Indian Automobile History: సువిశాలమైన భారతదేశం ఈ రోజు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తూ ప్రపంచానికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటే.. ఇదంతా ఒక్క రోజులో జరిగిన పురోగతి కాదు, దశాబ్దాల తదేక కృషి ఫలితమే ఈ అభివృద్ధి. ఇండియాలో ఇతర రంగాలు ఒక ఎత్తయితే, ఆటో మొబైల్ రంగం మరో ఎత్తు అనే చెప్పాలి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో పూర్తి తెలుసుకుందాం.
1957 వరకు కూడా సొంతంగా కారుని ఉత్పత్తి చేయలేని భారత్ ఈ రోజు ప్రపంచ ఆటోమొబైల్ పవర్‌హౌస్‌లలో ఒకటిగా ఎదిగింది. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ.. అఖండ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడింది. నిజానికి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రయాణం చాలా బిన్నంగా ఉంటుంది. మన దేశంలో మొదటి వాహనం 1897లో అడుగుపెట్టినప్పటికీ దానిని ఒక ఆంగ్లేయుడు దిగుమతి చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
టాటా కారును కలిగిన మొదటి భారతీయ సంతతి వ్యక్తి..
ఇండియా.. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు బొంబాయి, మద్రాస్, కలకత్తా వంటి నగరాల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే కార్లు ఉండేవి. 20వ శతాబ్దం మొదటి అర్ధభాగం వరకు భారతదేశంలోని దాదాపు అన్ని కార్లు దిగుమతి చేసుకున్నవే. 1898లో జమ్‌సెట్జీ నుస్సర్వాన్‌జీ (Jamsetji Nusserwanji) టాటా కారును కలిగి ఉన్న భారతీయ సంతతికి చెందిన మొదటి వ్యక్తి అయ్యాడు.
ఆవిరితో నడిచే వాహనాలు..
తరువాత కాలక్రమంలో ఆవిరితో నడిచే వాహనాలు ఆధిపత్యం చెలాయించాయి. 1903వ సంవత్సరంలో మద్రాస్‌లోని సింప్సన్ & కోకి చెందిన 'శామ్యూల్ జాన్' భారతదేశపు మొట్టమొదటి ఆవిరి కారును నిర్మించాడు. అప్పట్లో ఈ కారు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఇది తరువాత వచ్చిన భవిష్యత్ ఆవిష్కరణలకు కూడా ఆధారంగా నిలిచింది. 1928లో జనరల్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తన బొంబాయి ఫ్యాక్టరీలో ట్రక్కులు, కార్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించింది. 1930 నాటికి ఫోర్డ్ మోటార్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్రాస్‌లో ఆటోమొబైల్స్ అసెంబ్లీని ప్రారంభించింది.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రారంభ రోజుల్లో 1948 నాటికి హిందుస్థాన్ మోటార్స్, మహీంద్రా, స్టాండర్డ్, ప్రీమియర్, టాటా మోటార్స్ వంటి ప్రధాన కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత కాలంలోనే దేశం కొత్త ప్రగతి యుగానికి నాంది పలికేందుకు సిద్ధమైంది. మహాత్మా గాంధీ స్వావలంబన సూత్రాలకు అనుగుణంగా, స్వదేశీ ఆటో పరిశ్రమను నిర్మించాలనే కలను భారత ప్రభుత్వం సాకారం చేసింది.
భారతీయ ఆటోరంగానికి ఆటంకం..
ఆటోమోటివ్ భాగాలను మాత్రమే కాకుండా వాహనాల కోసం అంతర్గత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిర్ణయం 1952 నాటి టారిఫ్ కమిషన్ సృష్టికి దారితీసింది. ఆ తరువాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో 1954 నాటికి, ఫోర్డ్, జనరల్ మోటార్స్, రూట్స్ వంటి కొన్ని అతిపెద్ద ఆటోమోటివ్ ఎగుమతిదారులు తక్షణమే దుకాణాన్ని మూసివేశారు. ఇది ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి భారతీయ మార్కెట్‌ను దూరం చేశారు. అంతే కాకుండా స్థానిక కంపెనీలు తయారు చేసిన మోడల్స్ అమ్మకపు ధరలపై తీవ్రమైన షరతులను ఎదుర్కొంటున్నందున భారతీయ ఆటో రంగం దాదాపు ఆగిపోయినట్లయింది.
అంబాసిడర్ & ప్రీమియర్ పద్మిని..
అయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమ మళ్ళీ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 1957లో హిందుస్థాన్ అంబాసిడర్ రూపంలో మొట్టమొదటి ఆల్-ఇండియన్ కారు ఉనికిలోకి వచ్చింది. ఆ తరువాత 1964లో ప్రీమియర్ కంపెనీ అంబాసిడర్‌కు ప్రత్యర్థిగా 'పద్మిని' కారుని ప్రారంభించింది. ఈ రెండు కార్లు ఆటోమొబైల్ పరిశ్రమను తిరుగులేకుండా దశాబ్ద కాలం పాటు పాలించాయి.
SIAM ఏర్పాటు..
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రారంభ రోజులలో స్థిరమైన పురోగతి, పరిశోధన ద్వారా పరిశ్రమకు మద్దతునిచ్చే లక్ష్యంతో దేశీయ సంస్థలు ఏర్పడ్డాయి. 1960లో, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్ (SIAM) భారతదేశంలో ఆటోమొబైల్స్ కోసం స్థిరమైన అభివృద్ధి వ్యవస్థను రూపొందించే దృష్టితో ఏర్పడింది.
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రను మనం పరిశీలిస్తే.. 1980లలో సాధించిన విజయాలే ఈ రోజు బలమైన పరిశ్రమలకు పునాదులని తెలుస్తోంది. 21వ శతాబ్దంలో మారుతీ సుజుకిగా పిలువబడే మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్, జపాన్ ఆటోమోటివ్ పవర్‌హౌస్ సుజుకితో జాయింట్ వెంచర్‌గా ఏర్పడింది. ఆ తరువాత బాలీవుడ్ రంగం ఈ పరిశ్రమను పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర వహించింది.
వేగం పెరిగిన ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్..
విదేశీ ప్రభావంతో పాటు పెట్టుబడి పరంగా కూడా 1990 వ దశకంలో భారతీయ ఆటో మార్కెట్ వేగంగా ముందుకు సాగింది. పెట్టుబడులు వెల్లువెత్తడంతో 1993 & 1996 మధ్య కార్ల విక్రయాలు రెట్టింపయ్యాయి. ఆ తరువాత మెర్సిడెస్ బెంజ్ 2004లో భారతదేశానికి వచ్చి దేశంలోని మొట్టమొదటి విదేశీ లగ్జరీ ఆటోమేకర్‌గా చరిత్ర సృష్టించింది. 2006లో బీఎండబ్ల్యూ, 2007లో ఆడి అరంగేట్రం చేశాయి. అప్పటి నుంచి ఈ మూడు జర్మన్ కంపెనీలు భారతదేశంలోని లగ్జరీ కార్ల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాము. కావున కొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే ఆధునిక ఆటో పరిశ్రమ కొత్త మార్గాల్లో ప్రవేశించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆధునిక హంగులను పొందగలిగింది.
➤ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: వాహనాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలికింది. AI సామర్థ్యాలు కలిగిన కార్లు మునుపటి వాటికంటే మరింత ఆధునికంగా మారాయి. తయారీ ప్రక్రియ నుంచి మొత్తం ఉత్పత్తి వరకు ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇప్పుడు మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారవుతున్నాయి. నేడు బిఎస్ 4 వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. రానున్న రోజుల్లో డీజిల్ కార్లు కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
➤ఎలక్ట్రిక్ మొబిలిటీ: ఒకప్పుడు నీటి ఆవిరి ద్వారా.. ఆ తరువాత డీజిల్, పెట్రోల్ వంటి కార్లు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు అరంగేట్రం చేసి భారదేశాన్ని మరింత ప్రగతి మార్గంలో పయనించేలా చేశాయి. చాలామంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.
➤స్వయంప్రతిపత్త వాహనాలు (Autonomous Vehicles): భారతీయ ఆటో పరిశ్రమలో చెప్పుకోదగ్గ మార్పు ఈ స్వయంప్రతిపత్తి వాహనాలు. అంటే ఈ వాహనాలు తనకు తానుగానే ముందుకు సాగుతాయి. ఇది మానవుడు కనిపెట్టిన అద్భుత సృష్టి అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వాహనాలు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఆ వాహనాలు ప్రమాదాల నుంచి మనుషులను కాపాడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
➤భద్రతపై దృష్టి: ఇప్పుడు మార్కెట్లో విడుదలయ్యే చాలా కంపెనీల వాహనాలు భద్రతాపరంగా చాలా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే సంస్థలు ఈ విధమైన వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆధునిక కాలంలో ADAS టెక్నాలజీ కూడా ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. రానున్న రోజుల్లో ఎగిరే కార్లు కూడా భారతదేశంలో అరంగేట్రం చేయనున్నాయి.
ఇదీ చదవండి: స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఎన్ని బ్యాంకులు ఉండేవో తెలుసా?
ఒకప్పుడు కారునే తయారు చేయలేని భారత్.. ఈ రోజు ఎన్నెన్నో దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి నాటికి మన దేశంలో 22,933,230 వాహనాలు ఉత్పత్తయ్యాయని SIAM నివేదించింది. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతగా అభివృద్ధి చెందిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. రానున్న రోజుల్లో మరింత ఎత్తుకి ఎదుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment