పొత్తు పొడిచేనా | Congress TDP Alliance Turns Tough In Telangana Polls | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 18 2018 3:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress TDP Alliance Turns Tough In Telangana Polls - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌ : రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దించే లక్ష్యంతో కూటమికట్టిన కాంగ్రెస్‌కు మిత్రపక్షాలు ఆదిలోనే చుక్కలు చూపుతున్నాయి. పొత్తులో భాగంగా తమకు భారీగా సీట్లు ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి పట్టుబడుతున్నాయి. పైగా పోటీ చేయబోయే స్థానాల విషయంలోనూ మెలిక పెడుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ నేతలు ఆశిస్తున్న సీట్లనే పొత్తులో తమకు కేటాయించాలని టీటీడీపీ కోరుతుండగా కాంగ్రెస్‌ పోటీ చేయాలనుకుంటున్న సీట్లలోనే కొన్నింటిని సీపీఐ కోరుతోంది.

ఇప్పుడిప్పుడే కేడర్‌ను సమకూర్చుకుంటున్న తెలంగాణ జన సమితి సైతం తమకు 15 సీట్లు కావాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు కూటమిని ఓ ఫ్రంట్‌గా ప్రకటించి దానికి తనను చైర్మన్‌ చేయాలని కోదండరాం ఒత్తిడి తెస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి. దీంతో మిత్రపక్షాలకు 29 స్థానాలు (మజ్లిస్‌ ప్రాతినిధ్యం ఉన్నవి కలుపుకుని) కేటాయించి మిగిలిన 90 చోట్ల పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ ఆలోచనకు బ్రేక్‌ పడ్డట్టయింది. సీట్ల లెక్కల చిక్కులపై చేసేది లేక టీపీసీసీ నాయకులు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. కూటమిలో బలంగా ఉన్న పార్టీ అధ్యక్షుడే ఫ్రంట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారని కాంగ్రెస్‌ అంటోంది.

30 సీట్లు కేటాయించాలని టీడీపీ ఒత్తిడి ...
ఏపీ ఇంటెలిజెన్స్‌ బృందం చేత తెలంగాణలో వారంపాటు సర్వే చేయించుకున్న తెలుగుదేశం పార్టీ తమకు తెలంగాణలో 50 నియోజకవర్గాల్లో బలం ఉందని, గెలిచే స్థాయిలో ఉన్న 30 నియోజక వర్గాలను కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది. టీడీపీ కోరినట్లు 30 స్థానాలు ఇస్తే తెలంగాణలో తాము దాదాపుగా ఖాళీ అవుతామని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోంది. టీడీపీలో ముఖ్య నేతలైన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్‌. రమణ కోరుకుంటున్న వనపర్తి, జగిత్యాల సీట్లను పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ ఇచ్చేస్తే ఆ పార్టీ సీనియర్లు చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి ఆయా స్థానాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. దీంతో వనపర్తికి బదులుగా దేవరకద్ర, జగిత్యాలకు బదులుగా కోరుట్ల సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉంది. ఇదే విషయాన్ని టీపీసీసీ నాయకులు టీడీపీ ముఖ్య నేతలకు కూడా చెప్పినట్లు తెలిసింది. అలాగే టీడీపీ కోరుతున్న నర్సంపేట సీటు ప్రస్తుతం కాంగ్రెస్‌ చేతిలో ఉంది.

గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మాధవరెడ్డి అధికార పార్టీని కాదని కాంగ్రెస్‌ అసోసియేటెడ్‌ సభ్యుడిగా చేరిపోగా ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని, అక్కడి నుంచి సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని టీడీపీ అంటోంది. దీనికి కాంగ్రెస్‌ అంగీకరించే అవకాశం ఎంతమాత్రం కనిపించట్లేదు. ఖమ్మం జిల్లా పాలేరు సీటు కావాలని టీడీపీ అడుగుతుంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గట్టిగా కోరుతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ సీటును టీడీపీ కోరగా ఆ సీటులో టికెట్‌ ఇచ్చేందుకు అంగీకరించి కాంగ్రెస్‌ పార్టీ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను చేర్చుకుంది. అలాగే తమకు బలమైన నియోజకవర్గంగా పేరున్న నిజామాబాద్‌ రూరల్‌ సీటును ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌ చేస్తుండగా అక్కడి నుంచి పోటీ చేసేందుకు వీలుగా టీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇలా టీడీపీ అడుగుతున్న 30 సీట్లలో 15 సీట్లు కాంగ్రెస్‌కు అత్యంత జటిలమైనవే కావడంతో పొత్తు ప్రతిపాదన ఆ పార్టీ నేతలకు నిద్రలేకుండా చేస్తోంది.

డబ్బు సాయానికి టీడీపీ సై...!
తమకు 30 స్థానాలు కేటాయిస్తే తమ పార్టీ అభ్యర్థులతోపాటు కాంగ్రెస్‌ అభ్యర్థులకు డబ్బు సాయం చేస్తామని టీడీపీ హమీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా తమకు కోరినన్ని స్థానాలు ఇవ్వాల్పిందేనన్నది టీడీపీ వాదన. రేవంత్‌రెడ్డితోపాటు పార్టీలో చేరిన దాదాపు 10 మందికి టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌లో గతంలో హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఆ సీట్లను టీడీపీ కోరుతోంది. ములుగు నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించి సీతక్క కాంగ్రెస్‌లో చేరగా ఇప్పుడు ఆ సీటును టీడీపీ అడుగుతోంది. ఇలాంటివి ఆరడజను సీట్లు ఉన్నట్లు సమాచారం.

టీడీపీ ధన సహాయం సంగతి ఎలా ఉన్నా ఆ పార్టీ అడుగుతున్న వాటిలో 25 సీట్లు ఇచ్చినా తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ మధ్యే పోటీ కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రయోజనం ఏమిటని కోమటిరెడ్డి సోదరులు మొదటి నుంచి వాదిస్తున్నారు. ఇటీవల పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి కూడా వారు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘సీట్ల విషయంలో టీడీపీ డిమాండ్లు చూస్తుంటే వారికి పొత్తుపట్ల ఆసక్తి ఉన్నట్లు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ జాబితా అలా ఉంది. చివరకు ఇది ఎక్కడకు దారి తీస్తుందో చెప్పడానికి వీల్లేకుండా ఉంది’అని వరంగల్‌ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చెప్పుకొచ్చారు.

టీజేఎస్‌కు 15, సీపీఐకి 8 సాధ్యమా?
తెలంగాణ జన సమితి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తమకు 15 సీట్లు కావాలని అడుగుతోంది. సీపీఐ సైతం ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 8 సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఆసిఫాబాద్, హుస్నాబాద్, మునుగోడు, దేవరకొండ, మహబూబాబాద్‌ నియోజకవర్గాలు కేటాయించాలని కాంగ్రెస్‌ను సీపీఐ కోరింది. ఇవి కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు స్థానాలు కావాలని ఆ పార్టీ అడుగుతోంది. కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని భావిస్తున్న హుస్నాబాద్, మనుగోడు, దేవరకొండ స్థానాలు సీపీఐ అడుగుతుండటం కాంగ్రెస్‌కు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇక టీజేఎస్‌ అడుగుతున్న స్థానాల్లో ఇంకా స్పష్టత రానప్పటికీ మంచిర్యాల, కరీంనగర్, మెదక్, మిర్యాలగూడ, ఖమ్మం, వికారాబాద్‌ సహా 15 స్థానాలు కావాలని ఆ పార్టీ అడుగుతున్నట్లు సమాచారం.

టీడీపీకి 14 స్థానాలు ఇచ్చేందుకు సుముఖం...
సీట్ల సర్దుబాటు చర్చలపై ప్రతిష్టంభన నేపథ్యంలో మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లపై టీపీసీసీ ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీకి 14, తెలంగాణ జనసమితికి 5, సీపీఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు ఆ పార్టీ సుముఖంగా ఉంది. టీడీపీ కోరుతున్న సీట్లలో వనపర్తికి బదులు దేవరకద్ర, జగిత్యాలకు బదులు కోరుట్ల, నర్సంపేటకు బదులు వరంగల్‌ పశ్చిమ, ఆలేరుకు బదులు సిద్దిపేట సీట్లు ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది. మిగిలిన 10 సీట్ల విషయంలో తుది దశ చర్చలకు రావాలని కాంగ్రెస్‌ కోరుతోంది. మొదట టీడీపీతో పొత్తు ఖరారైతే ఆ తరువాత జనసమితి, సీపీఐ సీట్ల సర్దుబాటుకు మార్గం సుగమమవుతుందని కాంగ్రెస్‌ అంటోంది. హైదరాబాద్‌ పాతబస్తీలో ఏడు సీట్లను టీడీపీ, కాంగ్రెస్, తెలంగాణ జనసమితి రెండు చొప్పున, సీపీఐ ఒకదానిలో పోటీ చేయాలన్నది కాంగ్రెస్‌ భావన. ఇవి పోతే కచ్చితంగా 90 సీట్లలో కాంగ్రెస్‌ పోటీ చేయాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఏదేమైనా వచ్చే వారం రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వస్తుందనే ఆశిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement