ముంబై : అక్రమ పార్కింగ్‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై ప్రజలకు కాస్త ఉపశమనం లభించనుంది. ఎక్కడపడితే అక్కడ బండి పార్కింగ్ చేసే వారి జేబుకు భారీ చిల్లు పడనుంది. ముంబైలో ఉన్న 26 పబ్లిక్ పార్కింగ్ జోన్లలో కాకుండా ఇతర చోట్ల వాహనాలు నిలిపి ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తున్నామని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మంబై ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఆదివారం (జూలై 7) నుంచి అమలౌతున్న కొత్త నిబంధనల ప్రకారం..
పైన పేర్కొన్న పార్కింగ్ జోన్లలో కాకుండా వాటికి 500 మీటర్ల లోపున అక్రమ పార్కింగ్ చేసేవారికి.. ద్విచక్రవాహనాలకు రూ.5 వేల నుంచి 8,300, ఫోర్ వీలర్‌కైతే రూ.10 వేల నుంచి రూ.23,250, త్రీ వీలర్‌కైతే రూ.8 వేల నుంచి 12,200 వరకు పెనాల్టీ విధిస్తారు. ఇక మీడియం వాహనాలకు 11 వేల నుంచి 17 వేలు, లైట్ మోటార్ వాహనాలకైతే రూ.10 వేల నుంచి 15 వేల చలాన్లు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
అక్రమ పార్కింగ్ ద్వారా ట్రాఫిక్ జామ్ అవడంతోపాటు రోడ్డు అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. చలాన్ల రేట్లలో తొలుత తక్కువ మొత్తంలోనే జరిమానా విధిస్తామని, వాటిని చెల్లించడంలో ఆలస్యం చేసేకొద్దీ పెనాల్టీ మొత్తం రోజురోజుకీ పెరుగుతుందని చెప్పారు. మంబై మహానగరంలో దాదాపు 30 లక్షల వాహనాలు ఉండటం గమనార్హం. ట్రాఫిక్ సిబ్బందికి తోడుగా మాజీ సైనికోద్యోగులు, ప్రైవేటు సెక్కురిటీ సిబ్బంది సేవల్ని కూడా వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment