ఉన్నట్టుండి ఒక హడావుడి, ఒక కలకలం. చంద్రబాబు ఒక్కసారిగా రెక్క విదిల్చారు. ‘హస్తినలో చం.చా’ (చంద్రబాబు చాణక్యం) అంటూ పత్రికలు శీర్షికలు పెడుతు న్నాయ్. దేశం చాలా చిక్కుల్లో ఇరుక్కుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ మోదీ కబంధ హస్తాలలో నలిగిపోతున్నాయనీ చంద్రబాబు కొన్నాళ్లుగా తెగ బాధపడుతున్నారు. పైగా ఏ సందేశం ఇవ్వాల్సి వచ్చినా, మోదీమీద నిప్పులు చెరగాలన్నా, ‘ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్’ అని ఓ స్లోగన్ ఇస్తారు చంద్రబాబు. సంవత్సరాలు కొలతబద్దలు కావు.
అరవై ఏళ్లు పాలిటిక్స్ ఉండి ఏ చిన్న పదవినీ ధరించని నికార్సయిన గాంధేయవాదుల్ని మనం ఎరుగుదుం. ఏపీలో మధ్యతరగతి టౌన్స్ లో, ఉన్నట్టుండి బాబు ఈ కొత్త ఉద్యమానికి తెరతీశాడేంటని మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో గుప్పెడు సీట్లన్నా రావాలంటే, నయానో భయానో ఓట్లు రాబట్టే ప్రయత్నం చెయ్యాలి కదా. అందుకని ఢిల్లీలో తిరుగుతూ ఉరుములు మెరుపులు తెప్పిస్తున్నాడని ఓ నడివయస్కుడన్నాడు. ఒక పెద్దావిడ ఉన్నట్టుండి అంది కదా, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని సామెత ఉంది. ఇప్పుడు ఇన్ని జోగులు ఎడాపెడా రాసుకుంటున్నారు. ఇంత బూడిదకంటే అల్పమైందేమి రాల్తుందో చూడాలని నిట్టూర్చింది. చంద్రబాబు మొన్నామధ్య వరకూ ఏపీకి స్పెషల్ ప్యాకేజీయే ముద్దు అంటూ ముందుకు వెళ్లారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ వెనక్కి వస్తున్నారు. తెలుగుదేశం నేతకి జనంలోకి వెళ్లడానికి పట్టు చిక్కడం లేదు. మోదీ ప్రతిష్టని కిందికి దించాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారుగానీ అది ఏ మేరకు ఫలించిందో చంద్రబాబుకి స్పష్టంగా తెలియరావడం లేదు.
ఇంతకుముందు ఇదో గొప్ప వ్యూహమనుకుని, బాబు లాగే కమలేతరులందర్నీ ఒకే తాటిమీదికి తెస్తానని ఒకే ఒక సభతో ఆరంభించి అదే సభతో ముగించారు. తేవడం అంత చిన్న విషయం కాదు. తెచ్చినా తాడు తెగే ప్రమాదం ఉందని పెద్దవాళ్లంటారు. కేసీఆర్ ఏకతాటి పథకాన్ని కింద పారేసి గప్‌చుప్ అయిపోయారు. కాడి ఖాళీగా ఉందనీ, వేరే గొప్ప ఐడియాలు లేక, రాక చంద్రబాబు భుజాన వేసుకున్నారని అనుభవజ్ఞులంటున్నారు. చంద్రబాబుకి అంతా నివ్వెరపోయే విధంగా చక్రం తిప్పగలనని పిచ్చి నమ్మకం ఉంది. బాబు చక్రం తిప్పడం ఒక ఎన్టీఆర్‌ని దింపడం దగ్గరే ఫలించిందని ఒక టీడీపీ మనిషే వేష్టపడ్డాడు.
ఏ పార్టీ మేనిఫెస్టో వారిది. ఎవరి సొంత అహం వారిది. అంతా తమంతవాళ్లు తాము. ఒక దక్షిణాది రాష్ట్రం నించి, అదీ బుల్లి రాష్ట్రం నించి వెళ్లి అందర్నీ నడిపిస్తానంటే అది సాగదు. మనం దైవ ప్రార్థనలో ఉన్నట్టుంటాంగానీ మన సొంత ఆలోచనలు అప్పుడే తీవ్రంగా ప్రకోపిస్తూ ఉంటాయ్. దేశ అభ్యున్నతి కోసం, దేశ ప్రజల కోసం చంద్రబాబు సడెన్‌గా కంకణబద్ధుడై హస్తినలో కనిపించేసరికి చాలామంది నివ్వెరపోయారు. కొత్త ఆలోచనలు రానప్పుడు, అన్ని తీగెల్ని కదిలించి చూడ్డం మామూలే. ఎక్కడో ఓ తీగె పలికితే, ఇక దాన్ని ఆసరా చేసుకుని కథ నడిపే ప్రయత్నం చేస్తారు.
అటువైపు నరేంద్ర మోదీ దేనికీ తొణకడు బెణకడు. మనసులో ఏముందో ఎవడూ పసికట్టలేరు. దాదాపు ఏడాది నించి చంద్రబాబు విమర్శించినా, కట్టువదిలి వెళ్లిపోయినా, తిడుతున్నా, శాపనార్థాలు పెడుతున్నా మోదీ పలకడు ఉలకడు. అదే చంద్రబాబుని తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. ఆహార కల్తీ శాఖ షాపులమీద పడి ఆకస్మిక తనిఖీలు చేస్తే– ‘చూడండి, కక్ష సాధింపు. ఆ కల్తీలు చేసే వాళ్లంతా మా తెలుగుదేశం వాళ్లే’నని నేత అరుస్తున్నాడు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న చందంగా ఈ ఆరోపణలు సాగుతున్నాయ్.ఏమో! సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా ఉక్కు విగ్రహం చంద్రబాబులో రాత్రికి రాత్రి స్ఫూర్తి నింపేసిందేమోనని ఒకాయన ముక్కున వేలేసుకున్నాడు. కూటమికి ముందొక రంగురంగుల జెండా ముఖ్యం అన్నాడు ముగింపుగా.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ
కూటమికో జెండా
Published Sat, Nov 3 2018 2:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment