న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్‌లు మరింతగా రాణించేందుకు సరఫరా వ్యవస్థను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని గ్రామీణ ప్రాంతాల అంకుర సంస్థలు కేంద్రాన్ని కోరాయి. అలాగే నిధుల లభ్యత పెరిగేలా తగు చర్యలు తీసుకోవాలని బడ్జెట్ కోర్కెల చిట్టాలో విజ్ఞప్తి చేశాయి. దీనితో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఊతం లభించగలదని పేర్కొన్నాయి.
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్రం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. పాతబడిన పరికరాలు, బలహీన సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల లేమి, నిధుల కొరత వంటి సమస్యలతో దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సతమతమవుతోందని క్రిని స్పైసెస్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కుమార్ యాదవ్ తెలిపారు.
ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయగలిగేలా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అనుసంధానం అవడంలో ప్రభుత్వం తమకు తోడ్పాటు కలి్పంచాలని ఆయన కోరారు. వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రారంభించే గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)కి రాబోయే బడ్జెట్‌లో కేంద్రం అదనంగా మరిన్ని నిధులు కేటాయించగలదని ఆశిస్తున్నట్లు యాదవ్ చెప్పారు. 2017లో ఏర్పాటైన క్రిని స్పైసెస్ ప్రత్యక్షంగా 22 మందికి, పరోక్షంగా 100 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23లో రూ. 4 కోట్ల పైచిలుకు ఆదాయం నమోదు చేసింది.
ఎగుమతి నిబంధనలు సడలించాలి..
ఎగుమతి నిబంధనలను సడలించాలంటూ ప్రభుత్వాన్ని పలు అంకుర సంస్థలు కోరుతున్నాయి. ముడి వస్తువుల దిగుమతి, ఫినిష్డ్ ఉత్పత్తుల ఎగుమతి సులభతరమయ్యేలా అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అంకుర సంస్థలు అనుసంధానమయ్యేందుకు కేంద్రం సహాయం అందించాలని ఐరిస్ పాలిమర్స్ వ్యవస్థాపకుడు ఎ. అరుణ్ కోరారు.
అంతర్జాతీయంగా 3.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న మల్చింగ్ మెటీరియల్స్ మార్కెట్ ఏటా 7.6 శాతం వృద్ధితో 2032 నాటికి 7.96 బిలియన్ డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గనుక ఎగుమతి వ్యవస్థను సరళతరం చేస్తే ఈ విభాగంలో భారత్ భారీ తయారీ హబ్‌గా ఎదిగేందుకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ ఫిల్మ్‌లు, పారిశ్రామిక ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు తయారు చేసే పుణె కంపెనీ ఐరిస్ పాలిమర్స్.. ప్రత్యక్షంగా 53 మందికి, పరోక్షంగా 200 మందికి ఉపాధి కలి్పస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 34 కోట్ల ఆదాయం నమోదు చేసింది.
మరిన్ని సబ్సిడీలు కావాలి..
మరోవైపు, అంకుర సంస్థల లాభార్జనకే కాకుండా వాటి ప్రయోజనాలు రైతులకు కూడా అందేలా చూసేందుకు నిర్దిష్ట రంగాలకు ప్రభుత్వ సబ్సిడీలు మరింతగా అవసరమని నియో ఫార్మ్‌టెక్ వ్యవస్థాపకుడు యోగేష్ గవాండే చెప్పారు. ‘మాది ఒక అంకుర సంస్థ. మేము దేశ, విదేశ దిగ్గజాలతో పోటీపడుతున్నాం. ప్రభుత్వం గానీ మా ఉత్పత్తికి సబ్సిడీలు ఇస్తే.. మేము మా లాభాలను తగ్గించుకుని, ఆ ప్రయోజనాలను రైతులకు బదలాయించగలుగుతాము‘ అని గవాండే చెప్పారు.
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 12,000 మంది రైతులకు తాము స్ప్రే పంపులను సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సరఫరా, సేల్స్ వ్యవస్థకు అనుసంధానమవడం అనేది అతి పెద్ద సవాలుగా ఉంటోందని గవాండే చెప్పారు. వ్యవసాయ స్ప్రే పంపులను తయారు చేసే నియో ఫార్మ్‌టెక్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది ఉపాధి పొందుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 1.12 కోట్ల ఆదాయం నమోదు చేసింది.
వ్యవసాయ రంగంలో ఆధునీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అంకుర సంస్థలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని భారతీయ యువ శక్తి ట్రస్టు (బీవైఎస్‌టీ) వ్యవస్థాపకురాలు లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఏఏఎఫ్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల్లోని అంకురాలకు ఆర్థిక సహాయం అందుతోందని వివరించారు. లక్షల కొద్దీ గ్రామీణ స్టార్టప్‌లు మరింతగా విస్తరించేందుకు, యూనికార్న్‌లుగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల సంస్థలు) ఎదిగేందుకు కూడా అవకాశం ఉందని లక్ష్మి చెప్పారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎంట్రప్రెన్యూర్లకు బీవైఎస్‌టీ గత మూడు దశాబ్దాలుగా సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు పది లక్షల పైచిలుకు యువతకు కౌన్సిలింగ్ చేశామని, వారు 48,000 పైగా అంకుర సంస్థలను ఏర్పాటు చేయడంలో సహాయపడ్డామని చెప్పారు. ఈ సంస్థలు రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 3,50,000 మందికి ఉపాధి కలి్పస్తన్నాయని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment