illegal parking
-
Hyderabad: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు
సాక్షి, హైదరాబాద్: సెల్లార్లనూ వ్యాపారాలకు అద్దెకు ఇచ్చేసి సరైన పార్కింగ్ వసతి లేకుండా సాగుతున్న వాణిజ్య భవనాలపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. బుధవారం నుంచి వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్న అధికారులు పక్షం రోజుల పాటు అవగాహన కల్పించనున్నారు. ఆపై కేవలం అక్రమ పార్కింగ్ చేసిన వాహన చోదకులకే కాదు.. అలాంటి భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారి, దాన్ని అద్దెకు ఇచ్చిన యజమాని పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ► నగరంలోని అనేక వాణిజ్య సముదాయాలు, భవనాలకు సరైన పార్కింగ్ వసతి ఉండట్లేదు. నిర్మాణంలో ఉన్నప్పుడు సెల్లార్‌ను పార్కింగ్ ప్రాంతంగా చూపించి అనుమతి పొందుతున్నారు. ఆపై దాన్ని కూడా అద్దెకు ఇచ్చేయడమో, వ్యాపార, ఇతర అవసరాలకు వాడుకోవడమో చేస్తున్నారు. ఫలితంగా ఆయా భవనాలు, సముదాయాలకు వచ్చే వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాహనాలను రోడ్లపై ఆపాల్సి వస్తోంది. కేవలం వాణిజ్య లావాదేవీలు జరిగే భవనాలే కాదు అనేక ఆస్పత్రులదీ ఇదే తీరు. ఇప్పటి వరకు తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం వాహనచోదకులకే పడుతూ వచ్చింది. రహదారి పైనో, క్యారేజ్ వేలోనో, ఫుట్‌పాత్ మీదో వాహనాన్ని అక్రమంగా పార్క్ చేశారంటూ ట్రాఫిక్ జరిమానా విధించడమో, ఆ వాహనాన్ని టోవింగ్ చేసి మరో చోటకు తరలించడమో చేస్తున్నారు. ► ఈ కారణంగా వస్తువులు ఖరీదు చేయడానికో, సేవలు పొందడానికో వచ్చిన వినియోగదారుడి పైనే భారం పడుతోంది. దీన్ని గమనించిన సిటీ ట్రాఫిక్ విభాగం అధికారులు సమగ్ర విధానం రూపొందించారు. ఈ తరహా ఉల్లంఘనల విషయంలో వాహన చోదకుల కంటే పార్కింగ్ వసతులు కల్పించని, ఉన్న వానిటీ దుర్వినియోగం చేస్తున్న వారి పైనే ఎక్కువ బాధ్యత ఉందని నిర్ణయించారు. దీన్ని అమలులోకి తీసుకువస్తూ ప్రత్యేక డ్రైవ్స్ ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసు బృందాలు పక్షం రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలు, మాల్స్ వద్ద అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాతి నుంచి వాహనచోదకుడితో పాటు సరైన పార్కింగ్ వసతి లేకుండా అద్దెకు ఇస్తే భవన యజమాని, పార్కింగ్‌ను వాణిజ్య అవసరాలకు మార్చేస్తే ఆ వ్యాపారిపై కేసులు నమోదు చేయనున్నారు. (క్లిక్: వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు) -
వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు
బంజారాహిల్స్(హైదరాబాద్): ఏడేళ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే పోలీసులు వాటి చక్రాలకు వీల్ క్లాంప్లు వేసి జరిమానాలు విధించేవారు. ఈ విధానంపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ విధానం నుంచి వైదొలిగారు. తాజాగా వారం రోజులుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల వాహనాలు పార్కింగ్ చేస్తే ఆ వాహనాలకు వీల్ క్లాంప్ వేయడంతో పాటు సదరు వాహనంపై జరిమానా స్టిక్కర్‌ను, ఆ ఏరియాలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారుల నంబర్ వేస్తారు. తగిన జరిమానా చెల్లించిన తర్వాత వాహనాన్ని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలతో.. రోడ్ల పక్కన, షాపుల వద్ద, సినిమా హాళ్ల వద్ద, ఆస్పత్రులు, పార్కులు, నివాసా లు అనే తేడా లేకుండా అక్రమ పార్కింగ్‌లతో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపూ ద్విచక్ర వాహనదారుల నుంచే పెండింగ్ జరిమానాలు వసూలు చేస్తూ కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక నుంచి వీల్‌క్లాంప్ వేసిన కార్ల నుంచి కూడా పెండింగ్ జరిమానాలు వసూలు చేసేందుకు పోలీసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల వద్ద ఆందోళన... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ ప్రాంతాలు ప్రధాన ఆస్పత్రులకు నెలవుగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఆస్పత్రులకు వస్తుంటారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో, సోమాజిగూడ యశోద, బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి పెద్ద ఎత్తున రోగులు వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకొని ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక రోడ్లపక్కన ఖాళీగా ఉన్న స్థలాల్లో పార్కింగ్ చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలుపుతున్న వారిని ఈ తరహా జరిమానాలు, క్లాంప్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగుల కోరుతున్నారు. ఎందుకంటే ఏ ఆస్పత్రికి కూడా సరిపడా పార్కింగ్ సదుపాయాలు లేవు. (క్లిక్: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు) నిత్యం 15 వరకు కేసులు.. అక్రమంగా పార్కింగ్ చేసిన ప్రాంతాలకు ట్రాఫిక్ పోలీసులు వెళ్లి ఆ కార్లకు వీల్ క్లాంప్లు వేస్తూ ఓ స్టిక్కర్ అంటించి దాని మీద సంబంధిత అధికారి ఫోన్ నంబర్ రాస్తున్నారు. పార్కింగ్ చేసిన వాహనదారు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే ఎస్ఐ వెళ్లి వీల్ క్లాంప్ తొలగించి రూ. 600 జరిమానా విధించి పెండింగ్ జరిమానాలు కూడా క్లియర్ చేస్తారు. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు 15 వరకు కేసులు నమోదు చేస్తున్నాం. – జ్ఞానేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, పంజగుట్ట -
రాంగ్ పార్కింగ్ చేస్తే రూ.23 వేలు కట్టాల్సిందే..!
ముంబై : అక్రమ పార్కింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఎక్కడపడితే అక్కడ బండి పార్కింగ్ చేసే వారి జేబుకు భారీ చిల్లు పడనుంది. ముంబైలో ఉన్న 26 పబ్లిక్ పార్కింగ్ జోన్లలో కాకుండా ఇతర చోట్ల వాహనాలు నిలిపి ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తున్నామని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మంబై ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఆదివారం (జూలై 7) నుంచి అమలౌతున్న కొత్త నిబంధనల ప్రకారం.. పైన పేర్కొన్న పార్కింగ్ జోన్లలో కాకుండా వాటికి 500 మీటర్ల లోపున అక్రమ పార్కింగ్ చేసేవారికి.. ద్విచక్రవాహనాలకు రూ.5 వేల నుంచి 8,300, ఫోర్ వీలర్‌కైతే రూ.10 వేల నుంచి రూ.23,250, త్రీ వీలర్‌కైతే రూ.8 వేల నుంచి 12,200 వరకు పెనాల్టీ విధిస్తారు. ఇక మీడియం వాహనాలకు 11 వేల నుంచి 17 వేలు, లైట్ మోటార్ వాహనాలకైతే రూ.10 వేల నుంచి 15 వేల చలాన్లు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అక్రమ పార్కింగ్ ద్వారా ట్రాఫిక్ జామ్ అవడంతోపాటు రోడ్డు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. చలాన్ల రేట్లలో తొలుత తక్కువ మొత్తంలోనే జరిమానా విధిస్తామని, వాటిని చెల్లించడంలో ఆలస్యం చేసేకొద్దీ పెనాల్టీ మొత్తం రోజురోజుకీ పెరుగుతుందని చెప్పారు. మంబై మహానగరంలో దాదాపు 30 లక్షల వాహనాలు ఉండటం గమనార్హం. ట్రాఫిక్ సిబ్బందికి తోడుగా మాజీ సైనికోద్యోగులు, ప్రైవేటు సెక్కురిటీ సిబ్బంది సేవల్ని కూడా వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. -
అక్రమ పార్కింగ్‌లకు షాకివ్వబోతున్న ప్రభుత్వం
రోడ్లపై వాహనాల అక్రమ పార్కింగ్‌లపై భారీ మొత్తంలో కొరడా ఝళిపించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమవుతోంది. జరిమానాలు పెంచేందుకు ఓ కొత్త విధానంతో ముందుకు రాబోతుంది. ప్రస్తుతమున్న రూ.200 అక్రమ పార్కింగ్ పెనాల్టీలను రూ.1000కి పెంచనున్నట్టు కేంద్ర రోడ్డు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారి తెలిపారు. నాగపూర్‌లోని స్మార్ట్‌సిటీ వర్క్‌షాపులో ప్రసంగించిన ఆయన, వాహనాల అక్రమ పార్కింగ్‌ల నుంచి రోడ్లను బయటపడేయనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసుతో కలిసి అక్రమ పార్కింగ్‌లను సమర్థవంతంగా గుర్తిస్తామని చెప్పారు. కొత్త పాలసీతో అక్రమ పార్కింగ్‌లకు వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కొన్నారు. అడ్డదిడ్డంగా రోడ్లపై వాహనాలు పార్క్ చేసిన వారి సమాచారం తమకు అందించిన ఫిర్యాదుదారునికీ రూ.200 వరకు రివార్డు అందించనున్నట్టు తెలిపారు. రోడ్లపై అక్రమంగా పార్క్ చేసిన వాహనాల ఫోటో తీసి, ట్రాఫిక్ పోలీసు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిస్టమ్‌లో పెట్టగలరని సూచించారు. జరిమానాల రూపంలో సేకరించిన నగదును రోడ్ల అభివృద్ధిపై ఖర్చుచేస్తామని గడ్కారి చెప్పారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో నగరాలను అత్యంత ఉన్నంతంగా తీర్చిదిద్దేందుకు సరైన ప్రణాళిక తమకు అవసరమన్నారు. పార్కింగ్ స్థలం లేనిది బిల్డింగ్‌ల కట్టడాలకు అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు.