Minister Jogi Ramesh Comments On Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

పేదల రాజధానిలో ఇళ్ల పండగ

Published Sat, May 6 2023 4:03 AM | Last Updated on Sat, May 6 2023 10:29 AM

Jogi Ramesh Comments On Chandrababu - Sakshi

కేక్‌ కత్తిరించి సంబరాలు నిర్వహిస్తున్న ఎంపీ నందిగం సురేష్, బహుజన పరిరక్షణ సమితి నాయకులు

సాక్షి, అమరావతి: న్యాయస్థానం తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో దాదాపు 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ముళ్ల కంపలను తొలగించి స్థలాలను చదును చేయడంతో పాటు వెంటనే ప్లాట్ల మార్కింగ్‌ జరుగుతోంది. నిరుపేదల కోసం 1,134.58 ఎకరాలను కేటాయించడంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు చేసి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 48,218 మందికి కేటాయించింది. వీరందరికీ అతి త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

విశాలమైన రోడ్లు.. అటు తాడికొండ, ఇటు నీరుకొండ.. ఐదు కి.మీ పరిధిలోనే మంగళగిరి, మరికొద్ది దూరంలో తాడేపల్లి.. ఎటు చూసినా 20 నిమిషాల ప్రయాణం దూరం మాత్రమే ఉండే ప్రాంతంలో నిరుపేదల లే అవుట్లు సిద్ధమవుతున్నాయి. సీఆర్డీఏ అధికారులు, సిబ్బందితో పాటు వార్డు సచివాలయాల సిబ్బంది సైతం శరవేగంగా పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు.

మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలులో 900.97 ఎకరాలను ఆర్‌ 5 జోన్‌గా మారుస్తూ మార్చిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో పాటు ఎస్‌–3 జోన్‌లోని 233.61 ఎకరాలను కూడా ఆర్‌–5కి జోడించారు. నిరుపేదల కోసం కేటాయించిన మొత్తం 1,134.58 ఎకరాల్లో గుంటూరు జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్‌ జిల్లా (వీఎంసీ) పరిధిలోని లబ్ధిదారులకు 583.93 ఎకరాలు కేటాయించారు.   

ధర్మమే గెలిచింది 
రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వేలాది ఎకరాలను సేకరించిన గత సర్కారు అక్కడ పెద్దలకు మాత్రమే చోటు కల్పించి పేదలకు తావు లేకుండా చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా సేకరించిన భూమిలో 5 శాతం నిరుపేదల గృహాల కోసం కేటాయించే వీలున్నా అడ్డంకులు సృష్టించింది. నిరు పేదలకు చోటులేనిది రాజధాని ఎలా అవుతుందని భావించిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం కొత్తగా ఆర్‌–5 జోన్‌ను ఏర్పాటు చేసింది.

ఇందులో రెండు జిల్లాలకు చెందిన 48,218 మంది నిరుపేదలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో స్థలాలు కేటాయించింది. గుంటూరు జిల్లాకు చెందిన పేదల కోసం 10 లేఅవుట్లను సిద్ధం చేయగా ఎన్టీఆర్‌ జిల్లాకు సంబంధించి 11 లే అవుట్లు రూపుదిద్దుకున్నాయి. భారీ భవంతుల మధ్య బడుగు జీవులు ఉండకూడదని టీడీపీ నాయకులు రైతుల ముసుగులో ఆటంకాలు సృష్టించినా ఎట్టకేలకు ధర్మమే గెలిచిందని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

15న పట్టాల పంపిణీ యోచన  
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలు నివాసం ఉండేందుకు మార్గం ఏర్పడింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువైందని అక్క చెల్లెమ్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే చట్టప్రకారం ఆర్‌–5 జోన్‌ను ఏర్పాటు చేయడం, లేఅవుట్‌ పనులు కూడా పూర్తి కావస్తుండడంతో ఈనెల 15న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉంది.   

దురుద్దేశంతోనే అడ్డుపడ్డారు 
వేల మంది నిరుపేదలకు సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 45పై కొందరు కోర్టును ఆశ్రయించడం బాధాకరం. రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది. అలాంటి చోట పేదలకు ఇళ్లు కేటాయించరాదంటూ కొందరు స్వార్ధపూరితంగా కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా అడ్డుకున్న వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. 
    – ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే మంగళగిరి  

చంద్రబాబుకు చెంపపెట్టు
పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేలా ఉండాలి. కానీ అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కాపు వర్గానికి చెందిన ప్రజలు ఉండకూడదని చంద్రబాబు భావించారు. రాజధానిలో తన అనుచరులు, తన సామాజిక వర్గం వారు మాత్రమే ఉండాలని కోరుకున్నారు.      
– జోగి రమేశ్, మంత్రి  

ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం.  రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. అన్యాయమైన డిమాండ్‌తో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. సామాజిక అసమతుల్యత అంటూ అడ్డుపడ్డ వారికి ఈ తీర్పు చెంప దెబ్బ లాంటిది. త్వరలో ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. రాజధాని అంటే ఏ ఒక్కరిదో కాదు, ప్రజలందరిదీ అనే విషయాన్ని టీడీపీ నేతలు ఇప్పటికైనా గుర్తించాలి.   కమ్యూనిస్టులు కూడా బుద్ధి తెచ్చుకుని పేదల కోసం పని చేయాలి.  
 – లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ 

అడ్డుకోవడం దుర్మార్గం 
రాజధానిలో పేదలు ఉండకూడదని అడ్డుకోవడం దుర్మార్గం. రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వారికి కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది. రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వానికి పేదలంతా అండగా ఉంటారు.     – తమిదం లలిత, మంగళగిరి 

ఓట్ల వరదలో కొట్టుకుపోతారు 
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడున్న వారికి వచ్చిన నష్టమేంటో అర్ధం కావడం లేదు. రాజకీయాల కోసం పేదలకు అన్యాయం చేయాలనుకున్న వారికి కోర్టు తీర్పు గుణపాఠం లాంటిది. రాజధానిలో ఎవరైనా నివసించే హక్కు ఉంది. ప్రభుత్వం చేస్తున్న మేలును అడ్డుకుంటున్నవారు పేదల ఓట్ల వరదలో కొట్టుకుపోతారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు. 
    – జగన్నాధం రాజేశ్వరి, మంగళగిరి  

మిఠాయిలు పంచిన ఎంపీ నందిగం సురేష్‌
తాడికొండ: బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ శుక్రవారం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని తన కార్యాలయంలో బహుజన పరిరక్షణ సమితి దీక్షా శిబిరం నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, బేతపూడి రాజేంద్ర,కుమార్, బొలిమేర శ్యామ్యూల్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, పులి దాసు, ఇందుపల్లి సుభాషిణి, రాజ్‌కుమార్, కారుమూరి పుష్పరాజ్‌ పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.  

న్యాయం జరిగింది.. 
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అందరికీ ఇళ్ల స్ధలాలను కేటాయించారు. మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వరంటూ విపక్షాలు ప్రచారం చేసినా కోర్టు కేసుల వల్ల కొంత ఆలస్యమైనా కచ్చితంగా వస్తాయని వలంటీర్లు చెప్పారు. పేదలకు కోర్టులో న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. 
    – ఎస్‌కె నగీనా, నులకపేట

సొంతింటి కల నెరవేరనుంది 
జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు కూడా ఇళ్ల పట్టాలు వస్తాయని ఎదురు చూశాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. అందరికీ ఇళ్ల స్ధలాలు ఇస్తారని సచివాలయ సిబ్బంది తెలియజేశారు.  
    – ఎస్‌కె కరీమున్నీసా, డ్రైవర్‌ కాలనీ

ఆటంకాలు తొలగాయి.. 
కొందరు రాజ­కీయ నాయకులు కోర్టును ఆశ్రయించి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఈ ప్రాంతంలో పేద­లంతా అద్దె ఇళ్లల్లోనే నివాసముంటున్నారు. పెళ్లయిన పిల్లలు  ఒక చిన్న గదిలో తల్లిదండ్రులతో కలసి జీవిస్తున్నారు. ఇన్నాళ్లకు ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం రానుండటం ఆనందంగా ఉంది.     
– నారాయణరెడ్డి, పోలకంపాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement