గుర్తుకొస్తున్నాయి... | Sri Ramana Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

గుర్తుకొస్తున్నాయి...

Published Sat, Apr 6 2019 12:37 AM | Last Updated on Sat, Apr 6 2019 12:37 AM

Sri Ramana Article On Chandrababu Naidu - Sakshi

అది 1991 మే నెల 21. మండు వేసవి అర్ధరాత్రి. అప్పట్లో మాకు హైదరా బాదు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45లో చిన్న గెస్ట్‌ హౌస్‌ ఉండేది. మా ఇంటికి మూడు నాలుగిళ్ల ముందర వీధి మొగదాల వైట్‌ హౌస్‌ కొండ గుర్తుగా ఉండేది. అంటే అది నందమూరి బాలకృష్ణ ఇల్లు. దాని ముఖ కవళికలు అచ్చం అమెరికా అధ్యక్ష నివాసంలా ఉండి, వైట్‌హౌస్‌గా వాసికెక్కింది. అప్పట్లో బాలకృష్ణ ఇంకా అందులో చేరలేదు. కానీ సందడిగా మాత్రం ఉండేది. ఆ అర్ధరాత్రి మా అతిథి గృహంలో ఫోను మోగి, నిద్ర లేపింది. మద్రాస్‌ నుంచి ఒక ఆంగ్ల పత్రికలో పనిచేసే మిత్రుడు, రాజీవ్‌ గాంధీ దారుణ హత్య తాలూకు శ్రీపెరంబదూర్‌ విషాద వార్తని వివరించి, ‘ఇంట్లోనే ఉండండి. తలుపులు తియ్యద్దు. ఇప్పటికే మీ సిటీ అలజడిగా ఉంది. వార్తలొస్తున్నాయ్‌’ అని కంగారుగా చెప్పాడు. తర్వాత తెంపు లేకుండా ఫోన్లు. ఇదే సంగతి. మా సినిమా పనిమీద బాపు, రమణ, నేను అక్కడే ఉన్నాం. స్థానికంగా ఉన్న బాపురమణల ఐఏఎస్, ఐపీఎస్‌ మిత్రులు ఫోన్లు చేసి పరామర్శించి, జాగ్రత్తలు చెప్పారు. మాకు కాలం కదలడం లేదు. ఎంతకీ తెల్లవారడం లేదు.

రాజీవ్‌ దారుణ హత్య అని తెలిసిన మరుక్షణం ఇక్కడ కొందరు అసాంఘిక శక్తులు ఎన్టీఆర్‌ ఆస్తులపై దాడులు సాగించారు. దొరికినవి కొల్లగొట్టారు. మా వీధి మొన వైట్‌హౌస్‌ అద్దాలన్నీ పగలగొట్టారు. రాజీవ్‌ గాంధీని ఎక్కడో ఎల్టీటీఈ వారు దారుణంగా బలి తీసుకోవడానికి, ఇక్కడ ఎన్టీఆర్‌ ఆస్తులు నాశనం చేయడానికి సంబంధమేమిటో వెంటనే ఎవరికీ అర్థం కాలేదు. ఎన్టీఆర్‌ ఆ వినాశన కాండను చూసి ఖిన్నుడయ్యారు. హిమాలయ మహా శిఖరం ఎండ తగిలిన చందమయ్యారు. ఎందరో ఆప్తులు, మిత్రులు వచ్చి ఓదార్చారు. ‘‘బ్రదర్, మేము ఇవన్నీ ఎక్కడెక్కడో కష్టపడి, ఖర్చుపెట్టి సేకరించిన అపురూపమైన వస్తువులు. ఆనాటి నవాబు బిడ్డలు అమ్ముతుంటే కొన్నాం. చూడ ముచ్చటగా మా థియేటర్లలో అమర్చుకొన్నాం. ఇవ్వాళ డబ్బు పెట్టినా అవి మళ్లీ దొరకవు. వారికి నామీద అసలు ఆగ్రహమెందుకో నాకు తెలియదు. నేను కాంగ్రెస్‌ వ్యతిరేకిని. రాజీవ్‌ దారుణ హత్యను తీవ్రంగా గర్హిస్తున్నా.

రాజకీయ విభేదాలుండటం సహజం. కానీ ఇలా పగ తీర్చుకోవడమా’’ అంటూ ఆక్రోశించారు. ఇక తర్వాత జరిగినదంతా చరిత్ర. ఈ మధ్య ఎన్నికలలో, చంద్రబాబు నేతృత్వంలో, కాంగ్రెస్‌ పార్టీ తో ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ జత కట్టడం, మమేకమై పోటీ చేయడం అందరూ చూశారు. ఘోర పరాజయంలో రెండు పార్టీల టాలెంటు ఉంది. ఆ కలయికను చూసి ట్యాంక్‌బండ్‌మీది విగ్రహాలు ముక్కున వేలేసుకున్నాయి. చార్మినార్‌ నాలుగు స్తంభాలు నవ్వాయి. ధ్వంసమైన కళాఖండాలు మరోసారి నెత్తురోడ్చాయి. ఈ మహా కలయిక ఏపీ అభ్యున్నతి కోసమేనని చంద్రబాబు పదేపదే చెప్పినప్పుడు రాబందుల రెక్కల చప్పుడులా వినిపించింది.
ఎన్టీఆర్‌ పవర్‌లో ఉండగా ఆయనని తమాషా చేస్తూ గండిపేట రహస్యం, మండలాదీశుడు వగైరా సినిమాలు విడుదలై డబ్బు చేసుకున్నాయ్‌. వీటి మూల పురుషులు డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, హీరో కృష్ణ ప్రభృతులు. ఇంకా చాలా సినిమాలు ఇలాంటివే నిర్మించడానికి చర్చిస్తున్నారు. వాటిని ఏ సెన్సారు ఆపడం లేదు. వడ్డించేవారు వాళ్ల వాళ్లే.

డీవీఎస్‌ రాజు, రావు గోపాలరావు తీవ్రంగా ఆలోచించి అడ్డుకట్టకో, పై పోటీకోగానీ, ‘మిస్టర్‌ క్లీన్‌’ పేరుతో సినిమా అనౌన్స్‌ చేయాలని నిర్ణయించారు. వైట్‌హౌస్‌లో అంతా చేరారు. అశోక్‌ గజపతిరాజు, చంద్రబాబు కూడా ఉన్నారు. అప్పట్లో మిస్టర్‌ క్లీన్‌ అంటే అందరికీ విదితమే. తెలుగులో ఆ వేషానికి మోహన్‌బాబు, హిందీలో రాజ్‌ బబ్బర్‌ అనుకున్నారు. రావుగోపాలరావు నిర్మాణ సంస్థ మీద నిర్మించాలని తీర్మానించారు. ఆ చర్చలకి రాజ్‌బబ్బర్, ఇంకా ప్రముఖులు, మేనకా గాంధీ కూడా హాజరయ్యారు. నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. ‘సెన్సార్‌ వారు చాలా పెద్ద మనసుతో, నిర్మాతలకు ఆకాశమంత స్వేచ్ఛని ఇచ్చి చిత్రాల విడుదలకు అనుమతిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఒక మంచి సమకాలీన ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని జన రంజకంగా తీయాలని సంకల్పించాం’ అంటూ, వివరాలన్నీ ఇస్తూ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. మర్నాడు అన్ని పత్రికల్లో ప్రముఖంగా మిస్టర్‌ క్లీన్‌ వార్త వచ్చింది. అంతే, గప్‌చుప్‌ కాంగ్రెస్‌ పార్టీ నించి అన్నగారిపై చిత్రాలు ఆగిపోయాయి. వీళ్లూ ఆగిపోయారు. ఇప్పుడు అన్నింటినీ వదిలేసి చంద్రబాబు రాహుల్, సోనియాగాంధీలతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. అదేవన్నా అంటే రాష్ట్ర ప్రగతి కోసం అంటున్నారు. ‘నేను తప్ప అందరూ దొంగలే’నని చంద్రబాబు అరుస్తున్నారు. అందరి అభిప్రాయం అదే నని బాబు గ్రహించాలి.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement