సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తేవడం వల్ల గీత కార్మికులకు చెందిన సుమారు లక్ష కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడంపై మంత్రి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. నూతన పాలసీ అమలుతో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, ఈత, శ్రిసయిన కులాలకు చెందిన కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
కల్లు దుకాణాల అద్దెలను (కిస్తిలను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం, కల్లు గీచే వారికే చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాలలో షెడ్యూల్డ్ జాతులు వారు కల్లు గీసుకోవడం కోసం ఐదు సంవత్సరాలు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని వివరించారు.
అదే విధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లుగీత కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడం, ప్రమాదానికి గురై అంగ వైకల్యం చెందిన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించడం, కల్లుగీత కార్మికుడు సహజంగా మరణిస్తే కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా కింద అందచేయడం బాధిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తుందని తెలిపారు.
నదీతీరాలు, కాల్వగట్లు, మీద తాటి, ఈత చెట్ల పెంపకం ద్వారా కార్మికులకు మరింత ఆదాయం వచ్చే విధంగా ఐదు సంవత్సరాల పాలసీని తీసుకురావడం హర్షణీయమని మంత్రి రమేశ్ పేర్కొన్నారు.
కల్లు గీత నూతన పాలసీతో లక్ష కుటుంబాలకు ప్రయోజనం
Published Wed, Nov 2 2022 5:00 AM | Last Updated on Wed, Nov 2 2022 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment