సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు నాటి నుంచి తాము అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన గణాంకాలతో కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దీనిని బుధవారం శాసనసభ ముందుంచారు. గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు, రెవెన్యూ రాబడులు, వసూళ్ల తీరు, ఇతర రాష్ట్రాలతో పోలుస్తూ గణాంకాలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, ఆర్‌బీఐ, కాగ్ నివేదికల్లో పేర్కొన్న అంశాలను పొందుపరిచారు. మొత్తం 22 పట్టికల్లో పలు గణాంకాలను వెల్లడించారు.
ఆర్థిక శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలివీ..
► బడ్జెట్ ప్రతిపాదనల్లో వాస్తవ ఖర్చు శాతం ఆందోళనకరం. 2014–15లో బడ్జెట్ అంచనాలతో పోలిస్తే వాస్తవ ఖర్చు 61.9శాతమే. 2014– 2023 మధ్య సగటు వ్యయం 82.3 శాతం. గత పదేళ్లలో రూ.14,87,834 కోట్ల మేర బడ్జెట్ అంచనాలను ప్రతిపాదిస్తే.. అందులో ఖర్చు చేసినది రూ.12,24,877 కోట్లు.
► కాంగ్రెస్ పాలనలో 2004–14 వరకు సగటు వ్యయం 87శాతం. మొత్తం రూ.10,04,326 కోట్ల అంచనాలకు గాను రూ.8,73,929 కోట్ల ఖర్చు జరిగింది.
► 1956–57లో ఉమ్మడి ఏపీ బడ్జెట్‌లో తెలంగాణ వాటా కింద రూ.33 కోట్లు ఖర్చు పెట్టగా.. 2013–14 నాటికి ఇది రూ.56,947 కోట్లకు చేరింది. మొత్తంగా గత 57 ఏళ్లలో అంటే 1956– 57 నుంచి 2013–14 వరకు తెలంగాణ లో జరిగిన ఖర్చు రూ.4,98,053 కోట్లు.
► ఈ నిధులతోనే ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టుతోపాటు నాగార్జునసాగర్, జూరాల, కోయల్‌సాగర్, దేవా దుల, శ్రీరాంసాగర్, కడెం లాంటి సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు, ట్రిపుల్‌ఐటీలు, వర్సిటీలు, వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, రోడ్లు–భవనాలు, కాల్వలు, విద్యుత్ లైన్లు, రక్షణ సంస్థలు, ఔషధ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయగలిగాం. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది సీఎంల కాలంలో తెలంగాణ అప్పు రూ.72,658 కోట్లు మాత్రమే.
► 2014–15 తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ రాబడులు అస్థిరంగా ఉన్నాయి. స్థూల ఉత్పత్తితో పోలిస్తే రెవెన్యూ రాబడులు 2015–16లో గరిష్టంగా 13.2శాతంగా ఉండగా.. 2018–19లో 11.8 శాతానికి క్షీణించాయి. అంటే కరోనా మహమ్మారికి ముందే ఆర్థిక మందగమనం ప్రారంభమైంది. ఇక రెవెన్యూ రాబడుల శాతం కూడా పడుతూ, లేస్తూ వచ్చింది. 2021–22లో తెలంగాణ కంటే కేవలం మరో ఐదు రాష్ట్రాలే తక్కువ రెవెన్యూ రాబడులు కలిగి ఉన్నాయి.
► పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే ఆదాయ వనరుల్లో పెరుగుదల లేని కారణంగా ద్రవ్యలోటు పెరిగింది. ఈ లోటును పూడ్చడానికి రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ రుణాలు గత పదేళ్లలో ఏటా సగటున 24.5శాతం చొప్పున పెరిగాయి. బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపించిన రుణాల్లో బడ్జెటేతర రుణాలను చేర్చలేదు.
ప్రభుత్వ హామీతో స్పెషల్ పర్పప్ వెహికిల్స్ (ఎస్పీవీలు) ఏర్పాటు చేసి ప్రభుత్వమే చెల్లించే విధంగా కొన్ని రుణాలు, ప్రభుత్వ హామీ ఉన్న ఎస్పీవీలు చెల్లించేలా మరికొన్ని, ప్రభుత్వ హామీ లేకుండా మరికొన్ని రుణాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు, హామీ ఇచ్చినవి, హామీలేనివి కలిపి మొత్తం అప్పు రూ.6,71,757 కోట్లకు చేరింది.
► ఈ అప్పులతో ఏటా రుణాల తిరిగి చెల్లింపు భారం పెరిగిపోయింది. 2014–15లో అప్పుల అసలు, వడ్డీ చెల్లింపులు రూ.6,954 కోట్లు కాగా..2023–24 నాటికి ఇది రూ.32,939 కోట్లకు చేరింది.
► మొత్తం రెవెన్యూ రాబడుల్లో రుణాల చెల్లింపుల భారం 2014–15లో 14 శాతం కాగా.. 2023–24 నాటికి 34 శాతానికి పెరిగింది. బహిరంగ మార్కెట్ రుణాల సగటు వడ్డీ రేటు 7.63 శాతం. కానీ గత ప్రభుత్వం గ్యారంటీలిచ్చి తీసుకున్న రుణాల్లో 95 శాతం రుణాల వడ్డీ రేటు 8.93 నుంచి 10.49 శాతం వరకు ఉంది.
► రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 24 ప్రభుత్వ శాఖల్లో 39,175 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఇందుకు రూ.3,49,843 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా.. రూ.1,89,903 కోట్లు వ్యయమైంది. మిగతా పనుల కోసం రూ.72,983 కోట్లను రుణాలు తీసుకోవాల్సి ఉంది.
► ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, డి్రస్టిబ్యూటర్లకు సంబంధించిన 4,78,168 బిల్లులను క్లియర్ చేయాల్సి ఉంది. ఈ బిల్లుల మొత్తం విలువ రూ.40,154 కోట్లు.
► ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల సగటు వార్షిక వృద్ధిరేటు 17 శాతం. 2014–15లో రూ.17,130 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లించగా.. 2021–22 నాటికి అది రూ.48,809 కోట్లకు చేరింది. రాష్ట్ర రాబడిలో ఇది 38 శాతం.
► కొన్నేళ్లుగా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలపై ఆధారపడటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణతను సూచిస్తోంది. 2014–15లో రాష్ట్ర ఖజనాలో 303 రోజులు నగదు నిల్వ ఉండగా..2023–24 (నవంబర్ 30వరకు) 30 రోజు లకు పడిపోయింది. 2022–23లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలను 328 రోజులు ఉపయోగించుకున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని తెలియజేస్తోంది.
► 2014–19 మధ్య రాష్ట్రం రెవెన్యూ మిగులును నమోదు చేయగా.. 2019–22 మధ్య జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీల వంటి చెల్లింపులు, పునరావృత ఖర్చులను తీర్చడానికి కూడా రెవెన్యూ రాబడులు మిగలలేదు.
► మొత్తం రాబడులు, వ్యయం మధ్య ఉండే తేడాను ద్రవ్యలోటు అంటారు. ఈ ద్రవ్యలోటు 2014–15లో రూ.9,410 కోట్లుకాగా.. 2015–16లో రూ.18,856 కోట్లు, 2016–17 నాటికి రూ.35,281 కోట్లకు చేరింది.
► కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ నివేదిక ప్రకారం.. 2023–24లో దేశంలోని రాష్ట్రాలు తమ బడ్జెట్‌లో 14.7 శాతం విద్యపై ఖర్చు చేస్తాయని అంచనా వేయగా.. తెలంగాణ 7.6శాతం ఖర్చు చేస్తుందని అంచనా వేసింది. ఇది జాతీయ సగటులో సగం మాత్రమే. ఇదే నివేదిక ప్రకారం వైద్యంపై ఖర్చు కేవలం 5 శాతం మాత్రమే.
పారదర్శకంగా అధిగమిస్తాం
మొత్తం 42 పేజీల్లో 13 అంశాలను కూలంకషంగా వివరిస్తూ ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ అంచనాలు–వాస్తవ వ్యయం, ఉమ్మడి ఏపీలో తెలంగాణలో చేసిన ఖర్చు, రెవెన్యూ వసూళ్లు, రుణాల తీరు, మూలధన వ్యయం, జీతభత్యాలు–పెన్షన్ల ఖర్చు, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఖర్చును అంశాల వారీగా వివరిస్తూ రూపొందించినట్టు తెలిపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా పొందిన ప్రభు త్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ప్రజలు మార్పు కోసం ఇచ్చిన ఆదేశాన్ని, పార్టీ వాగ్దానం చేసిన ఆరు హామీలను నెరవేర్చడానికి ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా, వివేకంతో, పారదర్శకంగా అధిగమించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment