దుష్ట చతుష్టయం దొంగ లెక్కలు | Nirmala Sitharaman In Lok Sabha on State Debts Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దుష్ట చతుష్టయం దొంగ లెక్కలు

Published Tue, Jul 26 2022 3:36 AM | Last Updated on Tue, Jul 26 2022 7:48 AM

Nirmala Sitharaman In Lok Sabha on State Debts Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: దుష్ట చతుష్టయం, అభివృద్ధి నిరోధక శక్తుల తప్పుడు లెక్కల బండారం పార్లమెంట్‌ సాక్షిగా బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేస్తోందని, ఏకంగా రూ.8 లక్షల కోట్లకుపైగా రుణాలు తీసుకుందంటూ పదేపదే చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు కూడా వాస్తవం లేదని తాజాగా పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నా దుష్ట చతుష్టయం పదేపదే బురద చల్లుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నిస్తోంది.

అభివృద్ధి నిరోధక శక్తులకు చెంపపెట్టు
రాష్ట్ర అప్పులపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏకరువు పెట్టే కథనాలు, వాటి ఆధారంగా టీడీపీ బృందం చేస్తున్న ప్రచారం అంతా పచ్చి బూటకమని తేలిపోయింది. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం పలుదఫాలు వాస్తవాలను గణాంకాలతో సహా వివరించినా ఏమాత్రం బాధ్యత లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్న అభివృద్ధి నిరోధక శక్తులకు పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానం చెంపపెట్టులా పరిణమించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పుల భారంపై హిమాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్‌ అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఆ వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.3,98,903.60 కోట్లేనని తేలింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి అంటే 2019 మే నెలాఖరు నాటికి రాష్ట్రం అప్పులు రూ.2,68,115.00 కోట్లుగా ఉన్నాయి. అంటే మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1,30,788.6 కోట్లు మాత్రమే అప్పులు చేసినట్లు స్పష్టమైంది. అప్పుల్లో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌ అంటూ దుష్ట చతుష్టయం చేస్తున్న దుర్మార్గమైన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనే స్పష్టం చేస్తోంది. 

బాబు జమానాలో రూ.1.62 లక్షల కోట్లకు లెక్కల్లేవ్‌
ఏపీలో బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా రూ.లక్షల కోట్లు వ్యయం చేశారని, అది కేంద్రం దృష్టికి వచ్చిందా? ఏం చర్యలు తీసుకున్నారంటూ రాజ్యసభలో టీటీపీ సభ్యుడు కనకమేడల ఇటీవల ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానం ఇస్తూ 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రూ.1.62 లక్షల కోట్లకు లెక్కలు లేవని, కేటాయింపులు లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా వ్యయం చేశారని వెల్లడించారు. కాగ్‌ నివేదికలోనూ ఇది స్పష్టంగా ఉందని తెలిపారు. దీంతో బాబు సర్కారు బండారం బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించి భంగపడి తమ అధినేత నిర్వాకాలనే కనకమేడల పార్లమెంట్‌ వేదికగా చాటి చెప్పారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
అప్పుల్లో తమిళనాడు టాప్‌
సాక్షి, న్యూఢిల్లీ: ‘స్టేట్‌ ఫైనాన్స్‌లు: 2021–22 బడ్జెట్ల అధ్యయనం’ పేరుతో రిజర్వు బ్యాంక్‌ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం బకాయిల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు. సోమవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం అప్పులకు సంబంధించి 2020 మార్చి చివరి నాటికి రుణాలు, 2021 మార్చి సవరించిన అంచనాలు, 2022 మార్చి నాటికి బడ్జెట్‌ అంచనాలను పార్లమెంట్‌కు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి చివరికి బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ మొత్తం అప్పు రూ.3,98,903.6 కోట్లు కాగా తెలంగాణ మొత్తం అప్పు రూ.3,12,191.3 కోట్లుగా ఉందని తెలిపారు. అప్పుల్లో తమిళనాడు రూ.6,59,868 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర  రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో నిలిచింది.

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే..
అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనతో వెల్లడైంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి బడ్జెట్‌ అంచనాల మేరకు వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను ఆమె లోక్‌సభకు తెలియచేశారు. రాష్ట్రాల అప్పులకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రతి ఏడాది కేంద్ర ఆర్థిక శాఖ అనుమతులు ఇస్తుందని, దాని ప్రకారమే అప్పులు చేస్తాయని, ఏ ఆర్థిక ఏడాదైనా అనుమతికి మించి అప్పులు చేస్తే మరుసటి సంవత్సరంలో సర్దుబాటు చేస్తుందని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement