ప్రభుత్వ పథకాలు రైతులకు అర్ధమయ్యేలా వివరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశంలో రైతులకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడంలో సహాయం చేసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ (Meity) చాట్‌జీపీటీపై పని చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకారం.. ఎంఈఐటీవైలో భాషిణి అనే టెక్నాలజీ నిపుణుల బృందం చాట్‌జీపీటీ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌ను పరీక్షిస్తోంది.
ఎలా పనిచేస్తుందంటే
చాట్‌జీపీటీ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ వాయిస్ నోట్స్ ద్వారా రైతులు పథకాలు ఇతర అంశాల్లో ప్రశ్నలు వేయొచ్చు. స్మార్ట్‌ఫోన్ వినియోగం లేని వారికి ఈ లేటెస్ట్ టెక్నాలజీ సహాయ పడనున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చాట్ జీపీటీ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర ఐటీ నిపుణుల బృందం చాట్‌జీపీటీతో నడిచే వాట్సాప్ చాట్‌బాట్ మోడల్‌ను నాదెళ్లకు చూపించినట్లు నివేదిక పేర్కొంది.
వాయిస్ మోడ్‌లో
అయితే, ప్రస్తుతం చాట్‌జీపీటీని ఇంగ్లీష్‌లో మాత్రమే వినియోగించుకునే సదుపాయం ఉంది. స్థానిక భాషలపై పరిమితి ఉన్న నేపథ్యంలో వాట్సాప్ చాట్‌బాట్ విడుదలకు మరింత సమయం పట్టనుంది. నివేదికలపై చాట్‌బోట్‌పై పనిచేసే ఓ అధికారి మాట్లాడుతూ.. చాట్‌బాట్‌ను ఉపయోగించే వ్యక్తులలో ఎక్కువ మందికి ఇంగ్లీష్ నైపుణ్యం లేకపోవచ్చు. అలాంటి వారు స్థానిక భాషల్ని ఉపయోగించి పథకాలు, ఇతర రంగాల్లో వారికి ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసేలా వాయిస్ ద్వారా ప్రశ్నలు వేయొచ్చని అన్నారు. ఇందుకోసం చాట్‌బాట్‌లో పని చేసేలా స్థానిక బాషలపై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, చాట్ జీపీటీ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, అస్సామీలతో సహా 12 భాషలకు సపోర్ట్ చేస్తుంది. త్వరలో మరిన్ని భాషల్ని జత చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment