సాక్షి, హైదరాబాద్: సెల్లార్లనూ వ్యాపారాలకు అద్దెకు ఇచ్చేసి సరైన పార్కింగ్ వసతి లేకుండా సాగుతున్న వాణిజ్య భవనాలపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. బుధవారం నుంచి వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్న అధికారులు పక్షం రోజుల పాటు అవగాహన కల్పించనున్నారు. ఆపై కేవలం అక్రమ పార్కింగ్ చేసిన వాహన చోదకులకే కాదు.. అలాంటి భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారి, దాన్ని అద్దెకు ఇచ్చిన యజమాని పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
► నగరంలోని అనేక వాణిజ్య సముదాయాలు, భవనాలకు సరైన పార్కింగ్ వసతి ఉండట్లేదు. నిర్మాణంలో ఉన్నప్పుడు సెల్లార్‌ను పార్కింగ్ ప్రాంతంగా చూపించి అనుమతి పొందుతున్నారు. ఆపై దాన్ని కూడా అద్దెకు ఇచ్చేయడమో, వ్యాపార, ఇతర అవసరాలకు వాడుకోవడమో చేస్తున్నారు. ఫలితంగా ఆయా భవనాలు, సముదాయాలకు వచ్చే వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాహనాలను రోడ్లపై ఆపాల్సి వస్తోంది. కేవలం వాణిజ్య లావాదేవీలు జరిగే భవనాలే కాదు అనేక ఆస్పత్రులదీ ఇదే తీరు. ఇప్పటి వరకు తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం వాహనచోదకులకే పడుతూ వచ్చింది. రహదారి పైనో, క్యారేజ్ వేలోనో, ఫుట్‌పాత్ మీదో వాహనాన్ని అక్రమంగా పార్క్ చేశారంటూ ట్రాఫిక్ జరిమానా విధించడమో, ఆ వాహనాన్ని టోవింగ్ చేసి మరో చోటకు తరలించడమో చేస్తున్నారు.
► ఈ కారణంగా వస్తువులు ఖరీదు చేయడానికో, సేవలు పొందడానికో వచ్చిన వినియోగదారుడి పైనే భారం పడుతోంది. దీన్ని గమనించిన సిటీ ట్రాఫిక్ విభాగం అధికారులు సమగ్ర విధానం రూపొందించారు. ఈ తరహా ఉల్లంఘనల విషయంలో వాహన చోదకుల కంటే పార్కింగ్ వసతులు కల్పించని, ఉన్న వానిటీ దుర్వినియోగం చేస్తున్న వారి పైనే ఎక్కువ బాధ్యత ఉందని నిర్ణయించారు. దీన్ని అమలులోకి తీసుకువస్తూ ప్రత్యేక డ్రైవ్స్ ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసు బృందాలు పక్షం రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలు, మాల్స్ వద్ద అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాతి నుంచి వాహనచోదకుడితో పాటు సరైన పార్కింగ్ వసతి లేకుండా అద్దెకు ఇస్తే భవన యజమాని, పార్కింగ్‌ను వాణిజ్య అవసరాలకు మార్చేస్తే ఆ వ్యాపారిపై కేసులు నమోదు చేయనున్నారు. (క్లిక్: వీల్ క్లాంప్‌లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు)
Comments
Please login to add a commentAdd a comment