ఆదుకునేందుకే అప్పులు | Duvvuri Krishna Comments About Andhra Pradesh Debts | Sakshi
Sakshi News home page

ఆదుకునేందుకే అప్పులు

Published Thu, Jul 29 2021 3:11 AM | Last Updated on Thu, Jul 29 2021 9:25 AM

Duvvuri Krishna Comments About Andhra Pradesh Debts - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆప్పులపై  ప్రతిపక్షాలతో పాటు కొన్ని పత్రికలు (‘సాక్షి’ కాదు) చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ స్పష్టం చేశారు. కోవిడ్‌ సమయంలో ప్రజల కష్టాలను తీర్చడానికి పరిమితికి లోబడే  అప్పులు చేస్తున్నామని, ఇందులో దాపరికం ఏమీ లేదని చెప్పారు. ప్రతిపక్షంతో పాటు కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చాలనే కుట్రలో భాగంగా తప్పుడు రాతలు, దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. అప్పులపై వాస్తవాలను బుధవారం ఆయన ఆర్‌ అండ్‌ బీ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కోవిడ్‌తో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రజల జీవనోపాధి కోసమే వ్యయం చేసిందని, నేరుగా నగదు బదిలీ ద్వారా ప్రజల ఖాతాలకు రూ.లక్ష కోట్లను ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. ఆర్ధిక మందగమనం సమయంలో అప్పు చేసైనా ప్రజలకు డబ్బులు అందించాలన్నది ఆర్ధిక నిపుణుల సూత్రమని, అప్పుడే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందని, అదే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేసిందని, ఇందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. 2019 – 20 నుంచే ఆర్ధిక మందగమనం ప్రారంభమైందని, ఆ ఆర్ధిక ఏడాదిలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.6,591 కోట్లు తగ్గిపోయాయని చెప్పారు. కోవిడ్‌ కారణంగా కేంద్ర పన్నుల వాటా నుంచి రావాల్సిన రాబడిలో రూ.7,780 పాటు రాష్ట్ర పన్నుల రాబడి రూ.7,000 కోట్లు తగ్గిపోగా మరో పక్క కరోనా నివారణ, నియంత్రణ చర్యల కోసం అదనంగా రూ.8,000 కోట్లు వ్యయం చేయాల్సి వచ్చిందని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందన్నారు. దువ్వూరి కృష్ణ ఇంకా ఏమన్నారంటే...

టీడీపీ సర్కారు పెంచింది అప్పులే
అప్పులు ఎక్కువ కావటానికి ప్రధాన కారణం.. గత సర్కారు రూ.1,20,556 కోట్ల అప్పులను రూ.2,68,115 కోట్లకు పెంచేసి ఎక్కడా మౌలిక వసతుల కల్పనకు వ్యయం చేయలేదు. బడ్జెట్‌ బయట మరో రూ.58 వేల కోట్లు అప్పు చేయడమే కాకుండా  మూడు ఆర్ధిక సంవత్సరాల్లో పరిమితికి మించి రూ.16,418 కోట్లు అప్పు చేసింది. టీటీపీ సర్కారు పరిమితికి మించి చేసిన అప్పుల వల్లే నేడు అప్పుల్లో కోత పడుతోంది. అంతేకాకుండా టీడీపీ సర్కారు దిగిపోయేనాటికి ఏకంగా రూ.38,000 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టింది. విద్యుత్‌ రంగంతో పాటు డిస్కమ్‌ల పేరిట భారీ అప్పులు చేయడమే కాకుండా బిల్లులు బకాయిలు పెట్టింది. 

ఆ నిర్వాకాలకు తోడు కోవిడ్‌తో ఆర్థిక కష్టాలు..
గత సర్కారు తీసుకున్న అప్పులను ఉత్పాదక రంగంపై వెచ్చించకపోగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేసింది. టీడీపీ సర్కారు దుర్వినియోగ చర్యలతో విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఆర్ధిక సమస్యల్లోకి గెంటేసింది. ఆ ఇబ్బందులకు తోడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవిడ్‌ కష్టాలు చుట్టుముట్టాయి.

‘మాఫీ’ లేదు.. విద్య, వైద్యంపై నిర్లక్ష్యం
టీడీపీ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసింది. రైతులకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పింది. దీంతో రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని 2016–17 నాబార్డు సర్వే స్పష్టం చేసింది. దేశంలో వ్యవసాయ కుటుంబాలు సగటున 47 శాతం అప్పుల్లో ఉండగా రాష్ట్రంలో ఏకంగా 77 శాతం అన్నదాతల కుటుంబాలు అప్పుల్లో ఉన్నట్లు సర్వే తెలిపింది. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాథమిక విద్య గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో దేశ సగటు 99 శాతం కాగా అత్యల్పంగా రాష్ట్రంలో కేవలం 84.48 శాతమే ఉంది. దీన్నిబట్టి టీటీపీ ప్రభుత్వం అప్పులను ఎలా విచ్చలవిడిగా వ్యయం చేసిందో బోధపడుతోంది.

ఇప్పడు జీవనోపాధి, వ్యవసాయం, వైద్య, విద్య రంగాలకు వ్యయం
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ సంక్షోభంలో కూడా పరిమితికి లోబడి అప్పులు చేస్తూ ఒకపక్క ప్రజలను నగదు బదిలీ ద్వారా ఆదుకుంటూ మరోపక్క విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు  కార్యక్రమాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. కోవిడ్‌ కారణంగా పలు దేశాలతో పాటు రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మన రాష్ట్రం కూడా అదే తరహాలో అప్పులు చేస్తున్నా వాటిని కోవిడ్‌ విపత్తులో ప్రజలకు జీవనోపాధి కల్పిచడం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయం చేసింది. ఈ చర్యల వల్లే ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలబడింది.

నాడు విద్యుత్‌ అప్పులతో యూనిట్‌కు రూ.1.20 భారం
గత ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో చేసిన అప్పుల కారణంగా ప్రతీ యూనిట్‌పై రూ.1.20 చొప్పున భారం పడింది. విద్యుత్‌ రంగంలో అప్పులను టీడీపీ సర్కారు రూ.33,587 కోట్ల నుంచి రూ.70,254 కోట్లకు పెంచింది. డిస్కమ్‌ల బకాయిలను రూ.2893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెంచి భారం మోపింది.

అక్కడ అమ్మకం.. ఇక్కడ తనఖా మాత్రమే
ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా తెలంగాణ సర్కారు భూముల అమ్మకం ద్వారా రూ.15 వేల కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని బడ్జెట్‌లో కూడా పొందుపరిచింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భూముల విక్రయాల ద్వారా దాదాపు రూ.3 వేల కోట్ల ఆదాయం పొందింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం భూములను విక్రయించకుండా కేవలం తనఖా పెట్టడం ద్వారా రుణాలను సమీకరిస్తోంది.

    
నోట్‌: ఈ పట్టిక చూస్తే ఎవరి పాలనలో అప్పులు భారీగా పెరిగాయో అర్థం అవుతుంది. చంద్రబాబు హయాంలో కేంద్రం చేసిన అప్పుల వృద్ధి రేటు కంటే రాష్ట్రం అప్పుల వృద్ధి రెండు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర అప్పుల వృద్ధితో పోలిస్తే రాష్ట్రంలో అప్పుల వృద్ది 
తక్కువగా నమోదైందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement