భూములు గుంజుకునేందుకే..
► భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై విపక్షాల ధ్వజం
► మందబలంతో సవరణలు చేస్తోందని మండిపాటు
► చట్టంలోని సెక్షన్ 2, 3 ఎందుకు తొలగించారు: జానా
► బిల్లుపై సభలో అంతా గందరగోళం
► ముందుగా 107 సెక్షన్ కింద సవరణ తెస్తున్నామని వెల్లడి
► ఆ తర్వాత ఆర్టికల్ 254(2) ప్రకారం సవరిస్తున్నామని వివరణ
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్ట సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్రం తెచ్చిన భూ సేకరణ చట్టానికి సవరణ చేసే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ముఖ్యమంత్రి ప్రయ త్నాలన్నీ కోర్టుల్లో అభాసుపాలుకాక తప్పవని పేర్కొంది. భూ నిర్వాసితులకు రక్షణగా ఉన్న చట్టాన్ని సవరణ పేరుతో మార్చి యథేచ్ఛగా భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోం దని మండిపడింది. ‘‘మల్లన్నసాగర్ విషయం లో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. రైతులను బెదిరించి, పోలీసులతో భయపెట్టి బలవంతంగా భూములు తీసుకుంది. ఇప్పుడు మిగతా చోట్ల కూడా అదే పంథాను అవలంబిం చేందుకే కేంద్ర చట్టానికి సవరణ ప్రతిపాదిం చింది’’ అని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో వారు మాట్లా డారు. మందబలం ఉందని ప్రభుత్వం విప క్షాల మాటలను పరిగణనలోకి తీసుకోకుండా సవరణలు చేస్తోందని ఆరోపించారు. చట్ట సవరణ సబబా, కాదా అన్న విషయంపై తాము మాట్లాడుతుంటే మల్లన్నసాగర్ కేసు లను తమకు అంటగట్టి మాట్లాడ్డం సరికాదని జానారెడ్డి హితవు పలికారు. కేంద్ర చట్టం మెరుగ్గా లేకుంటే, దాన్ని ఎలా మెరుగు పరుస్తారో, సవరణ ద్వారా వచ్చే ప్రయోజనా లేంటో చెప్పమంటే అవి చెప్పకుండా అనవ సరంగా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయటం సరికాదని పేర్కొన్నారు. ‘‘మెరుగైన చట్టం తెస్తే మేమూ ఆహ్వానిస్తాం, కానీ నిర్వాసితులకు రక్ష ణగా ఉన్న 2, 3 సెక్షన్‌లను ఎందుకు తొలగిం చారో చెప్పాలి’’ అని జానారెడ్డి ప్రశ్నించారు.
జానారెడ్డి అసాంఘిక వ్యక్తా: జీవన్‌రెడ్డి
మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రతిప క్షాల నిరసనలపై సీఎం మాట్లాడిన తీరును జీవన్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘నిరసనల్లో పాల్గొన్న వారిని అసాంఘిక శక్తులంటున్నారు. అంటే సీఎల్‌పీ నేత జానారెడ్డి అసాంఘిక వ్యక్తా’’ అని సీఎంను ప్రశ్నించారు. భూ నిర్వా సితులకు అన్యాయం జరుగుతుంటే అండగా నిలవటం తప్పా అని పేర్కొన్నారు. చట్ట సవ రణతో మెరుగైన పరిహారం ఇస్తామని ప్రభు త్వం చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనం కనిపి స్తోందని, అక్కడి భుముల రిజిస్ట్రేషన్ విలు వను అప్‌డేట్ చేయకుండా దానిపై కొన్ని రెట్ల పరిహారం ఇస్తామంటే ఒరిగేదేంటని ప్రశ్నిం చారు. ముందుగా ఆ ధరలను అప్‌డేట్ చేయా లని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కాం గ్రెస్ సభ్యుల మైక్‌లు తరచూ కట్ చేయటం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ ఎదుట నిరసన తెలిపారు.
‘సవరణ’పై గందరగోళం
భూసేకరణ చట్ట సవరణ బిల్లు విషయంలో అంతా గందరగోళం నెలకొంది. చట్ట సవర ణకు రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని అధి కార పక్షం వాదించగా.. అది సాధ్యం కాదని, కోర్టుల్లో నిలవదని విపక్షాలు పేర్కొన్నాయి. ముందుగా సభ ముందుంచిన పత్రాలకు సవరణలు జోడించటంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో గందరగోళంలో ఉందని విపక్షాలు ఆరోపించాయి. 2013 భూసేకరణ చట్ట సవరణకు ఉద్దేశించిన బిల్లుగా ప్రభుత్వం దీన్ని పేర్కొంది. ఆ మేరకు పత్రాలను సభలో సభ్యులకు అందజేశారు. చట్టంలోని సెక్షన్ 107 కింద ఈ చట్టానికి సవరణ చేసే వెసులుబాటు ఉందని, దాని ఆధారంగానే చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. కానీ.. దాన్ని జానారెడ్డి తప్పుపట్టారు. ఆ సెక్షన్ దీనికి వర్తించదని కుండబద్దలు కొట్టారు. అప్పటి వరకు సీఎం సభలో లేరు. కాసేపటికి వచ్చిన ఆయన..సెక్షన్ 107 ఉటంకించకుండా రాజ్యాం గం కల్పించిన ఆర్టికల్ 254(2) ఆధారంగా చట్ట సవరణ చేయనున్నట్టు వెల్లడించారు. దీం తో గందరగోళం మరింత పెరిగింది. ‘‘కొత్తగా తెలంగాణ ఒక్కటే చేస్తున్న సవరణ కాదు. ఇప్పటికే రాజస్తాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలు సవరించుకు న్నాయి. ఇక్కడి ప్రాజెక్టుల గురించి నేను ఢిల్లీ వెళ్లి స్వయంగా ప్రధానితో చర్చించినప్పుడు ఆయనే చట్ట సవరణ సూచన చేశారు. ఆయన సూచన మేరకు ఇప్పుడు సవరణ బిల్లు పెట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఆమోదంతో చట్ట సవరణ
తామేదో గాలికి ఆలోచించి బిల్లు పెట్టలేదని, న్యాయ నిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ బిల్లు రూపొందించి దాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడి అధికారులకు చూపించి అంతా సవ్యం గానే ఉందని తేల్చుకున్న తర్వాతే సభలో బిల్లు ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. అయితే ఈ బిల్లుకు ఆమో దం పొందిన తర్వాత అది చట్టంగా మారాలంటే కచ్చితగా రాష్ట్రపతి ఆమోదం అవసరమని పేర్కొన్నారు. గతంలో చాలా రాష్ట్రాలు అలాగే చేశాయని, ఇప్పుడు తాము కూడా అలాగే చేయబోతున్నామని తెలిపారు. సభ అనంతరం దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పష్టత ఇచ్చారు. ఇది చట్ట సవరణ బిల్లేనని, ఆర్టికల్ 254 (2) కల్పించిన వెసులుబాటు ఆధారంగా బిల్లు ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.
అప్పటికప్పుడు సభ ముందు సవరణ నోట్...
చట్ట సవరణకు సంబంధించి సభ్యులకు అందించిన నోట్‌ను సవరించి మంత్రి హరీశ్ రావు కొత్త నోట్‌ను అందించారు. సెక్షన్ 107 కింద చట్ట సవరణ చేస్తున్నట్టు ఉన్న భాగాన్ని తొలగించి సీఎం విశదీకరించిన ఆర్టికల్ 254 ఆధారంగా సవరణ చేస్తున్న విషయాన్ని జోడిం చారు. దీని ఆధారంగానే సవరణ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.