సాక్షి, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీలోకి తనను డి.శ్రీనివాస్(డీఎస్) పంపారన్న టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు ఆ పార్టీ నేత ధర్మపురి అరవింద్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి కుటుంబాన్ని లాగొద్దన్నారు. తమ కుటుంబంపై అర్థరహితంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. తమ కుటుంబంలో ‘డీఎస్ డిక్టేటర్ కాదు.. నేను బానిసను కాదు’ అని అరవింద్ వ్యాఖ్యానించారు. తాను ఎదగాలనుకుంటే 2004 లోనే రాజకీయాల్లోకి వచ్చేవాడినని తెలిపారు. ఎంపీ కవితలాగా తండ్రిపై, అన్నపై ఆధారపడి లేనన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కవితకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
కవితకు ఛాలెంజ్
బీజేపీలో తన ఎదుగుదలకు డీఎస్ ఏం చేశారో టీఆర్‌ఎస్ వద్ద సమాధానం ఉందా అని అరవింద్ ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే నిరుపిస్తారా అని ఆయన ఎంపీ కవితకు సవాల్ విసిరారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేంటన్నారు. గతంలో సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన అన్న రాజేశ్వర్‌రావు ఏకకాలంలో భాజపా, సీపీఐ ఫ్లోర్ లీడర్లుగా పని చేశారు. అలాంటిది నేను, నాన్న వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేముంది’ అని ఆయన ప్రశ్నించారు. ‘డీఎస్ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు.. బీజేపీలో కొడుకు ఎదుగుదల కోసం కృషి’ ఈ రెండూ పరస్పరం విరుద్ధం కావా అని నిలదీశారు. ఒక ఎంపీగా ఆమె చేసిన ఆరోపణల్లో స్పష్టత ఉండాలి కదా అన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన టీఆర్‌ఎస్ నేతలు.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment