ప్రతీకాత్మక చిత్రం
జిల్లాలో ఇసుకను నదులు, వాగులు తేడా లేకుండా తోడేస్తున్నారు. ఇసుకాసురులు అధికార పార్టీ నేతల అనుచరులే కావడంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సాండ్ ట్యాక్సీ విధానం అమలు చేయనుంది. ఇసుక అవసరం ఉన్న వారు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను నేరుగా ఇంటికే సరఫరా చేస్తారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఇసుక దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. నదులు, వాగులు అన్న తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. అధికారిక క్వారీల్లో ఒక్కో పర్మిట్‌పై పదుల సంఖ్యలో ట్రిప్పులు తరలించడం పరిపాటిగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతల ప్రధాన అనుచరులే ఇసుకాసురులు కావడంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో జిల్లాలో విచ్చల విడిగా ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. సొం తింటి కలను సాకారం చేసుకునేందుకు సామాన్యులు కొనుగోలు చేయలేనంతగా ఇసుక ధరలు పెరిగి పోయాయి.
ఈ నేపథ్యంలో ఈ అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో ఇసుక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సాండ్ ట్యాక్సీ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానంలో ఇసుక అవసరం ఉన్న వారు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను నేరుగా ఇంటికే సరఫరా చేస్తారు. ఈ సాండ్ ట్యాక్సీని అమలు చేసేందుకు భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం సుమారు 30–40 మంది సిబ్బందిని ఈ ప్రక్రియకు వినియోగించాల్సి ఉంటుంది.
23 ఇసుక రీచ్‌ల మ్యాపింగ్ సిద్ధం..
నూతన పాలసీ అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 23 ఇసుక పాయింట్లను ఎంపిక చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు ఈ పాయింట్ల నుంచి ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించారు. మంజీర, పెద్దవాగు, నీలవాగు, గోదావరి, నాళేశ్వర్‌వాగు, జన్నెపల్లివాగు, పులాంగ్ వాగు, కప్పల వాగు, కలిగోట్ వాగు, మైలారం వాగు, ఒన్నాజీపేట తదితర వాగులు, నదుల్లో ఉన్న 23 పాయింట్లను గుర్తించారు. ఈ పాయింట్ల నుంచి ఆయా మండలాలకు ఇసుక సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గనుల శాఖ మ్యాపింగ్‌ను సిద్ధం చేసింది. ఆయా రీచ్‌ల నుంచి గ్రామాలు ఎంత దూరంలో ఉన్నాయి.. ఎన్ని కిలోమీటర్లు రవాణా చేయాల్సి ఉంటుంది.. అనే అంశాలపై కసరత్తు పూర్తి చేశారు.
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
నూతన విధానం అమలు కోసం జిల్లా స్థాయిలో సాండ్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహించనున్నారు. కమిటీ ఆయా రీచ్‌ల నుంచి ఇసుకను రవాణా చేసేందుకు ట్రాక్టర్ల యజమానులతో ఒప్పందం చేసుకుంటుంది. ఇలా ఇసుక రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చుతారు. ఒక్కో రీచ్‌కు రీచ్ ఆఫీసర్ బాధ్యులుగా ఉంటారు. జిల్లా ఉన్నతాధికారిని నోడల్ అధికారిగా నియమిస్తారు.
సాఫ్ట్‌వేర్ కంపెనీతో ఒప్పందం..
ఈ విధానాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. వెర్‌టోనిక్స్ అనే కంపెనీతో ఎంఓయూ చేసుకుంది. ఆన్‌లైన్‌లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకుని.. సంబంధిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో గనుల శాఖకు చెందాల్సిన సీనరేజీ, ట్రాక్టర్ యజమానికి చెల్లించాల్సిన రవాణా చార్జీలు, ఇలా ఎవరి వాటా మొత్తాన్ని వారికి వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కొత్త కొత్త ఇసుక విధానాలను అమలు చేస్తూ వచ్చింది.. అయితే, అవేవి అక్రమ దందాకు అడ్డుకట్ట వేయలేక పోయాయి. తాజా విధానంతోనైనా ఇసుక దందాకు చెక్ పడుతుందా.. లేక నూతన విధానాన్ని కూడా ఇసుకాసురులు తమకు అనుకూలంగా మార్చుకుని యథేచ్చగా దోపిడీ కొనసాగిస్తారా..? అనేది వేచి చూడాలి. జిల్లా స్థాయి సాండ్ కమిటీ నియామకం కోసం చర్యలు తీసుకుంటున్నామని భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సత్యనారాయణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment