రూ.5,858 కోట్ల రుణాన్ని మార్కెట్ నుంచి అదనంగా పొందేందుకు ఏపీకి కేంద్రం అనుమతించిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో చేసిన పోస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రం అప్పులపై ‘ఈనాడు’ రామోజీ అట్టడుగు స్థాయికి దిగజారి తప్పుడు కథనాలు ప్రచురించారని, నిరాధారమైన గణాంకాలతో దు్రష్పచారానికి దిగారని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయటమే లక్ష్యంగా అప్పులపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర అప్పులపై ఆర్బీఐ భయపడిందని, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించిందని, స్టాక్ ఎక్స్చేంజ్ మదుపరులను అప్రమత్తం చేసిందని, ఆర్థిక దిగ్గజాలు భయపడుతున్నారని, ఏపీ అప్పులను చూసి దేశం ఆశ్చర్యపోతోందంటూ దుర్మార్గంగా వండి వార్చిన కథనాలను చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పత్రికకు ఉన్న ద్వేషం, కక్ష అర్ధం అవుతున్నాయన్నారు. ఈనాడు కథనంలో డొల్లతనాన్ని నిరూపిస్తూ.. ఆర్బీఐ, కాగ్ అధికారిక నివేదికలను దువ్వూరి కృష్ణ బయటపెట్టారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాకు వాస్తవాలను వివరించారు. అవి ఆయన మాటల్లోనే...
అబద్ధాలే.. ఆధారాలేవి?
ఊహాజనిత గణాంకాలతో, లేని అప్పులు ఉన్నాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలను అచ్చు వేసింది. ప్రతి గొంతుతోనూ అబద్ధాలాడే ‘దశకంఠుడి’గా రామోజీ దిగజారిపోయారు. రాష్ట్ర అప్పులు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల మేరకు పరిమితికి లోబడే ఉన్నాయి. కోవిడ్‌తో రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ టీడీపీ హయాంలో కన్నా ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వృద్ధి తక్కువగా ఉంది.
మార్కెట్ రుణాలతో పాటు నాబార్డు, విద్యుత్ సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, బాండ్ల గ్యారెంటీతో పాటు గ్యారెంటీ ఇవ్వకుండా తీసుకున్న మొత్తం అప్పులు రూ.6.38 లక్షల కోట్లు మాత్రమే. దాన్ని రూ.10.11 లక్షల కోట్లగా పేర్కొంటూ ‘ఈనాడు’ ఏ అధికారిక నివేదిక ఆధారంగా రాసిందో చెప్పాలి. లేదంటే కాగ్, ఆర్బీఐ అధికారిక నివేదికల ప్రకారం నేను వెల్లడించిన గణాంకాలను ప్రచురించాలి.
పెండింగ్ బిల్లులపై సొంత లెక్కలా?
పెడింగ్ బిల్లులు రూ.21 వేల కోట్లు మాత్రమే ఉన్నాయని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించగా రూ.1.70 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులున్నట్లు రామోజీ పచ్చి అబద్ధాలు ఎలా ప్రచురిస్తారు? ప్రభుత్వం బడ్జెట్‌లో చేసే అప్పులతో పాటు గ్యారెంటీతో చేసిన అప్పులు, గ్యారెంటీ ఇవ్వని అప్పులన్నీ కూడా ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు అసెంబ్లీకి సమర్పించాం. ఈనాడు తనకు నచ్చిన ఊహాజనిత గణాంకాలతో అప్పులుపై తప్పుడు కధనాలు రాస్తోంది. అప్పులపై ఎన్నిసార్లు వాస్తవాలు వెల్లడించినా పదేపదే దు్రష్పచారానికి పాల్పడుతూ టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది.
హెచ్చరికలంటూ అవగాహనారాహిత్యం..
ఆర్బీఐ గానీ కేంద్ర ఆర్థికశాఖగానీ అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు. అసలు నిబంధనల మేరకు అప్పులకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనలు మీరితే అప్పులు ఇవ్వడం నిలిపేస్తారు. అంతేగానీ హెచ్చరికలు ఉండవు. ఈ మాత్రం కనీస అవగాహన కూడా రామోజీరావుకు లేదు. కేంద్రానికి గానీ రాష్ట్ర ప్రభుత్వాలకు గానీ అనధికారిక అప్పులు ఉండవనే సంగతి తెలియకపోవడం ‘ఈనాడు’ అవగాహనారాహిత్యానికి నిదర్శనం.
అనధికారిక అప్పులా?
మార్గదర్శి పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక డిపాజిట్లు సేకరించడం రామోజీకే చెల్లింది. ప్రభుత్వాలకు బ్యాంకులు గానీ, ఆర్థిక సంస్ధలు గానీ ఏ అప్పులిచ్చినా అవి అధికారికంగానే ఇస్తాయి. అనధికారికంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? మార్వాడీ దగ్గరకు వెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవడం కేంద్రంతో పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ప్రభుత్వానికి అప్పులు చెల్లించే ఉద్దేశం లేదంటూ మరో అబద్ధాన్ని ఈనాడు అచ్చేసింది. అప్పులను వాయిదాల ప్రకారం ప్రభుత్వాలు తీరుస్తూ ఉంటాయి. తీర్చకపోతే డిఫాల్ట్ అవుతాయి. అది కూడా తెలియదా?
గత అప్పులకు ఇప్పుడు కోత
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం టీడీపీ హయాంతో పోలిస్తే ఇప్పుడు తక్కువే. వాస్తవానికి గత సర్కారు నిబంధనల కంటే ఎక్కువగా అప్పులు చేసింది. దాంతో కేంద్రం ఇపుడు వాటిని తగ్గిస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ బాండ్ల జారీ ద్వారా రుణం తీసుకోవడానికి సెబీ అనుమతించింది. అయితే అవసరం లేదు కాబట్టి తీసుకోలేదు. దీన్ని కూడా వక్రీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధం అన్నట్లు తప్పుడు కథనాలు ప్రచురించారు.
పరిమితికి లోబడే గ్యారెంటీలు
గ్యారెంటీలు రాష్ట్ర ఆదాయంలో 80 శాతమే ఉన్నాయి. ఇవి నిబంధనల కన్నా తక్కువే. పెండింగ్ బిల్లుల విషయంలో ‘ఈనాడు’వి పచ్చి అబద్ధాలు. జీతాలు గానీ పెన్షన్లు గానీ ఆగలేదు. అలాంటప్పుడు ఇన్ని పెండింగ్ బిల్లులు ఎలా ఉంటాయి? కోవిడ్ కారణంగా రాష్ట్రం రూ.66 వేల కోట్లు ఆదాయం కోల్పోయినప్పటికీ టీడీపీ హయాంతో పోలిస్తే తక్కువగానే అప్పు చేసింది. గత సర్కారు హయాంతో పోల్చితే ఆస్తుల కల్పనకు వెచ్చించిన మూల ధన వ్యయం ఇప్పుడే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment