WhatsAp: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం | WhatsApp Moves Delhi High Court Against IT Rules 2021 | Sakshi
Sakshi News home page

WhatsAp: కొత్త ఐటీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం

Published Thu, May 27 2021 4:50 AM | Last Updated on Thu, May 27 2021 1:12 PM

WhatsApp Moves Delhi High Court Against IT Rules 2021 - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్‌ (ఐటీ) నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్‌ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వినియోగదారుల గోప్యతను కాపాడేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేసింది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌ల సదుపాయం తమ ఖాతాదారులకు ఉందని గుర్తుచేసింది. సందేశం పంపినవారు, స్వీకరించిన వారు తప్ప ఇతరులు ఆ మెసేజ్‌లను చదివే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కోరినపుడు లేదా కోర్టులు అడిగినపుడు తొలుత సందేశాన్ని సృష్టించిన వారిని గుర్తించాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయని, ఇది సరైన విధానం కాదని వెల్లడించింది. దీనివల్ల ఖాతాదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వాట్సాప్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్‌లో ఒక సందేశం మొదట ఎక్కడ పుట్టింది, దాన్ని మొదట ఎవరు సృష్టించారు అనేది గుర్తించి, ధ్రువీకరించాలని ఆదేశించడం... గోప్యత హక్కుకు భంగకరమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 

పౌర సమాజంతో కలిసి పనిచేస్తాం: వాట్సాప్‌
కొత్త ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో తాము వ్యాజ్యం దాఖలు చేయడం నిజమేనని వాట్సాప్‌ అధికార ప్రతినిధి తెలియజేశారు. ‘‘కొత్త డిజిటల్‌ నిబంధనలు అనుచితంగా ఉన్నాయి. వాట్సాప్‌లో ఒకరికొకరు పంపుకొనే మెసేజ్‌లను ట్రేస్‌ చేయాలని, వాటిపై నిఘా పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేయడం అంటే వాట్సాప్‌లో షేర్‌ అయ్యే ప్రతి ఒక్క మెసేజ్‌ తాలూకు సమాచారాన్ని భద్రపర్చమని కోరడమే. అలాగే ఇది ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేసినట్లు అవుతుంది. కోట్లాది మంది ప్రజల గోప్యత హక్కును కూడా పణంగా పెట్టినట్లే. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైన... గోప్యత హక్కు, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కును ఉల్లంఘించడమే’ అని బుధవారం వాట్సాప్‌ పేర్కొంది. డాక్టర్లు– పేషెంట్లు, లాయర్లు– కక్షిదారులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలు... ఇలా ఎందరో వాట్సాప్‌ ద్వారా వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని పంచుకుంటారంది. తమ ఖాతాదారుల ప్రైవసీని కాపాడడానికి పౌర సమాజంతో, ప్రపంచవ్యాప్తంగా నిపుణులతో కలిసి పని
చేస్తామని తెలిపింది.

36 గంటల్లోగా తొలగించాల్సిందే..
సామాజిక మాధ్యమాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు–2021ను ప్రకటించింది. కొత్త రూల్స్‌ ప్రకారం.. ఏదైనా కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే సోషల్‌ మీడియా కంపెనీలు 36 గంటల్లోగా తొలగించాలి. ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిపై స్పందించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్, నోడల్‌ కాంటాక్టు ఆఫీసర్, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. అభ్యంతరకరమైన సందేశాలు, అశ్లీల ఫొటోలు, వీడియోలను (పోర్నోగ్రఫీ) తొలగించడానికి ఆటోమేటెడ్‌ ప్రాసెస్‌ వాడాలి. ఏదైనా సందేశాన్ని/ సమాచారాన్ని మొదట ఎవరు సృష్టించారనేది గుర్తించే ఏర్పాటు ఉండాలని కొత్త నిబంధనల్లోని రూల్‌ 4(2) చెబుతోంది. దీనినే వాట్సాప్‌ కోర్టులో సవాల్‌ చేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ లాంటివి నూతన ఐటీ నిబంధనలను అంగీకరించడానికి కేంద్రం 3నెలల గడువిచ్చింది. ఇది మంగళవారంతో ముగిసింది.  సోషల్‌ మీడియా సంస్థలకు ఇదివరకు ‘మధ్యవర్తి హోదా’తో రక్షణ ఉండేది. తమ ఖాతాదారులు పోస్ట్‌ చేసే కంటెంట్‌కు సంబంధించి వీటిపై క్రిమినల్‌ కేసులు, నష్టపరిహారం కేసులకు వీల్లేకుండా ఈ మధ్యవర్తి హోదా కాపాడేది. కొత్త ఐటీ నిబంధనలను అంగీకరించకపోతే ఈ ‘మధ్యవర్తి హోదా’ను కోల్పోతాయి. ఫలితంగా ఎవరు, ఏది పోస్ట్‌ చేసినా దానికి ఈ సామాజిక మాధ్యమాలు బాధ్యత వహించాల్సి వస్తుంది.

అత్యంత తీవ్ర నేరాలను అడ్డుకునేందుకే!
కొత్త నిబంధనలన్న ఐటీ శాఖ

న్యూఢిల్లీ: దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అత్యంత తీవ్ర నేరాలకు సంబంధించిన విషయాల్లో సోషల్‌ మీడియాలో ప్రచారమైన సందేశాల మూలం తెలుసుకునేందుకే కొత్త డిజిటల్‌ నిబంధనలను తీసుకువచ్చామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర ఐటీ శాఖ పేర్కొంది. విదేశాలతో సత్సంబంధాలు, దేశ రక్షణ, దేశంలో శాంతి భద్రతలు మొదలైనవాటికి  విఘాతం కలిగించే అవకాశమున్న నేరాలు, లైంగిక నేరాలు, చిన్నారులపై లైంగిక దాడులు తదితరాలను అడ్డుకోవడానికి, అలాంటి తీవ్ర నేరాల విచారణకు సంబంధిత సోషల్‌ మీడియా సందేశాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో, ఎలా వ్యాప్తి చెందాయో తెల్సుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాంటి సందేశాల వివరాలు వాట్సాప్‌ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుందని వివరించింది.

డిజిటల్‌ నిబంధనలను ‘వాట్సాప్‌’ చివరి నిమిషంలో కోర్టులో సవాలు చేయడం దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర దేశాల్లో అమల్లో ఉన్న నిబంధనలతో పోలిస్తే.. భారత్‌ ప్రతిపాదిస్తున్న నిబంధనలు అంత తీవ్రమైనవి కావని వెల్లడించింది. ప్రైవసీ హక్కును ప్రాథమిక హక్కుగా తమ ప్రభుత్వం గుర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నిబంధనలతో వాట్సాప్‌ సాధారణ కార్యకలాపాలకు, వాట్సాప్‌ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగదని ఐటీ మంత్రి రవిశంకర్‌ తెలిపారు.

వారి కాంటాక్ట్‌ వివరాలు ఇవ్వండి
ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలను పాటించే విషయంలో తాజా పరిస్థితిని తక్షణమే తమకు తెలియజేయాలని కేంద్ర ఐటీ శాఖ ప్రధాన సోషల్‌ మీడియా సంస్థలను ఆదేశించింది. అప్రమత్తతతో వ్యవహరించాలంది. తాజా సోషల్‌ మీడియా నిబంధనల్లో పేర్కొన్న మేరకు.. భారత్‌లోని తమ చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్, నోడల్‌ కాంటాక్ట్‌ ఆఫీసర్‌ల వివరాలను తమకు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించింది. సంబంధిత సామాజిక మాధ్యమానికి చెందిన యాప్‌ పేరు, వెబ్‌సైట్‌ పేరు, అందించే సేవలు  వివరాలను తెలియజేయాలంది. ఒకవేళ తాము ఈ నిబంధనల పరిధిలోకి రామని భావిస్తే అందుకు కారణాలను  వెల్లడించాలి. సాధ్యమైనంత త్వరగా, వీలైతే ఈ రోజే తాము కోరిన వివరాలను అందించాలని బుధవారం ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ తదితర ప్రధాన సోషల్‌ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో అవి ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌలభ్యాలను కోల్పోవడంతో పాటు, వాటిపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా క్రిమినల్‌ చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని హెచ్చరించింది.

ఇదీ ‘సోషల్‌ పవర్‌’
సోషల్‌ మీడియా వేదికలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌గా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. దేశంలో వివిధ సంస్థలకు ఉన్న వినియోగదారుల సంఖ్య ఇలా ఉంది.
వాట్సాప్‌     53 కోట్లు
ఫేస్‌బుక్‌    41 కోట్లు  
యూట్యూబ్‌    44.8 కోట్లు
ఇన్‌స్టాగ్రామ్‌    21 కోట్లు
ట్విట్టర్‌    1.75 కోట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement