చిత్రసీమ తలలో నాలుక | sri ramana article on Balasubrahmanyam | Sakshi
Sakshi News home page

చిత్రసీమ తలలో నాలుక

Published Sat, Nov 5 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

చిత్రసీమ తలలో నాలుక

చిత్రసీమ తలలో నాలుక

అక్షర తూణీరం
బాలు గొంతుతో నటిస్తున్నాడని కొందరు ఆక్షేపించారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ.

ఇండియన్‌ సినిమా శత వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో గానగంధర్వుని విశిష్ట పురస్కారంతో సన్మానించ నున్నారు. సినిమా శతాబ్ది చరిత్రలో అర్ధ శతాబ్దిని ఇప్పటిదాకా ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం తన స్వరంతో శ్వాసించారు. ఆనక శాసించారు. గడచిన యాభై ఏళ్లలో వచ్చిన అనేక భారతీయ సినిమా రీళ్లను పరిశీలిస్తే, వాటి సౌండ్‌ట్రాక్స్‌లో బాలు వినిపి స్తారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ.. మరి కొన్ని భాషలలో నలభై వేల పాటలు పాడారు. గిన్నిస్‌ బుక్‌ లోకి ఎక్కారు. పద్మభూషణుడైనారు.

ప్రముఖ సంగీత దర్శకులు కోదండపాణి దీవెనలతో చిత్రసీమలో బాలు అడుగు పెట్టారు. అప్పటినుంచీ అడుగులు వేస్తూనే ఉన్నారు. ప్రజాకోటి ఆయన అడుగులకు మడుగులొత్తుతూనే ఉంది. తొలినాళ్లలో అంటే అర్ధ శతాబ్దికి పూర్వం ఆయన పాడిన  ఏమి ఈ వింత మోహం, ఓహోహో బంగారు పిచ్చుకా, మేడంటే మేడా కాదు లాంటి ఎన్నో పాటలు నేటికీ కొత్త చిగుళ్లుగానే అలరిస్తున్నాయి. ‘‘రావ మ్మా మహాలక్ష్మీ రావమ్మా’’ పాటలో ఆర్ద్రత తొణికిసలాడుతుంది. మొదట్నించీ పాట సాహిత్య సౌరభాన్ని తన పలుకు బడితో మరింతగా గుబాళింపచేయడం బాలు అలవరచుకున్నారు.

తేనెలో కల కండ పలుకులు కలసి ప్రవహిస్తున్నట్టుంటుంది ఆ స్వరం. కలకండ పలుకులు ఉచ్ఛా రణలో సుస్పష్టత కోసం నిలిచాయి. మకరందం మాధుర్యాన్నిచ్చింది. ఆ తరం కవుల నుంచి ఈనాటి కవులదాకా తమ గీతాన్ని బాలు పాడాలని అభిలషిస్తారు. తమ సాహి త్యానికి న్యాయం జరుగుతుందని అలా ఆశ పడతారు. దర్శకునిగా బాపు రెండో చిత్రం బంగారు పిచిక. అందులో బాలుని కథానాయకుడుగా, ఓ ప్రసిద్ధ యువ రచయిత్రిని హీరో యిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇతరేతర కార ణాలవల్ల ఆ కథ అలా నడవలేదు. బాలు మంచి రూపు అని చెప్పడానికి ఈ పాత నిజం చెప్పాను.

బాలు జీనియస్‌. లలితలలితమైన కంఠస్వరంతో సునామీని సృష్టించాడు. చాలా మంది ఆనాటి గాయకుల్ని తోసిరాజన్నాడు. గళంలో వైవిధ్యాన్ని చూపాడు. కొందరు గొంతుతో నటిస్తున్నాడని ఆక్షేపించారు. నాలాంటి సగటు శ్రోతలు పర్వాలేదన్నారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు పండితులు ప్రజల్ని హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ. అర్జున ధనుష్ఠంకారం, అక్షయ తూణీరంలోని అమ్ముల్లా తరగని పాటలు బాలుకి పేరు తెచ్చిపెట్టాయి.

పద్మశ్రీ తుర్ల పాటి దశకంఠునిగా అభివర్ణించి, శ్లాఘించారు. ‘‘హీరోలకి, కమెడియన్లకి, కానివారికి, అయిన వారికి ఇలాగ సినిమాలో అందరికీ ఈయనే పాడేస్తున్నాడు బాబోయ్‌!’’ అంటూ ఒకాయన గావుకేక పెడితే, హీరోయిన్లని వదిలేశాడు సంతోషించమని మరొకాయన శాంతపరిచాడు. బాలు పాడిన గొప్ప పాటల్ని ఏకాక్షరంతో గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. ఏకవీర పాటల్ని మరచిపోలేం. ప్రతి రాత్రి వసంత రాత్రి పాట బాలు, ఘంటసాలల యుగళగీతం. వారిద్దరినీ కలిపి ఆస్వాదించడం ఓ గొప్ప అనుభవం.

బాల సుబ్రహ్మణ్యం గాయకుడు, నిర్మాత, గాత్రదాత, నటుడు, సంగీత దర్శకుడు, స్నేహశీలి, సరసుడు ఇంకా అన్నీను. స్నేహానికి పోయి ఎడంవైపున, సొంతానికి పోయి కుడివేపున చేవ్రాళ్లు చేసి, ఆనక పాటలు పాడుకుంటూ అప్పులు తీర్చే భాగ్యశాలి బాలు. మిగిలినవన్నీ ఒక ఎత్తు, పాడుతా తీయగాతో ఆయన నడుపుతున్న పాటశాల ఒక ఎత్తు. మిథునంలో అప్పదాసు పాత్ర ధరించి నాకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఇంకా ఎన్నో చెప్పాలి. ఆయన తగని మొహమాటస్తుడు, తగిన మర్యాదస్తుడు. ‘‘బాలు మగపిల్లాడుగా పుట్టాడు కాబట్టి సరిపోయింది. ఆ మోహ రూపుకి ఆడపిల్లగా పుడితే... పాపం చాలా ఇబ్బందయేదని’’  బాపు తరచూ ఆనందించేవారు. శతమానం భవతి.


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement