సెల్లార్లు పార్కింగ్‌కే పరిమితం | Cellar limited parkingke | Sakshi
Sakshi News home page

సెల్లార్లు పార్కింగ్‌కే పరిమితం

Published Wed, Mar 8 2017 12:04 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Cellar limited parkingke

చీరాల అర్బన్‌ :  ప్రైవేట్‌ హాస్పిటళ్లలో వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్లలో ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 15 ప్రైవేట్‌ హాస్పిటళ్లలో సెల్లార్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవనాలు నిర్మించే సమయంలో సెల్లార్లుగా రికార్డుల్లో చూపించి అందులో ల్యాబ్‌లు, ఆఫీసులు, స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు.

మున్సిపల్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో భవనాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చీరాల్లో ప్రైవేట్‌ హాస్పిటళ్లలో సెల్లార్లు పార్కింగ్‌కు వినియోగించడం లేదన్నారు. హాస్పిటల్‌కు చెందిన అంబులెన్స్‌లు, రోగుల తరఫు వాహనాలను రోడ్డుపై నిలిపేస్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. అగ్నిప్రమాదం జరిగితే తీరని నష్టం మిగులుతుందన్నారు. గతంలోనూ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని, వారికి మరోమారు నోటీసులిస్తామని చెప్పారు.     

భవన నిర్మాణం చేసే సమయంలో ఇచ్చిన ప్లానుకు విరుద్ధంగా బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారని, అటువంటి వాటిని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసినట్లు           తెలిపారు. ప్లాను ఆమోదం పొంది ప్లానుకు వ్యతిరేకంగా  నిర్మించిన వాటిని తొలగించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రీజియన్‌ పరిధిలో నెల్లూరు జిల్లాలో ఈ నిబంధనలు అమలు చేశామని, ప్రస్తుతం చీరాల మున్సిపాలిటీలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.బ్రహ్మయ్య, టాస్క్‌ఫోర్సు సిబ్బంది కె.ఎం.చంద్రశేఖర్, మల్లిఖార్జునరావు, అంకయ్య, పట్టణ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement