వివిధ రంగాలకు బడ్జెట్‌ కేటాయింపు | Different sectors of the budget allocation | Sakshi
Sakshi News home page

వివిధ రంగాలకు బడ్జెట్‌ కేటాయింపు

Published Thu, Nov 6 2014 3:48 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

వివిధ రంగాలకు బడ్జెట్‌ కేటాయింపు - Sakshi

వివిధ రంగాలకు బడ్జెట్‌ కేటాయింపు

యాదగిరి గుట్టకు రూ.100 కోట్లు

సాక్షి, హైదరాబాద్: టీటీడీ తరహాలో యాదగిరి నారసింహ క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశలో తొలి అడుగు వేసింది. ఆ క్షేత్ర అభివృద్ధికి రూ.100 కోట్లను కేటాయించింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరి గుట్టను సందర్శించి  పలు హామీలిచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేశారు. ఇక్కడ భక్తుల సౌకర్యాల కోసం  కల్యాణ మండపాలు, ధ్యానమందిరాలు, వేదపాఠశాలలు, కాటేజీలు నిర్మించనున్నారు. అలాగే 400 ఎకరాల్లో నృసింహ అభయారణ్యాన్ని అభివృద్ధి చేస్తారు. దేవాలయ గోపురానికి బంగారం తాపడం చేయించనున్నారు.
 
పర్యాటకానికి రూ. 240 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గతంతో పోలిస్తే పర్యాటక రంగానికి స్వల్పంగా ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ తొలి బడ్జెట్‌లో ప్రభుత్వం పర్యాటక రంగానికి రూ.240 కోట్లు కేటాయించింది. వరంగల్ శిల్పారామానికి రూ.3.75 కోట్లు, వృద్ధకళాకారుల పింఛన్ల కోసం రూ.5 కోట్లు, నృత్య, సంగీత, లలిత కళల అకాడమీలకు రూ.3 కోట్లు, పలు సాంస్కృతిక వేడుకలకు రూ.7 కోట్లు, సాంస్కృతిక వారధి పథకానికి రూ.11 కోట్లు, హైదరాబాద్‌లో తెలంగాణ కళాభవనం కోసం రూ.15 కోట్లు,  వరంగల్‌లో కాళోజీ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి రూ.15 కోట్లు, రవీంద్రభారతి, లలిత కళాతోరణంల ఆధునీకరణకు రూ.3 కోట్లు, కొత్త పర్యాటక ప్రాజెక్టుల కోసం రూ.20 కోట్లు, కేంద్రప్రభుత్వం ద్వారా పర్యాటక సర్క్యూట్స్‌కు రూ.109 కోట్లు, పురావస్తు శాఖకు రూ.33.12 కోట్లు చొప్పున కేటాయించారు.  
 
గోదావరి పుష్కరాలకు రూ. 100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించే క్రమంలో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్ల కు గాను రూ.100 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటేవలే ఈ ఉత్సవాల కోసం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అంతేమొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించడం గమనార్హం. బాసర, కాళేశ్వరం, మంథని, ధర్మపురి, భద్రాచలం తది తర ప్రాంతాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే  ప్రకటించింది.
 
పేదింట ‘దీపం’
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోని మహిళలకు దీపం పథకం కింద పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దీపం పథకానికి ప్రస్తుత బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద కొత్తగా ఎల్పీజీ కనెక్షన్లు తీసుకొనే మహిళలకు మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుంది. గరిష్టంగా ఒక్కో కనెక్షనుకు రూ. 1,600 ప్రభుత్వం చెల్లించినా, ప్రస్తుతం కేటాయించిన నిధులను బట్టి చూస్తే 6.25 లక్షల మందికి ఈ పథకం సాంత్వన కలిగించనుంది. దీంతోపాటు సబ్సిడీ బియ్యానికి ప్రభుత్వం రూ.700కోట్లు కేటాయించింది.
 
రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్లకు నిధులేవి?
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రధాన హామీల్లో ఒకటైన ‘రెండు పడక గదుల ఇళ్ల పథకం’ విషయంలో బడ్జెట్‌లో ప్రభుత్వం అంటీముట్టనట్లే వ్యవహరించిం ది. సీఎం పదవిని చేపట్టిన అనంతరం కూడా కేసీఆర్ దీనిని పలుమార్లు ప్రస్తావించిన నేపథ్యంలో.. బడ్జెట్‌లో దానికి ప్రాధాన్యం ఉంటుందని పేదలు ఆశగా ఎదురుచూశారు. కానీ బడ్జెట్‌లో ఆ పథకానికి కేటాయించింది కేవలం రూ. 85 కోట్లు మాత్రమే. బడ్జెట్ ప్రసంగంలో పేదల ఇళ్ల విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఎక్కడా ఈ సంఖ్యను ఆర్థికమంత్రి ఉటంకించక పోవడం గమనార్హం. మొత్తంగా పేదల ఇళ్ల పథకానికి (ప్రణాళికేతర వ్యయంతో కలిపి) రూ. 1,041 కోట్లు కేటాయించారు. అంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికే సింహభాగం నిధులు కేటాయించనున్నారు. ఈ ఏడాది రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం అంతంత మాత్రంగానే ఉండనుందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగా.. తాజా బడ్జెట్‌లో కేటాయించిన రూ. వెయ్యి కోట్లలో దాదాపు రూ. 525 కోట్ల వరకు ఐఏవై ఇళ్ల వాటానే ఉండనుంది.
 
 
‘ఫాస్ట్’కు రూ. 2,734 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో తెలంగాణ విద్యార్థులకు ఆర్థికసహాయం (ఫాస్ట్) పథకానికి  రూ. 2,734.95 కో ట్లు కేటాయించారు. శాఖల వారీగా చూస్తే బీసీ సంక్షేమం కోసం రూ.1,348.21 కోట్లు, ఎస్సీ అభివృద్ధిశాఖకు 563.48 కోట్లు, ఎస్టీలకు 233.26 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.590 కోట్లు కేటాయించారు. ఫాస్ట్ పథకం వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఫీజు, స్కాలర్‌షిప్ బకాయిలు కలుపుకుని రూ.1,587 కోట్లు ఉండగా, ప్రభుత్వం గతంలో మూడువిడతలుగా ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి రూ.500 కోట్లు విడుదలచేసింది.
 
సగం బకాయిలకే..
‘‘స్కాలర్‌షిప్‌లకే  రూ. 6-7 వేల కోట్లు అవసరం. స్కాలర్‌షిప్‌లకు రూ. 5 వేల కోట్లు, పాత బకాయిలు రూ.1,500 కోట్లవరకు ఉన్నాయి. కానీ కేటాయింపులు మాత్రం తక్కువగా ఉన్నాయి.’’
 -పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సయ్య
 
విద్యా బడ్జెట్‌పై మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులపై ఉపాధ్యాయ వర్గాల నుంచి మిశ్రమ స్పం దన లభించింది. విద్యా రంగానికి పెద్దపీట వేసిందని తెలంగాణ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం.మణిపాల్ రెడ్డి చెప్పారు. పాఠశాల విద్యకు కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పేర్కొంది. విద్యా రంగంపై ప్రభుత్వం శీతకన్ను చూపిందని ఎస్టీయూ తెలంగాణ అధ్యక్షుడు చందూరి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.భుజంగ రావు తదితరులు అభిప్రాయపడ్డారు.
 
వైద్య రంగానికి రూ.2,282.86 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఖరీదైపోతున్న వైద్యరంగానికి బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.2,282.86కోట్లు కేటాయించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ (రూ.1277.39కోట్లు) కంటే ఈ బడ్జెట్‌లో అధికంగా కేటాయించామని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రూ.వంద కోట్ల చొప్పున కేటాయించారు. నిమ్స్‌కు రూ.200కోట్లు ఇచ్చారు. అయితే, నల్లగొండ జిల్లా బీబీనగర్ (రంగాపూర్) వద్ద కొత్తగా నిర్మించిన నిమ్స్‌కు మాత్రం కేవలం కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు.

ప్రతీ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మారుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ జిల్లా ఆసుపత్రికి రూ.కోటి చొప్పున కేటాయించారు. ఎంపిక చేసిన పీహెచ్‌సీలను 24 గంటలు పనిచేసేందుకు రూ.10 కోట్లు, అదనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుకు రూ.57.15 కోట్లు కేటాయించారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆసుపత్రులను నిమ్స్ స్థాయికి పెంచేందుకు రూ.20 కోట్లు ఇచ్చారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణానికి రూ.92కోట్లు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హెల్త్ యూనివర్సిటీ ఉండాల్సిందేనని  చేసిన ప్రకటనకు అనుగుణంగా, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఈ బడ్జెట్‌లో రూ.10కోట్లు కేటాయించడం గమనార్హం.
 
పంచాయతీరాజ్‌కు పెద్దపీట
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.13,877కోట్లు
 
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాలకు గాను పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిలకు బడ్జెట్‌లో రూ.13,877కోట్లు కేటాయించారు. ఇందులో పంచాయతీరాజ్‌కు కేటాయింపులు రూ.8,641.61కోట్లు కాగా, గ్రామీణాభివృద్ధి విభాగానికి 5,415.45కోట్లు కేటాయించడం విశేషం. పంచాయితీరాజ్ విభాగానికి  కేటాయించిన నిధుల్లో రూ.2,860.84కోట్లు ప్రణాళికేతర వ్యయంగానూ, రూ.5,600.77 కోట్లు ప్రణాళిక వ్యయంగానూ చూపారు. గ్రామీణాభివృద్ధికి ప్రణాళిక  వ్యయం 5,406.86కోట్లు చూపగా, ప్రణాళికేతర వ్యయంగా చూపింది కేవలం రూ.8.59కోట్లు కావడం గమనార్హం.

పంచాయతీరాజ్‌కు కేటాయింపులు ఇలా.. : గ్రామాల్లో వివిధ కార్యక్రమాల నిమిత్తం రూ.2,541.36కోట్లు కేటాయించగా, స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు నష్టపరిహారం, ఇతర కేటాయింపుల కింద రూ.26.97కోట్లు కేటాయించారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) పరిధిలో.. ఇతర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు మరో రూ.294.27కోట్లు, రూ.3,054 కోట్లు రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.72.10కోట్లు కేటాయించారు.
 
గ్రామీణాభివృద్ధికి ఇలా..: గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో ప్రణాళిక వ్యయం కింద మొత్తం రూ.5,406కోట్లు చూపగా, ఇందులో పెద్ద ఎత్తున వివిధ సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.2,374కోట్లు కే టాయించారు.
 
కృష్ణా, గోదావరి బోర్డులకు రూ.21కోట్లు
సాక్షి,హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ప్రభుత్వం రూ.21కోట్లు కేటాయించింది. ఇందులో కృష్ణా బోర్డుకు రూ.15కోట్లు, గోదావరి బోర్డుకు రూ.6కోట్లు కేటాయించారు. కృష్ణా, గోదావరి జల వివాదాలకు సంబంధించి ఏర్పడిన బోర్డుల నిర్వహ ణ వ్యయాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే భరించాలని కేంద్రం సూచించినా ఇప్పటివరకు నిధుల కేటాయింపు జరుగలేదు. దీనిపై బోర్డు చైర్మన్‌లు రాష్ట్రాలకు పదేపదే విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేసింది. ఇక వీటితో పాటే ప్రభుత్వం కొత్తగా చేపట్టదలిచిన జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు చెరో రూ.5కోట్ల మేర కేటాయింపులు చేసింది.
 
హోంశాఖకు రూ.2804 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలిబడ్జెట్‌లో ముందుగా ఊహించినట్టుగానే హోంశాఖకు భారీగా కేటాయించారు. పోలీసు, జైళ్ళు, ఫైర్ సర్వీసులు తదితర విభాగాలకు  కలిపి మొత్తం రూ.2804 కోట్లను కేటాయించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లకు సాధారణ కేటాయింపుల కింద రూ.754,98,31,000 మంజూరు కాగా, వీటిలో పోలీసు స్టేషన్ల ఆధునీకరణ, ట్రాఫిక్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు, నేరాల నివారణకు 186 కోట్లు అదనంగా కేటాయించారు. కాగా రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి, నేరాలను అదపుపు చేయడానికి రాష్ట్ర హోంశాఖకు కేటాయించిన బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని  రాష్ట్ర హోంశాఖ మంత్రి  నాయిని నరసింహారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement