భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ తయారీదారుల పెట్టుబడులను ఆకర్షించడానికి, కేంద్రం ఈ-వెహికల్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ.. దేశంలో అడుగుపెట్టడానికి ఉవ్విల్లూరుతున్న టెస్లా మార్గాన్ని మరింత సుగమం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా టెస్లా భారతదేశంలో ప్లాంట్ నిర్మించడానికి కేంద్రంతో చర్చలు జరుపుతూనే ఉంది. నేటికి కొత్త పాలసీ రావడంతో త్వరలోనే టెస్లా మనదేశానికి వస్తుందని పలువురు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఈవీ పాలసీ కింద.. ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ సుమారు రూ. 4150 కోట్లు (5వేల మిలియన్ డాలర్స్) పెట్టుబడి పెడితే.. అనేక రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఈ కొత్త పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఫ్యూయెల్ దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆటోమొబైల్ కంపెనీ రూ. 4150 కోట్లు పెట్టుబడి పెడితే.. మూడు సంవత్సరాల్లో స్థానికంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా విడి భాగాల్లో 25 శాతం స్థానీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల ధరలను బట్టి 70 నుంచి 100 శాతం దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. గతంలో ఇదే టెస్లా భారత్ ఎంట్రీకి సమస్యగా ఉండేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల టెస్లా ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల శాతం కేవలం 2% మాత్రమే. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment