ఉంటుంది. భారతీయ రేల్ తర్కారీ! అసలు లాంగ్ జర్నీ రైళ్లలో ఓ బోగీలో సమస్త సరుకులు పేర్చి అమ్ముతాం. రైల్వే నానావిధాలుగా లాభాలు ఆర్జిస్తుంది. ఓ పక్క ఆగకుండా అయిడియాలు అయిపోతున్నాయి. దాంతో ముఖ్యమంత్రికి పూనకం వచ్చేసింది. అమ రావతి రైల్వే స్టేషన్‌ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చేస్తాం. ఇక్కడ విమానాలు కూడా దిగు తాయి. అవసరమైతే ఓడలు కూడా వస్తాయి. డ్వాక్రా గ్రూపులతో షాపింగ్ కాంప్లెక్స్‌లు నడిపిస్తాం. జై తెలుగుతల్లి.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)