విమాన ప్రయాణికులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: త్వరలోనే అమల్లోకి రానున్న ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త నిబంధనలు దేశీయ విమాన యాన సంస్థలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుండగా విమాన ప్రయాణికులకు భారీ పరిహారం కోసం లభించనుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాలసీలో ప్రయాణికుల లగేజీ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ ఒకవేళ విమానం క్యాన్సిల్ అయితే టికెట్ ధరతో పాటు అదనపు పన్నుల రూపంలో వసూలు చేసే ఛార్జీలు కూడా చెల్లించాలని చెప్పింది.
ఇకపై విమానం ఆలస్యమైనా....రద్దయినా ఆయా విమానయాన సంస్థ సదరు ప్రయాణికులకు భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. రెండుగంటల లోపు విమానం రద్దయితే 10వేల రూపాయలు చెల్లించాలి. దీంతోపాటుగా 24 గంటల లోపు వేరే విమానాన్ని సమకూర్చలేకపోతే మరో రూ.20వేలు పరిహారం చెల్లించాల్సిందేనని విమానాయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టికెట్ క్యాన్సిల్ అయితే అదనపు పన్నులతో సహా చార్జీలను ప్రయాణికులకు రీఫండ్ చేయాలని చెప్పింది.ఈ రీఫండ్ కూడా దేశీయ ప్రయాణాలకైతే 15 రోజుల్లోగా, అంతర్జాతీయంగా అయితే 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
అయితే ఈచెల్లింపుల ప్రక్రియలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయనీ, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ విధానం పారదర్శకంగా లేదనీ, కొన్ని అంశాలపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నిజాలను నిర్ధారించిన బాధ్యత ఆయా విమాన సంస్థలపై పెట్టడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాగా ఇటీవల విమానాయాన మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త విధానం విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. లగేజీ చార్జీల తగ్గింపు తోపాటు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.