automobiles (industry)
-
కేంద్రం కీలక నిర్ణయం.. టెస్లాకు లైన్ క్లియర్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ తయారీదారుల పెట్టుబడులను ఆకర్షించడానికి, కేంద్రం ఈ-వెహికల్ పాలసీని తీసుకొచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ.. దేశంలో అడుగుపెట్టడానికి ఉవ్విల్లూరుతున్న టెస్లా మార్గాన్ని మరింత సుగమం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా టెస్లా భారతదేశంలో ప్లాంట్ నిర్మించడానికి కేంద్రంతో చర్చలు జరుపుతూనే ఉంది. నేటికి కొత్త పాలసీ రావడంతో త్వరలోనే టెస్లా మనదేశానికి వస్తుందని పలువురు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ఈవీ పాలసీ కింద.. ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ సుమారు రూ. 4150 కోట్లు (5వేల మిలియన్ డాలర్స్) పెట్టుబడి పెడితే.. అనేక రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కొత్త పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఫ్యూయెల్ దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆటోమొబైల్ కంపెనీ రూ. 4150 కోట్లు పెట్టుబడి పెడితే.. మూడు సంవత్సరాల్లో స్థానికంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా విడి భాగాల్లో 25 శాతం స్థానీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల ధరలను బట్టి 70 నుంచి 100 శాతం దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. గతంలో ఇదే టెస్లా భారత్ ఎంట్రీకి సమస్యగా ఉండేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల టెస్లా ఊపిరి పీల్చుకుంది. గత ఏడాది దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఈవీల శాతం కేవలం 2% మాత్రమే. ఇది 2030 నాటికి 30 శాతానికి పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రూ.209 కోట్ల 'రోల్స్ రాయిస్' కారు - వివరాలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' ఇప్పుడు మరో ఖరీదైన కారు 'ఆర్కాడియా డ్రాప్‌టైల్'ను వెల్లడించింది. ఈ కారు ధర సుమారు రూ. 209 కోట్లు. దీనిని కంపెనీ సింగపూర్‌లోని ఒక ప్రైవేట్ వేడుకలో వెల్లడించారు. రోల్స్ రాయిస్ ఆర్కాడియా అద్భుతమైన డిజైన్ కలిగి చాలా వరకు వైట్ పెయింట్ అల్యూమినియం, కార్బన్ ఫైబర్ టబ్, ముందు భాగంలో బ్లాక్ కలర్ వంటి వాటిని పొందుతుంది. ఇది ఇతర డ్రాప్టెయిల్ల మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉండటం గమనించవచ్చు. రెండు డోర్స్, రెండు సీట్లు కలిగిన ఈ కారులో శాంటాస్ స్ట్రెయిట్ గ్రెయిన్ రోజ్‌వుడ్ ఎక్కువగా ఉపయోగించినట్లు సమాచారం. ఈ కారు తయారీలో సుమారు 233 చెక్క ముక్కలను ఉపయోగించినట్లు, దీనిని రూపొందించడానికి 8000 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినట్లు సమాచారం. డ్యాష్‌బోర్డ్‌లో రోల్స్ రాయిస్ క్లాక్ ఉంది. కేవలం దీనిని తయారు చేయడానికే.. రెండు సంవత్సరాల రీసర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారులోని ట్విన్ టర్బోచార్జ్డ్ 6.75 లీటర్ వీ12 ఇంజిన్ కలిగి 601 హార్స్ పవర్ 841 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
భారీగా పెరిగిన ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్.. వాటికే ఎక్కువ డిమాండ్!
ప్యాసింజర్ వాహనాల విక్రయాల పరిమాణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5–7 శాతం వృద్ధి చెందుతుంని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడవ ఏడాది పరిశ్రమ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని తెలిపింది. దేశీయంగా కార్ల విక్రయాలు, వీటి ఎగుమతులకు డిమాండ్ స్తబ్దుగా ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం గరిష్ట వృద్ధిని అంచనా వేసిన నేపథ్యంలో.. 2024–25 అమ్మకాల్లో 5–7 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్టు క్రిసిల్ తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఎస్‌యూవీలకు డిమాండ్.. వినియోగదారుల ప్రాధాన్యతలో గణనీయ మార్పు ఎస్‌యూవీలకు డిమాండ్‌ను పెంచింది. మహమ్మారి కంటే ముందునాటి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో ఎస్‌యూవీల వాటా 28 శాతం నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రెండింతలై 60 శాతానికి చేరింది. ఎలక్ట్రిక్ వేరియంట్లతో సహా వివిధ ధరల శ్రేణిలో కొత్త మోడళ్ల రాక, భవిష్యత్ మోడళ్లు, సెమీకండక్టర్ల సాధారణ లభ్యత కారణంగా ఎస్‌యూవీలకు ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2024–25లో ఎస్‌యూవీల విక్రయాల్లో 12 శాతం వృద్ధి ఉండొచ్చు. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల విభాగాల్లో పోటీ ధరలో ఫీచర్లతో కూడిన మోడళ్ల రాక ఈ జోరుకు ఆజ్యం పోస్తుంది. కార్ల ధరల్లో పెరుగుదల.. విడిభాగాలు, తయారీ వ్యయం పెరుగుతూ వస్తోంది. భద్రత, ఉద్గారాలపై మరింత కఠిన నిబంధనలను తయారీ సంస్థలు పాటించాల్సి రావడంతో వాహనాల ధర గత 3–4 సంవత్సరాలలో అధికం అయింది. ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల వాటా 2018–19 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14 శాతానికి పరిమితం అవుతుందని అంచనా. గత రెండేళ్లలో కీలక ఎగుమతి మార్కెట్లు లాటిన్ అమెరి కా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో ద్రవ్యోల్బణం ఎదు రుగాలులు, పరిమిత విదేశీ మారకపు లభ్యత దీనికి ప్రధాన కారణం. 2024–25లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతుంది. అయితే స్థిర కమోడిటీ ధరలు, గత ఆర్థిక సంవత్సరంలో అమలైన ధరల పెంపు పూర్తి ప్రయోజనంతోపాటు ఎస్‌యూవీల వాటా పెరగడంతో తయారీదారుల నిర్వహణ లాభాలు సు మారు 2 శాతం ఎగసి ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి చేరుతుంది. ఎస్‌యూవీలకు డిమాండ్‌తో 2024–25లో ఇది 11.5–12.5 శాతంగా ఉండొచ్చు. రూ.44,000 కోట్ల పెట్టుబడి.. ఈ ఆర్థిక సంవత్సరంలో సామర్థ్య వినియోగం దాదాపు 85 శాతానికి చేరుకోవచ్చు. ఎస్‌యూవీల కు బలమైన డిమాండ్ కొనసాగుతున్నందున ప్యా సింజర్ వాహన తయారీ సంస్థలు 2023–25 మధ్య సుమారు రూ.44,000 కోట్ల పెట్టుబడి వ్యయం చేస్తున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పో లిస్తే ఇది దాదాపు రెండింతలు. అయితే ఆరోగ్యక రంగా నగదు చేరడం, మిగులు కారణంగా రుణా లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తయారీదారుల క్రెడిట్ ప్రొఫైల్‌లను క్రిసిల్ స్థిరంగా ఉంచుతోంది. -
50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే..
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) కంపెనీ ఇన్నోవా హైక్రాస్ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 50వేల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హైక్రాస్ అమ్మకాలు ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందులో భాగంగానే కంపెనీ ఈ మోడల్ టాప్ వేరియంట్ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా వెయిటింగ్ పీరియడ్ కూడా 12 నుంచి 13 నెలల సమయం ఉన్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ 5వ జనరేషన్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టం కలిగి 187 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిఫ్ట్‌తో కూడిన మోనోకోక్ ఫ్రేమ్‌తో శక్తిని పొందుతుంది. ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అంతకు మించిన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల కస్టమర్లు ఈ కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. హైక్రాస్ ఉత్తమ అమ్మకాలు 50వేలు దాటిన సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. కేవలం 14 నెలల్లో 50000 యూనిట్ల హైక్రాస్ అమ్మకాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కస్టమర్లు మా ఉత్పత్తుల మీద ఉంచుకున్న నమ్మకానికి కృతజ్ఞులం అన్నారు. -
లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జేబులో డబ్బు పెట్టుకునే వారే కరువయ్యారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా అంతా ఆన్లైన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రమే తనకు ఇష్టమైన స్కూటర్ కొనటానికి మొత్తం చిల్లర ఇచ్చి షోరూమ్ వారికే షాక్ ఇచ్చాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనడానికి మొత్తం చిల్లర అందించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు లక్ష కంటే ఖరీదైన స్కూటర్‌ను చిల్లరతో కొనేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏథర్ ఎనర్జీ సీఈఓ 'తరుణ్ మెహతా' స్కూటర్ డెలివరీ చేసి, స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఫోటో షేర్ చేస్తూ.. జైపూర్ వ్యక్తి 10 రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జైపూర్ వ్యక్తి కొనుగోలు చేసిన ఏథర్ 450 సిరీస్ ఖచ్చితమైన మోడల్‌ను మెహతా పేర్కొనలేదు. కాబట్టి దీని ధర ఎంత అనేది స్పష్టంగా తెలియదు. ఏథర్ 450ఎక్స్, 450ఎస్, 450అపెక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుందో. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇదీ చదవండి: 2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా? A new Ather owner just bought himself a 450 in Jaipur ... all with 10Re coins! pic.twitter.com/VWoOJiQey2 — Tarun Mehta (@tarunsmehta) February 17, 2024 -
Budget 2024 Highlights: ఈవీ రంగం అంచనాలు తారుమారు..
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి పెద్ద పీట వేస్తారని, ఫేమ్ సబ్సిడీ కొనసాగిస్తారని చాలామంది భావించారు. కానీ నిర్మలమ్మ ప్రతిపాదనల్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పెద్ద ప్రకటనలు వెలువడలేదు. మా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరిస్తుందని, కొత్త ఈవీల తయారీ మాత్రమే కాకుండా ఛార్జింగ్ వంటి వాటికి మద్దతు కల్పిస్తామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కావలసిన మౌలిక సదుపాయాలను తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: 2024 బడ్జెట్ - కీలకమైన అంశాలు ఇవే! ఫేమ్ II సబ్సిడీ పథకం ముగిసిన తరువాత ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించలేదు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల మాన్యుఫ్యాక్షరింగ్, ఇన్‌స్టాలింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని సమాచారం. -
దిగ్గజ కంపెనీలకు వేదికగా ఢిల్లీ - భారత్ వైపు చూస్తున్న గ్లోబల్ మార్కెట్
2022 నుంచి ప్రపంచ దేశాల్లో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిన భారత్.. క్రమంగా వృద్ధి చెందుతూనే ఉంది. అగ్రశ్రేణి ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు చూపు కూడా ఇండియా వైపు పడుతోంది. దీంతో చాలా సంస్థలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 అనేక కొత్త వాహనాలు దర్శనమివ్వనున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ రోజు నుంచి ప్రారంభమైన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024' ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుంది. ఇందులో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్, అశోక్ లేలాండ్ వంటి సుమారు 28 కంపెనీలు, 600కి పైగా ఆటో కాంపోనెంట్ తయారీదారులు, 50కి పైగా బ్యాటరీ అండ్ స్టోరేజీ కంపెనీలు, 10 కంటే ఎక్కువ టైర్ల తయారీదారులు, తొమ్మిది నిర్మాణ పరికరాల తయారీదారులు, ఐదు స్టీల్ తయారీదారులు, 15 కంటే ఎక్కువ టెక్నాలజీ అండ్ స్టార్టప్ కంపెనీలు మొదలైనవి కనిపించనున్నాయి. భారతదేశం వాహన తయారీదారులకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ద్విచక్ర వాహనాల నుండి భారీ వాణిజ్య వాహనాల వరకు భారతదేశం ప్రపంచంలోని నాలుగు పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఉత్పత్తికి మాత్రమే కాకుండా ఎగుమతికి కూడా ఇండియా చాలా అనుకూలంగా ఉంటుంది. 2030 నాటికి భారతదేశంలో ఉత్పత్తయ్యే అన్ని ప్యాసింజర్ వాహనాల్లో వాహనాల వాటా 14 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది. అంతే కాకుండా భారతదేశంలో ఉత్పత్తయ్యే టూ వీలర్లలో దాదాపు 30 శాతం ఎగుమతయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు! -
విన్‌ఫాస్ట్ ఆసియా హెడ్‌గా జాక్ హోలిస్
స్కోడా ఆటో ఇండియా మాజీ బ్రాండ్ డైరెక్టర్ 'జాక్ హోలిస్' (Zac Hollis) వియత్నామీస్ ఈవీ మేజర్ విన్ఫాస్ట్లో ఆసియా హెడ్‌గా చేరారు. స్కోడా కోసం ఇండియా 2.0 వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హోలిస్, ఇప్పుడు విన్‌ఫాస్ట్ ఇండియా రోల్ అవుట్ ప్లాన్‌ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే వియత్నామీస్ ఈవీ నిపుణులు దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 16,600 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే హోలిస్ దీని బాధ్యతలు స్వీకరించారు. జరిగిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని తూత్తుకుడిలో విన్‌ఫాస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 3,000 నుంచి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈ సదుపాయంలో వార్షిక తయారీ సామర్థ్యం 1,50,000 యూనిట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడో రోజు ముందుకు కదలని బంగారం - రూ.500 తగ్గిన వెండి స్కోడా ఇండియాలో జాక్ హోలిస్ 2018లో స్కోడా ఆటోకు సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా నియమితులైన హోలిస్.. భారతదేశంలో కంపెనీ వృద్ధికి నాలుగు సంవత్సరాలు కృషి చేశారు. ఆ తరువాత స్కోడా నుంచి హోలిస్ వెళ్లిపోవడంతో స్కోడా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోయింది. 2018 కంటే ముందు ఈయన చైనాలో స్కోడా చైనా విక్రయాలను వృద్ధి చేయడంలో ఒకరుగా ఉన్నారు. -
2032 నాటికి .. ఏటా 2.72 కోట్ల ఈవీలు!
ముంబై: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2032 నాటికి ఏటా 2.72 కోట్ల యూనిట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. ఇంధన రంగంలో సలహాలు, సాఫ్ట్వేర్, సేవలు అందిస్తున్న కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రకారం.. 2032 నాటికి ఏటా ఈవీ పరిశ్రమ 35 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. ఈవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కేటాయించిన 1.2 బిలియన్ డాలర్ల సబ్సిడీ ఈ వృద్ధిని నడిపిస్తుంది. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాల తయారీకి 3.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఆమోదం పొందడం ద్వారా దేశీయ ఈవీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది దేశంలో ఈవీ సరఫరా వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈవీలను ప్రోత్సాహించేందుకు, ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ విధానాల ద్వారా ఈ రంగానికి చురుకుగా మద్దతు ఇస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఈవీ, విడిభాగాల తయారీకై కంపెనీలకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. -
2030 నాటికి టార్గెట్ ఇదే! - పియూష్ గోయల్
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన దేశం నుంచి ఎగుమతయ్యే వాహనాల శాతాన్ని పెంచాలని వాణిజ్య & పరిశ్రమల మంత్రి 'పియూష్ గోయల్' అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆటోమొబైల్ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసిన వాహనాలు 14 శాతమని తెలుస్తోంది. ఇది 2030 నాటికి 50 శాతానికి చేరుకోవాలని మెగా మొబిలిటీ షో 'భారత్ మొబిలిటీ' కోసం లోగో అండ్ బుక్‌లెట్‌ను ఆవిష్కరించే కార్యక్రమంలో గోయల్ అన్నారు. 2024 ఆటో ఎక్స్పో 2024 గ్లోబల్ ఎక్స్పో వచ్చే నెల ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల్లోని చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఇందులో భవిష్యత్తులో రానున్న వాహనాలు, ఆటోమోటివ్ భాగాలలో అత్యాధునిక సాంకేతికతలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీలు, అర్బన్ మొబిలిటీ సొల్యూషన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అటానమస్ వంటి వినూత్నమైన సాంకేతికతలు దర్శనమివ్వబోతున్నాయి. సుమారు 50కి పైగా దేశాల నుంచి 600 మందికి పైగా ఎగ్జిబిటర్లతో, ఎక్స్పో అత్యాధునిక సాంకేతికతలతో కనిపించనుంది. 27కంటే కంపెనీలు కొత్త మోడల్స్, ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో హైబ్రిడ్, CNG వాహనాలను ప్రదర్శిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: బంగారం, వెండి కొనటానికి కరెక్ట్ టైమ్ వచ్చింది! ఎందుకంటే? 2024 ఎక్స్‌పోలో జపాన్, జర్మనీ, కొరియా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి దేశాల పెవిలియన్లను ఉంటాయి. అయితే యుఎస్, స్పెయిన్, యుఎఇ, రష్యా, ఇటలీ, టర్కీ, సింగపూర్, బెల్జియం నుంచి అంతర్జాతీయ భాగస్వామ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎక్స్‌పోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
భారత్ ఒక్కరోజు అమ్మకాలను చేరుకోలేకపోయిన పాకిస్తాన్ - కారణం ఇదే!
Pakistan Car Sales: భారతీయ మార్కెట్లో ప్రతి నెలా మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన ఆటోమొబైల్ మార్కెట్.. పాకిస్తాన్లో బాగా క్షీణించి.. గత నెలలో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని పీఏఎమ్ఏ (PAMA) వెల్లడించింది. అక్కడ కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? ఈ నెలలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందా.. లేదా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) ప్రకారం.. పాకిస్తాన్లో నవంబర్ 2023లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో అక్కడి అమ్మకాలు 15,432 కావడం గమనార్హం. పాకిస్తాన్లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గడానికి కారణం 'పెరిగిన ఆర్థిక సంక్షోభం, తారా స్థాయికి చేరిన కార్ల ధరలు, సగటు వ్యక్తి సంపాదన క్షీణించడం' మాత్రమే కాకుండా పరిశ్రమ డిమాండ్ పడిపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు, ఆటో ఫైనాన్సింగ్ వంటివి ఖరీదైనవి కావడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. నిత్యావసర వస్తువులే కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలకు కార్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఈ కారణంగానే పాకిస్తాన్లో ఆటోమొబైల్ మార్కెట్ బాగా క్షీణించింది. పాక్ సుజుకి, ఇండస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా అట్లాస్ కార్ వంటి ప్రధాన వాహన తయారీదారుల అమ్మకాలు వరుసగా 72 శాతం, 71 శాతం, 49 శాతం క్షీణించాయి. మరి కొన్ని సంస్థలు పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్స్ కూడా మూసివేసాయి. 2023 జులై నుంచి అక్టోబర్ వరకు పాకిస్తాన్లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 20,871. అంటే నాలుగు నెలల కాలంలో అమ్ముడైన వాహనాల సంఖ్య సగటున ఐదు వేలు మాత్రమే అని స్పష్టమవుతోంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ అమ్మకాలు కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నెలలో కూడా అమ్మకాలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ! భారతీయ మార్కెట్లో అమ్మకాలు పాకిస్తాన్లో కార్ల అమ్మకాలను పక్కన పెడితే.. భారతదేశంలో కార్ల విక్రయాలు గత నెలలో జోరుగా సాగాయి. నవంబర్ 2023లో మారుతి సుజుకి ఇండియా సేల్స్ 1,64,439 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 17,818 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో దేశంలో జరిగిన మొత్తం కార్ల అమ్మకాలు 3.60 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ. పాకిస్తాన్లో అమ్ముడైన కార్ల సంఖ్య.. భారతదేశంలో సగం రోజులో అమ్ముడైన కార్ల సంఖ్య కంటే తక్కువని తెలుస్తోంది. భారతదేశంలోని ద్విచక్ర వాహన తయారీదారులు నవంబర్‌లో తమ ఫోర్ వీలర్ కౌంటర్‌పార్ట్‌లను అధిగమించారు. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్' (FADA) గణాంకాల ప్రకారం నవంబర్‌లో ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. -
తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు
అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన 'మిచాంగ్ తుఫాన్' (Michaung Cyclone) ప్రజలను మాత్రమే కాకుండా.. వాహనాలను కూడా ప్రభావితం చేసింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనాల్లో అనేక సమస్యలు తలెత్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి వాహన తయారీ సంస్థలు కొన్ని ప్రత్యేక సర్వీసులను అందించడానికి ముందుకు వచ్చాయి. ఏ కంపెనీలు స్పెషల్ సర్వీసులను అందించనున్నాయి, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ వాహన తయారీ దిగటం టాటా మోటార్స్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా నష్టపోయిన తన వినియోగదారులకు సంఘీభావంగా తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ వాహనాల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి స్టాండర్డ్ వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ టైమ్ పొడిగించడమనే కాకుండా.. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఫ్రీ సర్వీస్ వంటి వాటిని కూడా పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2023 డిసెంబర్ 1 నుంచి 15 లోపు ముగిసే ఒప్పందాలను కూడా డిసెంబర్ 31 వరకు పెంచారు. ఎమర్జెన్సీ రోడ్ అసిస్టెన్స్ టీమ్ ఏర్పాటు చేసి.. 24 X 7 హెల్ప్‌డెస్క్ ప్రారంభించింది. తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన సర్వీస్ అందించడానికి ఫ్రీ టోయింగ్ సహాయాన్ని కూడా అందిస్తోంది. టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar) మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో తమ కస్టమర్లకు ప్రత్యేక సహాయక చర్యలను అందించడానికి డీలర్ భాగస్వాములతో కలిసి ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కస్టమర్లకు తక్షణ సహాయం అందించడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. కస్టమర్ల వెహికల్ పికప్ అండ్ డ్రాప్ సేవలను వారి ఇంటి వద్దకే పరిమితం చేసి మరింత సులభతరం చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మహీంద్రా కంపెనీ కూడా తన కస్టమర్లకు కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో-కాస్ట్ ఇన్స్పెక్షన్, డ్యామేజ్ అసెస్మెంట్, ప్రత్యేక తగ్గింపుల ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. ఈ సర్వీసులన్నీ కూడా డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా? మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కంపెనీలు మాత్రమే కాకుండా హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకి ఇండియా, ఆడి, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా తమ కస్టమర్లకు సర్వీసులను అందించడానికి తగిన ఏర్పాట్లను చేశాయి. వినియోగదారులు కూడా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. -
లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు - వివరాలు
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది, విస్తరిస్తున్న మార్కెట్ అవసరాలను తీర్చడానికి వాహన తయారీదారులు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. దేశీయ విఫణిలో త్వరలో విడుదలయ్యే టాప్ 5 కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యధిక అమ్మకాలు పొందిన మారుతి సుజుకి సరికొత్త అవతార్‌లో విడుదలకావడానికి సిద్ధమవుతోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త కారు ఇప్పటికే చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది 2024 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టాటా పంచ్ ఈవీ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ కలిగిన టాటా పంచ్ త్వరలో ఎలక్ట్రిక్ కారుగా విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. ఇది జెనరేషన్ 2 ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఒక ఛార్జ్‌తో సుమారు 300 కిమీ నుంచి 350 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. సరైన గణాంకాలు లాంచ్ సమయంలో అధికారికంగా విడుడలవుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అవుట్గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉంటుందని, ఇందులో ADAS వంటి లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. 2024 ప్రారంభంలో విడుదల కానున్న ఈ కారు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందిన మహీంద్రా థార్.. త్వరలో 5 డోర్ రూపంలో విడుదలకానుంది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు అవుట్గోయింగ్ వెర్షన్‌తో పోలిస్తే అదనపు టెక్నాలజీ, ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ లైట్ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్పీరియన్స్.. టాటా కర్వ్ ఈవీ 2023 ఆటో ఎక్స్‌పోలో కనువిందు చేసిన టాటా కర్వ్ ఈవీ 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు ఫుల్ ఛార్జ్‌తో 400 కిమీ నుంచి 500 కిమీ పరిధిని అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మాటలకు అందని దేశీయ ఆటోమొబైల్ చరిత్ర! ప్రపంచమే సలాం కొట్టేలా..
Indian Automobile History: సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో పూర్తి తెలుసుకుందాం. 1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి.. ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్సెట్జీ నుస్సర్వాన్జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు. ఆవిరితో నడిచే వాహనాలు.. తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది. భారతీయ ఆటోరంగానికి ఆటంకం.. ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది. అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని.. అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి. SIAM ఏర్పాటు.. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది. వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్.. విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది. ➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి. ఇదీ చదవండి: స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఎన్ని బ్యాంకులు ఉండేవో తెలుసా? ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. -
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) జోరు కొనసాగుతోంది. 2023 జనవరి–జూలై మధ్య అన్ని విభాగాల్లో కలిపి రిటైల్‌లో 8,38,766 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 జనవరి–డిసెంబర్లో అమ్ముడైన మొత్తం యూనిట్లతో పోలిస్తే గడిచిన ఏడు నెలల విక్రయాల వాటా ఏకంగా 82 శాతం ఉంది. జూలైతో ముగిసిన ఏడు నెలల అమ్మకాల్లో ఈ–టూ వీలర్లు 4,89,640 యూనిట్లు, ఈ–త్రీవీలర్లు 3,00,099, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ 46,164, సరుకు రవాణాకు ఉపయోగించే ఈ–వాహనాలు 1,603, ఈ–బస్‌లు 945, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలు 316 యూనిట్లు ఉన్నాయి. 2022 జనవరి–జూలైలో ఈ–టూవీలర్ల అమ్మకాలు 3,06,947 యూనిట్లు నమోదయ్యాయి. 2022లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్‌లు కలుపుకుని 10,24,806 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. జూలైలో 1,15,836.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో 2023 జూలైలో దేశవ్యాప్తంగా రిటైల్‌లో అన్ని విభాగాల్లో కలిపి 1,15,838 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈవీల విక్రయాలు లక్ష యూనిట్ల మార్కును దాటడం వరుసగా ఇది 10వ నెల. జూన్‌లో ఈ సంఖ్య 1,02,362 యూనిట్లు నమోదైంది. వాస్తవానికి జూన్ 1 నుంచి ఫేమ్–2 సబ్సిడీ తగ్గుతోందన్న కారణంగా మే నెలలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లకు కస్టమర్లు అధికంగా ఉత్సాహం చూపించారు. దీంతో మే నెలలో అన్ని విభాగాల్లో కలిపి 1,58,300 యూనిట్ల ఈవీలు అమ్ముడు కాగా, ఇందులో ఏకంగా 1,05,452 యూనిట్ల ఈ–టూ వీలర్లు ఉన్నాయి. ఇక ఈ ఏడాది జూలైలో ఈ–టూ వీలర్లు 54,272 యూనిట్లు, ఈ–త్రీవీలర్లు 53,736 యూనిట్లు, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ 7,475 యూనిట్లు, గూడ్స్ వాహనాలు 219, ఈ–బస్‌లు 133 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
ఆ ఒక్క మాటతో.. ఎలాన్ మస్క్‌కు రూ.1.64 లక్షల కోట్లు నష్టం!
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. టెస్లా కార్ల ధరల్ని తగ్గిస్తామంటూ మస్క్ చేశారు. అంతే ఆ నిర్ణయంతో టెస్లా షేర్ వ్యాల్యూ భారీగా క్షీణించింది. మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు (రూ.1.64లక్షల కోట్లు) కోల్పోయారు. బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..ఎలాన్ మస్క్ మొత్తం సంపద 234.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మస్క్ ప్రతీరోజు 530 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, మస్క్ నెట్ వర్త్‌ను మొత్తంలో ఏడు సార్లు కోల్పోయారు. అయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రముఖ లగర్జీ గృహోపకరణాల సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్‌కు ఆర్నాల్ట్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 33 బిలియన్ డాలర్లు మాత్రమే. మస్క్‌తో పాటు ఒక్కరోజులోనే భారీ మొత్తంలో సంపద కోల్పోయిన జాబితాలో టెస్లా సీఈవోతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీల అధినేతలు సైతం ఉన్నారు. వారిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్ లారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బల్మెర్, మెటా బాస్ మార్క్ జుకర్ బర్గ్, ఆల్ఫాబెట్ కోఫౌండర్ లారీ పేజ్,సెర్గీ బ్రిన్ ఇలా టెక్ కంపెనీల సంపద 2.3శాతంతో 20.3 బిలియన్ డాలర్ల సంపద నష్టపోయినట్లు అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్డాక్ 100 ఇండెక్స్ తెలిపింది. ఒక్కరోజే 9.7 శాతం న్యూయార్క్ కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లా షేర్ల విలువ ఏప్రిల్ 20 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై 20న 9.7 శాతంతో టెస్లా షేర్ ధర 262.90 డాలర్ల వద్ద కొనసాగుతూ వస్తుంది. ఇక, ఏప్రిల్ 20 నుండి టెస్లా భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు మస్క్ ఓ సందర్భంలో తెలిపారు. టెస్లా మదుపర్లలో అలజడి అంతేకాదు ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి పడిపోయి గ్రాస్ మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. తాజాగా, అమెరికా ప్రభుత్వం ఆర్ధిక మాంద్యాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతే టెస్లా ధరలను తగ్గించాల్సి ఉంటుందని కంపెనీ మస్క్ హెచ్చరించారు. మస్క్ చేసిన ఈ ప్రకటనతో టెస్లా షేర్ హోల్డర్లలో తీవ్ర అలజడిని రేపింది. షేర్లను అమ్ముకోవడంతో ఎలాన్ మస్క్ సంపద భారీ క్షిణీంచింది. చదవండి👉 భారత్‌లో టెస్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు -
ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎనర్జీ స్టోరేజీ రంగానికి హబ్‌గా తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి శుక్రవారం డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ–2020–2030ని ఆవిష్కరించి మాట్లాడారు. ‘దేశంలోనే 1000 ఎకరాల్లో అతిపెద్ద ఎల్రక్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మహేశ్వరంలోని రావిర్యాల్ ఈ–సిటీలో మాత్రమే ఉంది. జహీరాబాద్ నిమ్జ్‌ను ఆటోమొబైల్ క్లస్టర్‌గా ప్రమోట్ చేస్తాం. దీంతో మరో 1000 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. చందన్వెల్లి సీతారాంపూర్‌లో ఒకటి, షాబాద్‌లో మరో ఎలక్ట్రిక్ వాహనాల క్లస్టర్‌ను తీసుకొస్తున్నాం. షాబాద్ క్లస్టర్లో తయారీ ప్లాంట్లు పెట్టడానికి ఇప్పటికే ఎలక్ట్రా, మైత్రా కంపెనీలు ముందుకొచ్చాయి మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల మరో క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తాం. కొత్తగా మరో వారం రోజుల్లో ప్రకటించనున్న మొబిలిటీ(రవాణా) క్లస్టర్‌కు ప్రముఖ వాహన తయారీదారులు రానున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ఉత్సాహం ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణను హబ్‌గా మార్చుకోవడానికి ఈ సదుపాయాలు ఉపయోగపడుతాయి’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈసీఐఎల్, హెచ్ఐఎల్, భెల్ వంటి ఎల్రక్టానిక్ రంగ పరిశ్రమలతో పాటు జెడా ఆటోమోటివ్, ఒప్పో, వివో, ఇన్టెల్, మైక్రాన్ వంటి పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉండటం ఎలక్ట్రిక్ వాహన రంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కాకుండా ఎనర్జీ స్టోరేజీ(బ్యాటరీల తయారీ) రంగాన్ని సైతం ప్రోత్సహించడానికి సమగ్రమైన పాలసీని తీసుకొచ్చామని వెల్లడించారు. విద్యుత్ వాహనాలు/బ్యాటరీల తయారీ, వినియోగం, చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈ పాలసీ కింద ప్రకటించిన రాయితీ, ప్రోత్సాహకాలు మరింత మందికి పొడిగించేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పాలసీని సవరిస్తామని వివరించారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల తయారీ.. జహీరాబాద్‌లోని మహీంద్రా కంపెనీలో జపాన్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించనున్నామని ఆ సంస్థ సీఈఓ, ఎండీ పవన్ గోయంకా ఈ కార్యక్రమంలో ప్రకటన చేయగా, మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ప్రపంచ, దేశ ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా రాష్ట్రం ఐదేళ్లుగా సుస్థిరంగా 14.2 శాతం జీఎస్డీపీని సాధిస్తూ వస్తోందన్నారు. ఈఓడీబీలో మూడో ర్యాంకుతో ఈసారి కొంత కిందకుపోయినా, మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. టీఎస్–ఐపాస్ ద్వారా ఇప్పటికే రాష్ట్రానికి 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, జాతీయ ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 8 శాతం ఉండగా, రాష్ట్ర వృద్ధిరేటు 18శాతం ఉందన్నారు. రైల్వేస్టేషన్లు, బస్ డిపోలు, పెట్రోల్ బంకు లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల వద్ద విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కలి్పస్తున్నామన్నారు. రాష్ట్రంలో త్వరలో 178 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,401 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రర్ అయ్యాయని, వీటిలో 4,292 ద్విచక్రవాహనాలు, 491 మోటార్ క్యాబ్స్, 194 ఈ–రిక్షా, 40 ఆర్టీసీ బస్సులున్నాయని మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. ఈ–ఆటో రిక్షాలను ప్రోత్సహించేందుకు త్వరలో ఆటో రిక్షాలపై ఉన్న ఆంక్షలు తొలగిస్తూ జీవో 135, 14కు సవరణలు తీసుకొస్తామని స్పష్టంచేశారు. ఫాస్ట్ చార్జింగ్ నెట్వర్క్.. టీఎస్ రెడ్కో, హైదరాబాద్ మెట్రో రైల్, పవర్‌గ్రిడ్, పెట్రోలియం కంపెనీలతో పాటు ఫోటం వంటి ప్రైవేట్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. రెసిడెన్షియల్ టౌన్ షిప్, మాల్స్ తప్పనిసరిగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ నిబంధనలు తెచి్చందన్నారు. ఆర్టీసీ తొలుత 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల భాగస్వామ్యంతో ప్రారంభించిందని, మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గి సంస్థకు లాభాలొస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో మరో 325 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ తీసుకొస్తుందని వెల్లడించారు. పలు కంపెనీలతో ఎంఓయూలు ఈ సందర్భంగా పలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రూ.300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రా సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొల్పనుంది. దీని ద్వారా 3,500 ఉపాధికి ఉపాధి లభించనుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో మైత్ర కంపెనీ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో స్థాపించి 2,250 మందికి ఉపాధి కల్పించనుంది. ఈటీఓ మోటార్స్ రూ.150 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో స్థాపించి 1,500 మందికి ఉపాధి కలి్పంచనుంది. మైత్ర ఎనర్జీ రూ.2 వేల కోట్లను, ఒలెక్ట్రా రూ.300 కోట్లను, ఈటీఓ మోటార్స్ రూ.150 కోట్లను, గాయం మోటార్స్ రూ.250 కోట్లను, ప్యూర్ ఎనర్జీ రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 14,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏఆర్ఏఐ కంపెనీతో మరో ఎంఓయూ కుదుర్చుకున్నా వివరాలు వెల్లడించలేదు. మరో రెండు కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ లేఖ అందజేశాయి. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సలహాదారుడు అన్నా రాయ్, మహీంద్రా గ్రూపు ఎండీ, సీఈఓ పవన్ గోయంకా, ఎస్ బ్యాంక్ చైర్మన్ సునీల్ మెహతా తదితరులు మాట్లాడారు. -
మూడేళ్లకే బైక్ మార్చేస్తున్నారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వ్యూహం అంటూ లేకుండా వాహన రంగంలో నిలదొక్కుకోలేం. బజాజ్ ఆటో భారతీయ కంపెనీయే. కానీ మేం ఇక్కడితో పరిమితం కాలేదు. 30కి పైగా దేశాలకు వాహనాలను సరఫరా చేస్తున్నాం. మా దృష్టి భారత్‌తోసహా అన్ని మార్కెట్లపైనా ఉంటుంది. ఒక దేశం కోసం అంటూ వాహనాలను తయారు చేయం’ అని అంటున్నారు బజాజ్ ఆటో కంపెనీ, మోటార్ సైకిల్ విభాగపు ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్. సరికొత్త డిస్కవర్ 125 బైక్‌ను ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కస్టమర్ల అభిరుచులు, కంపెనీ భవిష్యత్ కార్యాచరణ, మార్కెట్ తీరుతెన్నులు ఆయన మాటల్లోనే.. మూడేళ్లయితే చాలు.. దక్షిణాదివారైనా, ఉత్తరాదివారైనా మోటార్ సైకిళ్ల విషయంలో భారతీయ కస్టమర్ల అభిరుచులు దాదాపు ఒకేలా ఉన్నాయి. స్టైల్, మంచి పవర్ ఉన్న బైక్‌లపై మక్కువ పెరుగుతోంది. గతంలో ఒకసారి బైక్ కొంటే ఏడెనిమిదేళ్లు వాడేవారు. ఐదేళ్ల క్రితం వరకు ఈ ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మూడు నాలుగేళ్లకే వాహనం మారుస్తున్నారు. రెండేళ్లుగా సెంటిమెంట్ బాగోలేదు. ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళనలో ఉంటే కొత్త బైక్ కొనలేరుగా. అందుకే ద్విచక్ర వాహన పరిశ్రమ స్తబ్దుగా ఉంది. వచ్చే ఏడాది వృద్ధి ఖాయం. ఎక్సైజ్ డ్యూటీని 12 నుంచి 8 శాతానికి కుదించడం మంచి పరిణామం. కొత్త ప్రభుత్వం ఈ తగ్గింపు సుంకాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. మా వాహనాల ధరను రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు తగ్గించాం. స్కూటర్ తెచ్చే ఆలోచనే లేదు.. ప్రపంచంలో అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో 80 శాతం మోటార్ సైకిళ్లే. ప్రపంచ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విభాగంలో బ జాజ్‌కు 10 శాతం వాటా ఉంది. అందుకే మోటార్ సైకిల్ కంపెనీగా మాత్రమే మేం కొనసాగుతాం. స్కూటర్ తయారు చేసే ఆలోచన ఏ మాత్రం లేదు. ఏటా 48 లక్షల బైక్‌లను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్లాంట్ల యుటిలైజేషన్ 85 శాతం. ఇందులో ఎగుమతుల వాటా 33 శాతం. దేశంలో మోటార్ సైకిళ్లలో 22 శాతం వాటా బజాజ్‌కు ఉంది. కొత్త డిస్కవర్ 125 రాకతో ఇది 30 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఆ మూడింటిపైనే.. క్రూయిజర్ బైక్ అయిన అవెంజర్ 220 హోట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. ప్రస్తుతానికి అవెంజర్ బ్రాండ్‌లో ఈ ఒక్క మోడల్‌నే కొనసాగిస్తాం. కొత్త వేరియంట్లు ఏవైనా పల్సర్, ప్లాటినా, డిస్కవర్.. ఈ మూడు బ్రాండ్లలో మాత్రమే విడుదల చేస్తాం. ఏపీలో ఎక్కువ కాబట్టే.. దేశంలో నెలకు 1.6 లక్షల బైక్‌లు 125 సీసీ సామర్థ్యం గలవి అమ్ముడవుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 17 శాతముంది. ఈ కారణంగానే భారత్‌లో తొలిసారిగా కొత్త డిస్కవర్ 125ని హైదరాబాద్ వేదికగా ఆవిష్కరించాం. 100 సీసీ బైక్‌లు కేవలం మైలేజీకే పరిమితం. 7.5-8 హార్స్‌పవర్‌ను ఇవి మించడం లేదు. మైలేజీ మినహా మరే ఇతర ప్రయోజనం లేదు. 20 ఏళ్లుగా ఈ విభాగంలో పెద్దగా సాంకేతిక అభివృద్ధి జరగలేదు. అధిక సామర్థ్యం గల బైక్ కొనాలని ఉన్నా ఖర్చు ఎక్కువని, మైలేజీ రాదని కస్టమర్లు మిన్నకుండి పోతారు. వీరికోసమే స్టైల్, పవర్, మైలేజీ కలిగిన కొత్త డిస్కవర్ 125ను పరిచయం చేశాం. 11.5 పీఎస్ పవర్, మైలేజీ 76 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ 100 కిలోమీటర్లు. డ్రమ్ బ్రేక్ మోడల్ ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో రూ.49,075. డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంది. ఆరు రకాల ఆకర్షణీయ రంగుల్లో ఇది లభిస్తుంది.