గజం వందనే..! | New Policy Help TRS Party To Build Office Buildings In Low Price | Sakshi
Sakshi News home page

గజం వందనే..!

Published Mon, Jun 24 2019 12:55 PM | Last Updated on Mon, Jun 24 2019 1:32 PM

 New Policy Help TRS Party To Build  Office Buildings In Low Price - Sakshi

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన పాత దూరదర్శన్‌ స్థలం

సాక్షి,ఆదిలాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం అప్పట్లో రెవన్యూ అధికారులు నిర్ధారించిన ధర కోట్ల నుంచి లక్షల రూపాయలకు దిగొచ్చింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్నీ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ కారణంగా ఈ ధర దిగి వచ్చింది. 

ఎకరంలోపు..
అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని గతేడాదే నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేసి కనీసం ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని గతేడాది పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ఇందుకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జీఓ నెం.571 ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. 

గుర్తించిన భూమి...
ఆదిలాబాద్‌ అర్బన్‌ పరిధిలోకి  వచ్చే సర్వే నెం.346లో 36 గుంటల స్థలాన్ని గుర్తించారు. ఇది ఎకరానికి నాలుగు గుంటల స్థలం తక్కువగా ఉంది. పట్టణంలోని గాంధీ పార్కు, పాలశీతలీకరణ కేంద్రానికి ఎదురుగా కైలాస్‌నగర్‌లో వైట్‌ క్వార్టర్స్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది వరకు ఈ స్థలంలో దూరదర్శన్‌ రిలే కేంద్రం ఈ స్థలంలో ఉండేది. ప్రస్తుతం న్యాక్‌ శిక్షణ కేంద్రం కొనసాగుతోంది. శిథిలావస్థలో చిన్న భవనం మాత్రమే ఉంది.

దీనిని ఆనుకొని వైట్‌ క్వార్టర్స్‌ ఉన్న స్థలం కలుపుకొని మొత్తం 36 గుంటల స్థలాన్ని గతేడాది గుర్తించారు. జెడ్పీ చైర్మన్‌ క్యాంప్‌ కార్యాలయం తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం కూడా ఇదే దారిలో కడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, న్యాయమూర్తుల క్వార్టర్స్, డీఆర్వో, ఇతరత్ర ముఖ్యమైన ఉన్నతాధికారుల భవనాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పార్టీ కార్యాలయం కోసం అనువుగా ఉంటుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు ఈ స్థలాన్ని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది.

అప్పుడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డెయిరీ డెవలప్‌మెంట్‌ రాష్ట్ర చైర్మన్‌ లోక భూమారెడ్డిలు ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ఆదిలాబాద్‌అర్బన్‌ తహసీల్దార్‌ నుంచి ఆర్డీఓ ద్వారా కలెక్టర్‌ కార్యాలయానికి దీనికి సంబంధించిన పత్రాలను పంపించారు. కలెక్టర్‌ నుంచి సీసీఎల్‌ఏకు వెళ్లిన ఫైల్‌ చివరిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భూమి కేటాయింపు జరిగింది.

అప్పట్లో ధర వివాదం..
టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో గుర్తించిన స్థలం కేటాయింపునకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం 2018లో ప్రభుత్వానికి పంపించిన ఓపెన్‌ మార్కెట్‌ ధర అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పట్లో గుంటకు రూ.10లక్షల చొప్పున మొత్తం 36గుంటలకు రూ.3.65 కోట్లు నిర్ధారించి పంపడం వివాదానికి కారణమైంది. ధర విషయంలో రెవెన్యూ అధికారులపై టీఆర్‌ఎస్‌ వర్గాలు భగ్గుమన్నాయి.

అయితే ప్రభుత్వ బేసిక్‌ విలువపై ఎన్నో స్థాయిల రెట్టింపులో ఈ ధరను నిర్ధారించినట్లు పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అంత ధరనా.. అని టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు రెవెన్యూ అధికారులపై ఫైర్‌ అయ్యారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో ముఖ్యమైన కూడలిలోని ఈ స్థలం అంశం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో జేసీగా ఉన్న కృష్ణారెడ్డి బదిలీ అయ్యే ముందు ధర విషయంలో ఓపెన్‌ మార్కెట్‌ ధరను ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఈ వివాదానికి అప్పట్లో కారణమైంది. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయిన విషయం విధితమే.

తాజాగా ఉత్తర్వులు..
జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఒక్కో ఎకరం చొప్పున స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్‌ తివారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది. దాని ప్రకారం తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 36 గుంటల స్థలాన్ని రూ.4,35,600 లకు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. 

నేడు భూమిపూజ..
టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి గుర్తించిన స్థలంలో సోమవారం భూమిపూజ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాలకు కేటాయించిన స్థలంలో భూమిపూజ జరగనుండడం విశేషం. ఆదిలాబాద్‌లో జెడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డిలతో పాటు ఇటీవల ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement