న్యూఢిల్లీ: చిన్న రైతుల సాధికారతే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగంలో భారీగా సంస్కరణలు తీసుకువస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు అత్యంత పవిత్రదినమైన బలరామ్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించారు. ఇదేరోజు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కర్షకులు తమకు మంచి రోజులు రావాలని నాగళ్లకు పూజలు చేస్తారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. వ్యవసాయంలో దిగుబడులు పెంచడంలో ఇబ్బందుల్ని అధిగమించామని, పండిన పంటల్ని కాపాడుకోవడంలో ఎదురయ్యే సమస్యల్ని ఈ నిధి తీరుస్తుందని మోదీ చెప్పారు. ఈ నిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఆధునిక సౌకర్యాల కల్పన జరిగేలా పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ నిధి ద్వారా రుణాలు అందించడానికి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలుత రైతులకు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు.
చట్టపరమైన అడ్డంకులు అధిగమించాం
నిత్యావసర సరుకుల (ఈసీ) చట్టం కారణంగా ఇన్నాళ్లూ వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవరోధాలు ఉండేవి. ఇప్పుడు ఆ అవరోధాలన్నీ తొలగిపోయి వ్యవసాయ మౌలిక నిధి దేశంలో ప్రతీ రైతుకి ఉపయోగపడేలా కేంద్రం రెండు ఆర్డినెన్స్‌లు తీసుకువచ్చింది. దీని వల్ల రైతులు తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, లేదంటే ఫుడ్ ప్రాసెస్ కంపెనీలకు అమ్మడానికి నేరుగా ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ‘‘దేశంలో ఆహార నిల్వలు డిమాండ్‌కి మించి ఉన్నాయి. వాటిని కాపాడుకోవడానికి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎసన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అవరోధంగా మారింది. మనలాంటి మిగులు ఉత్పత్తి దేశానికి ఇక ఆ చట్టంతో పనిలేదు’’అని మోదీ చెప్పారు. ఒకే దేశం, ఒకే మండీ విధానం ద్వారా రైతులు పండిన పంటల్ని ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తున్నామని తెలిపారు.
నేరుగా రైతుల ఖాతాల్లో
పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.17 వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. దళారుల ప్రమేయం లేకుండా, కమీషన్ అన్న మాటకి చోటు లేకుండా ఒక్క క్లిక్‌తో ఒక్కో రైతు ఖాతాలో నేరుగా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ అయిందని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ప్రతీ ఏడాది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం వ్యవసాయ మౌలిక నిధి ప్రారంభం కార్యక్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరోవిడత ని«ధుల విడుదల కార్యక్రమం కూడా జరిగింది.ఈ పథకం ప్రారంభించిన తర్వాత 10 వేల కోట్ల మందికిపైగా రైతులకు 90 వేల కోట్ల వరకు నిధులు అందాయి.
ఏమిటీ వ్యవసాయ మౌలిక నిధి
పండిన పంటను నిల్వ చేసుకునే సామర్థ్యం లేక రైతులు పంటల్ని రోడ్ల మీద పారబోసే దృశ్యాలను మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. అలాంటి వృథాని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసింది. ఈ నిధితో రైతులు సొంతంగా తమ గ్రామాల్లోనే పంటల్ని నిల్వ చేసుకోవడానికి ఆధునిక సదుపాయాలను కల్పించుకోవడానికి వీలు కలుగుతుంది. గ్రామాల్లోనే పంట సేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు వ్యవసాయం పండుగలా మారుతుంది. అంతేకాదు వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది.
మొత్తం 10 వేల ఆహార శుద్ధి కేంద్రాలు, 350 అగ్రీ స్టార్టప్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పంట దిగుబడుల్ని కాపాడుకుంటే మంచి ధర వచ్చేవరకు వేచి చూసే అవకాశం కూడా రైతులకు ఈ నిధి ద్వారా లభిస్తుంది. రైతు సంఘాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అగ్రీ స్టార్టప్‌లు వంటి వారందరికీ ఈ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకు క్రెడిట్ గ్యారంటీ ఈ నిధి ద్వారా రైతులకు లభిస్తుంది. మొత్తం నాలుగేళ్ల పాటు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది 10వేల కోట్లు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 30 వేల కోట్ల రూపాయల చొప్పున రుణాలు పంపిణీ చేస్తారు.
అన్నదాతకు అండగా.. రూ.లక్ష కోట్లతో నిధి
Published Mon, Aug 10 2020 2:58 AM | Last Updated on Mon, Aug 10 2020 4:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment