రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలుండవ్. అట్లా గని శాశ్వత మిత్రత్వాలూ ఉండవ్. ఇది అనాదిగా వినిపిస్తున్న నానుడి. చరి త్రలో ఆగర్భ శత్రువులైన వారు చేతులు కలిపిన సందర్భాలు అనేకం ఉన్నాయ్. కృత యుగంలోనే మనకు కొండంత ఉదాహరణలు కనిపిస్తాయి.
శాపవశాన దేవతలు బలహీనపడిపోయినపుడు వారు మార్గాంతరం వెదికారు. ఉపాయశాలి అయిన శ్రీహరి రంగంలోకి దిగాడు. ఔషధ గుణాలున్న మూలికలను పాల సముద్రంలో నిక్షేపించి, సము ద్రాన్ని శక్తికొద్దీ మథిస్తే అమృతం పుడుతుంది. దాన్ని సేవిస్తే ఇక జర రుజ మరణాలుండవు. శక్తివంతులై, నిత్యయవ్వనులై కళకళలాడుతూ ఉంటారు అని దేవ దేవుడు చెప్పగానే దేవతలు రెట్టించిన ఉత్సాహంతో పనిలోకి దిగారు.
ముందస్తుగా రాక్షసుల సాయం అర్థించారు. ‘అన్నలారా! మన క్షేత్రాలు వేరైనా బీజాలు ఒక్కటే! రండి, చేయి చేయి కలుపుదాం. అమృతం సాధించి మృత్యువుని జయిద్దామని పిలుపునిచ్చారు. పక్షి రాజు గరుత్మంతుడు సాయం చేశాడు. మంధరగిరిని కవ్వంగా, సర్పరాజు వాసుకి కవ్వపు తాడుగా క్షీర సాగరంలో అమర్చి వెళ్లాడు. భల్లూకరాజు జాంబవం తుడు సర్వత్రా గాలించి, వనమూలికలు సేకరించి సముద్రం నింపాడు. అందరి పొత్తుతో క్షీర సాగర మథనం భూమ్యాకాశాలు దద్దరిల్లే స్థాయిలో సాగింది. మధ్యలో ఐరావతం, కౌస్తుభం, ఉచ్ఛై శ్రవం, అచ్చరలు, చందమామ ఇలా ఎన్నో విశేషాలు పుట్టుకొచ్చాయి. దేవతల్లో నోరున్న వారికి తలో విశేషం ఇచ్చారు. మధ్యలో కొండ మునుగుతుంటే విష్ణు మూర్తి తాబేలుగా వచ్చి ఆదుకున్నాడు. లక్ష్మీ దేవిని అందుకున్నాడు. హాలాహలం పుట్టింది. అంతా గగ్గోలు పెట్టారు. భోళా శంకరుణ్ణి మాటలతో సిద్ధం చేశారు. ఆయన గరళం మింగేశాడు. చివరికి అమృ తం ఉద్భవించింది.
‘రాక్షసులకి అమృతం దక్కితే మన కొంపలు మునుగుతాయ్’ అంటూ దేవతలు మాయోపాయం పన్నారు. కానీ అప్పటికే ఇద్దరు రాక్షసులు చెరో గుటకా పుచ్చేసుకున్నారు. ఆ పుణ్యానికి రాహు కేతువులు గ్రహాల్లో చేరిపోయి, ఇప్పటికీ పూజలం దుకుంటున్నారు. అన్యాయం చేశారనే కోపంతో మిగిలిన గ్రహాల్ని దొరికినప్పుడల్లా కబళిస్తూ ఉంటారు. అదీ కథ.ఇపుడు మనం అమృతతుల్యమైన పవర్ కోసం ఎందరితో జతకడితే మాత్రం తప్పేంటి? ధర్మం నాలుగు పాదాల నడుస్తున్న ఆ యుగంలోనే ఇట్లా జరిగింది. ధర్మం ఒంటికాలి మీద కుంటుతున్న ఈ కాలంలో పవర్ కోసం ఏం చేసినా ఆక్షేపణీయం కాదు. చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్‌తో చెయ్యి కలి పారని కొందరు నోళ్లు నొక్కుకుంటున్నారు.
ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టిందే కాంగ్రెస్‌ని భూస్థాపితం చేయడానికే కదా అని జ్ఞాపకశక్తి గల కొందరు గుర్తు చేస్తున్నారు. కావచ్చు, కాలోచితంగా స్ట్రేటజీ మార్చనివాడు పాలిటిక్స్‌లో షైన్ కాజాలడు. ఇపుడు తెలంగాణలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే, బోణీ కొట్టడం కూడా కష్టమేనని రాజకీయ విశ్లేష కులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే చంద్రబాబు తెలంగాణలో పార్టీప రంగా ఈ నాలుగేళ్లలో సాధించిందేమీ లేదు. అసలు పార్టీని తెలంగాణలో పక్కన పెట్టారని, ఏపీ వరకు రక్షించుకుంటే చాలనే స్థితిలో ఉన్నారనీ ఎక్కువ మంది అభిప్రాయం. నలుగురితో పాటు నారా యణా అన్నట్టు, అందరితో కలిసి ఉంటే అదో రకం. అప్పుడు కూటమి ఫెయిల్ అయిందని చెప్పుకో వచ్చు. ఒంటరిగా ఓటమిని భరించడం కంటే నలుగురితో పంచుకోవడం తేలిక.
అవినీతి పాలన, కుటుంబ పాలన, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు– ఇలాంటి అతి పురాతన చద్ది విమర్శలతో నెగెటివ్ ఓటుని ఏ పార్టీ అయినా సృష్టించజాలదు. ‘ఇవన్నీ కాదు, నెగెటివ్ పాయింట్ చెప్పండని’ ఓటర్లు సూటిగా అడుగుతారు. అందుకు రెడీగా ఉండాలి ఏ కూటమి అయినా. ఈ కల యికలు, పొత్తులు అన్నీ యుగాలుగా ఉన్నవే. కొత్తగా మనం కనిపెట్టినవేం కాదు. అందుకే... గతమెంతో ఘనకీర్తి కలవాడా! చెయ్యెత్తి జై కొట్టు...!!
వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు
Published Sat, Sep 15 2018 2:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment