అక్రమ పార్కింగ్లకు షాకివ్వబోతున్న ప్రభుత్వం
అక్రమ పార్కింగ్లకు షాకివ్వబోతున్న ప్రభుత్వం
Published Mon, Dec 26 2016 10:51 AM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
రోడ్లపై వాహనాల అక్రమ పార్కింగ్లపై భారీ మొత్తంలో కొరడా ఝళిపించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. జరిమానాలు పెంచేందుకు ఓ కొత్త విధానంతో ముందుకు రాబోతుంది. ప్రస్తుతమున్న రూ.200 అక్రమ పార్కింగ్ పెనాల్టీలను రూ.1000కి పెంచనున్నట్టు కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారి తెలిపారు. నాగపూర్లోని స్మార్ట్సిటీ వర్క్షాపులో ప్రసంగించిన ఆయన, వాహనాల అక్రమ పార్కింగ్ల నుంచి రోడ్లను బయటపడేయనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుతో కలిసి అక్రమ పార్కింగ్లను సమర్థవంతంగా గుర్తిస్తామని చెప్పారు. కొత్త పాలసీతో అక్రమ పార్కింగ్లకు వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కొన్నారు.
అడ్డదిడ్డంగా రోడ్లపై వాహనాలు పార్క్ చేసిన వారి సమాచారం తమకు అందించిన ఫిర్యాదుదారునికీ రూ.200 వరకు రివార్డు అందించనున్నట్టు తెలిపారు. రోడ్లపై అక్రమంగా పార్క్ చేసిన వాహనాల ఫోటో తీసి, ట్రాఫిక్ పోలీసు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిస్టమ్లో పెట్టగలరని సూచించారు. జరిమానాల రూపంలో సేకరించిన నగదును రోడ్ల అభివృద్ధిపై ఖర్చుచేస్తామని గడ్కారి చెప్పారు. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్లో నగరాలను అత్యంత ఉన్నంతంగా తీర్చిదిద్దేందుకు సరైన ప్రణాళిక తమకు అవసరమన్నారు. పార్కింగ్ స్థలం లేనిది బిల్డింగ్ల కట్టడాలకు అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు.
Advertisement
Advertisement