Cellar Parking
-
Hyderabad: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు
సాక్షి, హైదరాబాద్: సెల్లార్లనూ వ్యాపారాలకు అద్దెకు ఇచ్చేసి సరైన పార్కింగ్ వసతి లేకుండా సాగుతున్న వాణిజ్య భవనాలపై హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. బుధవారం నుంచి వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతున్న అధికారులు పక్షం రోజుల పాటు అవగాహన కల్పించనున్నారు. ఆపై కేవలం అక్రమ పార్కింగ్ చేసిన వాహన చోదకులకే కాదు.. అలాంటి భవనంలో వ్యాపారం చేస్తున్న వ్యాపారి, దాన్ని అద్దెకు ఇచ్చిన యజమాని పైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ► నగరంలోని అనేక వాణిజ్య సముదాయాలు, భవనాలకు సరైన పార్కింగ్ వసతి ఉండట్లేదు. నిర్మాణంలో ఉన్నప్పుడు సెల్లార్‌ను పార్కింగ్ ప్రాంతంగా చూపించి అనుమతి పొందుతున్నారు. ఆపై దాన్ని కూడా అద్దెకు ఇచ్చేయడమో, వ్యాపార, ఇతర అవసరాలకు వాడుకోవడమో చేస్తున్నారు. ఫలితంగా ఆయా భవనాలు, సముదాయాలకు వచ్చే వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ వాహనాలను రోడ్లపై ఆపాల్సి వస్తోంది. కేవలం వాణిజ్య లావాదేవీలు జరిగే భవనాలే కాదు అనేక ఆస్పత్రులదీ ఇదే తీరు. ఇప్పటి వరకు తప్పు ఎవరిదైనా శిక్ష మాత్రం వాహనచోదకులకే పడుతూ వచ్చింది. రహదారి పైనో, క్యారేజ్ వేలోనో, ఫుట్‌పాత్ మీదో వాహనాన్ని అక్రమంగా పార్క్ చేశారంటూ ట్రాఫిక్ జరిమానా విధించడమో, ఆ వాహనాన్ని టోవింగ్ చేసి మరో చోటకు తరలించడమో చేస్తున్నారు. ► ఈ కారణంగా వస్తువులు ఖరీదు చేయడానికో, సేవలు పొందడానికో వచ్చిన వినియోగదారుడి పైనే భారం పడుతోంది. దీన్ని గమనించిన సిటీ ట్రాఫిక్ విభాగం అధికారులు సమగ్ర విధానం రూపొందించారు. ఈ తరహా ఉల్లంఘనల విషయంలో వాహన చోదకుల కంటే పార్కింగ్ వసతులు కల్పించని, ఉన్న వానిటీ దుర్వినియోగం చేస్తున్న వారి పైనే ఎక్కువ బాధ్యత ఉందని నిర్ణయించారు. దీన్ని అమలులోకి తీసుకువస్తూ ప్రత్యేక డ్రైవ్స్ ప్రారంభించారు. ట్రాఫిక్ పోలీసు బృందాలు పక్షం రోజుల పాటు ఆయా ప్రాంతాల్లోని వాణిజ్య భవనాలు, మాల్స్ వద్ద అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాతి నుంచి వాహనచోదకుడితో పాటు సరైన పార్కింగ్ వసతి లేకుండా అద్దెకు ఇస్తే భవన యజమాని, పార్కింగ్‌ను వాణిజ్య అవసరాలకు మార్చేస్తే ఆ వ్యాపారిపై కేసులు నమోదు చేయనున్నారు. (క్లిక్: వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు) -
హైదరాబాద్‌లో పోడియం పార్కింగ్ !
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లో పోడియం పార్కింగ్‌కు కూడా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర భవన నిర్మాణ నియమావళి (జీవో నం.168)కు ఈ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్, ఆపై కొన్ని ఫ్లోర్లను పార్కింగ్ అవసరాలకు తగ్గట్లు నిర్మించుకుని, ఆ తర్వాతి ఫ్లోర్లను నివాస/కమర్షియల్ అవసరాల కోసం నిర్మించుకోవడానికి పోడియం పార్కింగ్ రూల్స్ వీలు కల్పించనున్నాయి. దీంతో అండర్ గ్రౌండ్ పార్కింగ్, పోడియం పార్కింగ్ రెండింటిలో ఏదో ఒక పార్కింగ్ సదుపాయాన్ని ఎంపిక చేసుకుని నిర్మాణాలు చేపట్టడానికి బిల్డర్లు, డెవలపర్లకు అవకాశం కలిగింది. అండర్ గ్రౌండ్‌పై నిషేధం లేదు రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను నిషేధించలేదని, కొత్తగా పోడియం పార్కింగ్ రూల్స్‌ను మాత్రమే అమల్లోకి తెచ్చినట్టు పురపాలక శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ రెండు పార్కింగ్ సదుపాయాల్లో ఏదో ఒక దాన్ని బిల్డర్లు, డెవలపర్లు ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేశారు. పోడియం పార్కింగ్ రూల్స్ పోడియం ఫ్లోర్ గరిష్ట ఎత్తు 15 మీటర్లు ఉండాలి. భవన నిర్మాణ నియమావళి, అప్రోచ్ రోడ్డు వైశాల్యం ఆధారంగా భవనం ఎత్తు ఉండాలి. పదెకరాలకు పైబడిన స్థలంలో నిర్మించే భవనాల్లో తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ పోడియం ఫ్లోర్లు ఉండాలి. భవనం ఎత్తు, సెట్ బ్యాక్స్ లెక్కించే సమయంలో పోడియం ఫ్లోర్ల ఎత్తును పరిగణనలోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించారు. పోడియం సెట్‌బ్యాక్స్... - 55 మీటర్ల వరకు ఎత్తు గల భవనం విషయం లో 12 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో 7 మీటర్ల సెట్ బ్యాక్ తప్పనిసరి. రెండు పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్ డ్రైవ్ అవే) 7 మీటర్లు ఉండాలి. - 55 మీటర్లకు మించి ఎత్తు కలిగిన భవనాల విషయంలో 14 మీటర్ల టర్నింగ్ రేడియస్‌తో 7 మీటర్ల సెట్‌బ్యాక్ తప్పనిసరి. పోడియం బ్లాక్‌ల మధ్య అగ్నిమాపక అవసరాలకు వినియోగించే మార్గం (ఫైర్ డ్రైవ్ అవే) 9 మీటర్లు ఉండాలి. - పోడియంపై ఉండే భవనం సెట్ బ్యాక్‌లు బిల్డింగ్ రూల్స్‌కు అనుగుణంగా ఉండాలి. పోడియానికి వదిలిన సెట్‌బ్యాక్‌ను సైతం భవనం సెట్‌బ్యాక్‌లో భాగంగా పరిగణిస్తారు. - పోడియం ఫ్లోర్లను అనుమతిస్తే బేస్మెంట్/సెల్లార్ ఫ్లోర్ల సంఖ్యపై ఆంక్షలు ఉంటాయి. కమర్షియల్ భవనాల విషయంలో మూడు బేస్ మెంట్, నివాస భవనాల విషయంలో రెండు బేస్ మెంట్స్ మాత్రమే అనుమతిస్తారు. - పోడియం సెట్‌బ్యాక్‌లకు సమాన రీతిలో బేస్ మెంట్స్ సెట్‌బ్యాక్స్ ఉండాలి. - పోడియంపై టాట్–లాట్ అనుమతిస్తారు. - భవనం 10 వేల చదరపు మీటర్లలోపు ఫ్లోర్ ఏరియా మాత్రమే కలిగి ఉంటే కనీసం మూడో వంతు భవనంతో పాటు భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునేలా భవనం చుట్టూ సెట్‌బ్యాక్స్ ఉండాలి. - భవనం 10వేల చదరపు మీటర్లకు పైగా ఫ్లోర్ ఏరియా కలిగి ఉంటే కనీసం సగభాగం భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం చేరుకునే విధంగా సెట్‌బ్యాక్స్ ఉండాలి. - పోడియం ఫ్లోర్లను ప్రత్యేకంగా పార్కింగ్ కోసమే వినియోగించాలి. అయితే, విజిటర్స్ లాబీలు, డ్రైవర్ల కోసం వేయిటింగ్ రూమ్స్, టాయిలెట్ల సదుపాయాన్ని కల్పించవచ్చు. విజిటర్స్ లాబీల కోసం గరిష్టంగా 2%, డ్రైవర్లకు సదుపాయాల కోసం గరిష్టం 10 శాతం ఫ్లోర్ ఏరియాను మాత్రమే వినియోగించాలి. - రోడ్డుకు వెళ్లే మార్గం, పోడియం మధ్య ఎలాంటి గోడలు ఉండరాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకున్నాక పోడియం పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని వేరే అవసరాల కోసం దుర్వినియోగం చేస్తే, ఆ స్థలాలను సంబంధిత పురపాలిక జప్తు చేసుకుని తన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటుంది. -
సెల్లార్లు పార్కింగ్‌కే పరిమితం
చీరాల అర్బన్ : ప్రైవేట్ హాస్పిటళ్లలో వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్లలో ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 15 ప్రైవేట్ హాస్పిటళ్లలో సెల్లార్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనాలు నిర్మించే సమయంలో సెల్లార్లుగా రికార్డుల్లో చూపించి అందులో ల్యాబ్‌లు, ఆఫీసులు, స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు. మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో భవనాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చీరాల్లో ప్రైవేట్ హాస్పిటళ్లలో సెల్లార్లు పార్కింగ్‌కు వినియోగించడం లేదన్నారు. హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్‌లు, రోగుల తరఫు వాహనాలను రోడ్డుపై నిలిపేస్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. అగ్నిప్రమాదం జరిగితే తీరని నష్టం మిగులుతుందన్నారు. గతంలోనూ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని, వారికి మరోమారు నోటీసులిస్తామని చెప్పారు. భవన నిర్మాణం చేసే సమయంలో ఇచ్చిన ప్లానుకు విరుద్ధంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారని, అటువంటి వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాను ఆమోదం పొంది ప్లానుకు వ్యతిరేకంగా నిర్మించిన వాటిని తొలగించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రీజియన్ పరిధిలో నెల్లూరు జిల్లాలో ఈ నిబంధనలు అమలు చేశామని, ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.బ్రహ్మయ్య, టాస్క్ఫోర్సు సిబ్బంది కె.ఎం.చంద్రశేఖర్, మల్లిఖార్జునరావు, అంకయ్య, పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.