న్యూఢిల్లీ: నివసిస్తున్న ప్రదేశంలోనే కాకుండా దేశంలో ఎక్కడి నుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆరో పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. పాస్‌పోర్టు దరఖాస్తు, ఫీజు చెల్లింపు, అపాయింట్‌మెంట్ షెడ్యూల్ తదితర సౌకర్యాలతో కూడిన ‘ఎంపాస్‌పోర్ట్ సేవా యాప్’ అనే మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ విధానం కింద.. పాస్‌పోర్ట్ దరఖాస్తు సమర్పించేందుకు రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయం(ఆర్‌పీఓ), పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఎస్‌కే) లేదా పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర(పీఓపీఎస్‌కే)లలో దేన్నైనా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న ఆర్‌పీఓ పరిధిలో దరఖాస్తుదారుడి నివాస స్థలం లేకున్నా కూడా అప్లికేషన్ పంపొచ్చు. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న చిరునామాలోనే పోలీసు ధ్రువీకరణ జరుగుతుంది. పాస్‌పోర్టు మంజూరు అయిన తరువాత..సదరు ఆర్‌పీఓనే దరఖాస్తులోని చిరునామాకు దాన్ని పంపుతుంది.
తాను విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తు విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అనవసర నిబంధనలు చాలా వాటిని తొలగించామని తెలిపారు. గత 48 ఏళ్లలో 77 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలే ఉండగా, తాము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కొత్తగా 231 కేంద్రాల్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 307 పీఎస్‌కే కేంద్రాలు పనిచేస్తున్నాయని, ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం ఒక పీఎస్‌కే లేదా పీఓపీఎస్‌కేను ఏర్పాటుచేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment