అమ్మబోతే అడవి. కొనబోతే కొరివి!!. ఈ సామెత బ్యాంకుల్లో డాలర్ లావాదేవీలు జరిపే రిటైల్ కస్టమర్లకు అనుభవంలోకి వస్తుంటుంది. బ్యాంకులు విదేశీ కరెన్సీని కస్టమర్‌కు అమ్మేరేటుకు, వారి నుంచి కొనే రేటుకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. ఇకపై బ్యాంకుల ఈ భారీ బాదుడుకు ఆర్‌బీఐ చెక్ చెబుతోంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) లావాదేవీలు జరిపే వీలును రిటైల్ కస్టమర్లకు ఆర్‌బీఐ కల్పించనుంది.
టూరిస్టు వీసా వచ్చిందని, చదువులకని, ఉద్యోగాలకని ఏటా ఇండియా, అమెరికా మధ్య లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇలా అమెరికా యాత్ర పెట్టుకున్నవాళ్లంతా రూపాయలను డాలర్లలోకి మార్చుకోవడం, అక్కడ నుంచి వచ్చాక డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడం తప్పని సరి కార్యక్రమమనే చెప్పాలి. అమెరికాయే కాదు. విదేశాల్లో దాదాపు ఎక్కడికెళ్లినా అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చెల్లుతుంది కనుక... అక్కడ లోకల్ కరెన్సీని తీసుకోవాలన్నా డాలర్‌తో ఈజీ కనుక అంతా డాలర్లవైపే మొగ్గుతారు. ఈ డాలర్లకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు ఇలాంటి కస్టమర్లకు డాలర్లు అమ్మేటప్పుడు భారీ ప్రీమియంలు వసూలు చేస్తుంటాయి.
కస్టమర్లు డాలర్లు కొనుగోలు చేసే సమయంలో ఎక్చేంజ్ రేట్‌పై దాదాపు 2 శాతం ప్రీమియంతో విక్రయించడం, అదే కస్టమర్లు డాలర్లను విక్రయించడానికి వచ్చినప్పుడు ఎక్చేంజ్ రేటుపై దాదాపు 2 శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడం బ్యాంకులకు పరిపాటిగా మారింది. ఒకవేళ కస్టమరు క్రెడిట్‌కార్డు ద్వారా డాలర్ కొనాలంటే మరో 3 శాతం ప్రీమియం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. ఇలాంటి కస్టమర్ కష్టాలకు త్వరలో విముక్తి లభించనుంది. ఫారెక్స్ మార్పిడి విషయంలో బ్యాంకులు విధించే భారీ మార్జిన్ల కారణంగా నష్టపోతున్న కస్టమర్లకు త్వరలో ఊరట కలగనుంది. వచ్చే ఆగస్టు నుంచి రిటైల్ కస్టమర్లకు దాదాపు ఎక్చేంజ్ రేటుకు సమానంగానే బ్యాంకులు డాలర్లను అమ్మడం, కొనడం చేయాల్సి ఉంటుంది. అంతేకాక బ్యాంకులన్నీ ఈ అమ్మకాలు, కొనుగోళ్లను ఒకే ఉమ్మడి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై చేయాల్సి ఉంటుంది.
రెండేళ్లకు కార్యరూపం
రిటైల్ కస్టమర్లకు బ్యాంకులు వసూలు చేసే భారీ మార్జిన్ల నుంచి ఊరట కలిగించాలని 2017లోనే ఆర్‌బీఐ నిర్ణయించింది. 2017 అక్టోబర్‌లో దీనికి సంబంధించి చర్చాపత్రం విడుదల చేసింది కూడా. తరవాత క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో (సీసీఐఎల్) కలిసి రిటైల్ ఇన్వెస్టర్లకు ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. తొలుత ఆరంభంలో వెయ్యి డాలర్లు, తర్వాత ప్రతిసారీ 500 డాలర్ల చొప్పున ఈ ప్లాట్‌ఫామ్‌పై అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ భావించింది. కానీ ఎంత మొత్తాన్నయినా ఈ ప్లాట్‌ఫామ్‌పై అనుమతించాలని ఆర్‌బీఐ తాజాగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ఫామ్‌పై గరిష్ఠ పరిమితి 5 లక్షల డాలర్లు. తొలుత డాలర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆ తర్వాతి దశల్లో ఇతర కరెన్సీలకు దీన్ని విస్తరిస్తారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై వచ్చే రిటైల్ ఆర్డర్లన్నింటినీ కలిపి మార్కెటబుల్ లాట్స్‌గా మార్చి ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తారు. దీంతో కస్టమర్లకు బ్యాంకుల మధ్యన జరిగే ఎక్చేంజ్ రేటే వర్తిస్తుంది.
జూలై 1న రిజిస్ట్రేషన్లు ఆరంభం
ప్లాట్‌ఫామ్‌పై కస్టమర్ల రిజిస్ట్రేషన్లు జూలై 1 నుంచి ఆరంభమవుతాయని భారత ఫారిన్ ఎక్చేంజ్ డీలర్ల సమాఖ్య తెలిపింది. ఆగస్టు 5 నుంచి ప్లాట్‌ఫామ్‌పై ట్రేడింగ్ ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాల సమాచారం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది కస్టమర్లు పాల్గొనేందుకు ఒక నెల ముందే రిజిస్ట్రేషన్లను ఆర్‌బీఐ ఆరంభించిందని, ఎంత మొత్తంలో లావాదేవీలు జరపవచ్చనే విషయం ఆర్‌బీఐ త్వరలో నిర్ణయిస్తుందని, ఒక్క రూపాయి లావాదేవీనైనా సరే సీసీఐఎల్ సెటిల్ చేస్తుందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన యాప్‌ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో కస్టమర్లు బేసిక్ సమాచారం అం దించాల్సి ఉంటుంది. సదరు కస్టమర్‌కు తన బ్యాంకు ట్రేడింగ్ లిమిట్ నిర్ధారిస్తుంది.
ఈ పరిమితికి అనుమతి వచ్చాక కస్టమర్‌కు సీసీఐఎల్ లాగిన్ వివరాలు పంపుతుంది. ఈ వివరాలతో లాగినై కస్టమర్ ఆర్డర్లను ఉంచడం, కాన్సిల్ చేయడం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఇంటర్ బ్యాంక్ ఎక్చేంజ్‌రేట్లు ప్లాట్‌ఫామ్‌పై కనిపిస్తుంటాయి. కస్టమర్ నేరుగా ఆ రేట్లు పొందలేడు, కొందరు కస్టమర్ల ఆర్డర్లన్నింటినీ కలిపి ఒక లాట్‌గా మార్చి లావాదేవీ నిర్వహిస్తారు. అందువల్ల స్పాట్ రేటుతో పోలిస్తే కస్టమర్‌కు వచ్చే రేటులో స్వల్పతేడా ఉండొచ్చు. దీనికితోడు కస్టమర్‌కు చెందిన బ్యాంకు స్వల్ప రుసుమును సదరు లావాదేవీకి వసూలు చేస్తుంది. అనంతరం కస్టమ ర్ లావాదేవీకి వచ్చిన రసీదు తీసుకొని తన బ్యాం కుకు వెళ్లి డాలర్లను తీసుకోవడం, లేదా జమ చేయడం చేస్తారు. ప్లాట్‌ఫామ్‌ను స్పెక్యులేషన్‌కు వినియోగించకుండా జాగ్రత్తలు చేపడతారు.
‘డాలర్’ డ్రీమ్ ఇక చౌకే!!
Published Thu, May 30 2019 5:13 AM | Last Updated on Thu, May 30 2019 5:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment