
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పిస్తూ పెద్దసంఖ్యలో ఉద్యోగాలను అందుబాటులోకి తెచ్చేలా నూతన ఎలక్ర్టిక్ వాహన విధానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆవిష్కరించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతోనూ నూతన విధానానికి రూపకల్పన చేశారు. తాము చేపట్టిన నూతన ఎలక్ర్టిక్ వాహన విధానంతో ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తేవడమే కాకుండా, ఢిల్లీ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని అన్నారు. ఈ విధానం కింద రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఎలక్ర్టిక్ వాహనాలను రిజిస్టర్ చేస్తామని అంచనా వేస్తున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు.
ఎలక్ర్టిక్ వాహన విధానం కింద ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఈ -రిక్షాలకు కు రూ 30,000, కార్లకు రూ 1.5 లక్షల వరకూ ప్రోత్సాహకాన్ని ఆయన ప్రకటించారు. ఈ విధానం కింద ఎలక్ర్టిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి ఈ ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు. నూతన విధానాన్ని అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం త్వరలో రాష్ట్ర ఎలక్ర్టిక్ వాహన బోర్డును ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఈ-వాహనదారుల సౌకర్యం కోసం ఏడాదిలోనే 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఎలక్ర్టిక్ వాహన విధానం కింద రిజిస్ర్టేషన్ ఫీజు, రోడ్డు పన్నును ఎత్తివేస్తామని ప్రకటించారు. ఎలక్ర్టిక్ కమర్షియల్ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని చెప్పారు. చదవండి : నిరుద్యోగులకు కేజ్రీవాల్ బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment