ఎలక్ట్రిక్‌ వాహనాల హబ్‌గా తెలంగాణ  | Telangana As The Hub Of Electric Vehicles | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ వాహనాల హబ్‌గా తెలంగాణ 

Published Sat, Oct 31 2020 7:18 AM | Last Updated on Sat, Oct 31 2020 7:42 AM

Telangana As The Hub Of Electric Vehicles - Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్‌ పాలసీని ఆవిష్కరిస్తున్న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌ కుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు జయేశ్‌ రంజన్, సునీల్‌ శర్మ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, ఎనర్జీ స్టోరేజీ రంగానికి హబ్‌గా తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి శుక్రవారం డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో తెలంగాణ ఎలక్ట్రిక్‌ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ–2020–2030ని ఆవిష్కరించి మాట్లాడారు. ‘దేశంలోనే 1000 ఎకరాల్లో అతిపెద్ద ఎల్రక్టానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ మహేశ్వరంలోని రావిర్యాల్‌ ఈ–సిటీలో మాత్రమే ఉంది. జహీరాబాద్‌ నిమ్జ్‌ను ఆటోమొబైల్‌ క్లస్టర్‌గా ప్రమోట్‌ చేస్తాం. దీంతో మరో 1000 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. చందన్‌వెల్లి సీతారాంపూర్‌లో ఒకటి, షాబాద్‌లో మరో ఎలక్ట్రిక్‌ వాహనాల క్లస్టర్‌ను తీసుకొస్తున్నాం. షాబాద్‌ క్లస్టర్‌లో తయారీ ప్లాంట్లు పెట్టడానికి ఇప్పటికే ఎలక్ట్రా, మైత్రా కంపెనీలు ముందుకొచ్చాయి

మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రిక్‌ వాహనాల మరో క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తాం. కొత్తగా మరో వారం రోజుల్లో ప్రకటించనున్న మొబిలిటీ(రవాణా) క్లస్టర్‌కు ప్రముఖ వాహన తయారీదారులు రానున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో ఉత్సాహం ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణను హబ్‌గా మార్చుకోవడానికి ఈ సదుపాయాలు ఉపయోగపడుతాయి’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈసీఐఎల్, హెచ్‌ఐఎల్, భెల్‌ వంటి ఎల్రక్టానిక్‌ రంగ పరిశ్రమలతో పాటు జెడా ఆటోమోటివ్, ఒప్పో, వివో, ఇన్‌టెల్, మైక్రాన్‌ వంటి పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉండటం ఎలక్ట్రిక్‌ వాహన రంగ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కాకుండా ఎనర్జీ స్టోరేజీ(బ్యాటరీల తయారీ) రంగాన్ని సైతం ప్రోత్సహించడానికి సమగ్రమైన పాలసీని తీసుకొచ్చామని వెల్లడించారు. విద్యుత్‌ వాహనాలు/బ్యాటరీల తయారీ, వినియోగం, చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఈ పాలసీ కింద ప్రకటించిన రాయితీ, ప్రోత్సాహకాలు మరింత మందికి పొడిగించేలా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పాలసీని సవరిస్తామని వివరించారు.  

ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్ల తయారీ.. 
జహీరాబాద్‌లోని మహీంద్రా కంపెనీలో జపాన్‌ టెక్నాలజీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని ప్రారంభించనున్నామని ఆ సంస్థ సీఈఓ, ఎండీ పవన్‌ గోయంకా ఈ కార్యక్రమంలో ప్రకటన చేయగా, మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా ప్రపంచ, దేశ ఆర్థిక వ్యవస్థ బాగా లేకున్నా రాష్ట్రం ఐదేళ్లుగా సుస్థిరంగా 14.2 శాతం జీఎస్డీపీని సాధిస్తూ వస్తోందన్నారు. ఈఓడీబీలో మూడో ర్యాంకుతో ఈసారి కొంత కిందకుపోయినా, మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. టీఎస్‌–ఐపాస్‌ ద్వారా ఇప్పటికే రాష్ట్రానికి 28 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, జాతీయ ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 8 శాతం ఉండగా, రాష్ట్ర వృద్ధిరేటు 18శాతం ఉందన్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌ డిపోలు, పెట్రోల్‌ బంకు లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టుల వద్ద విద్యుత్‌ వాహనాలకు చార్జింగ్‌ సదుపాయం కలి్పస్తున్నామన్నారు. రాష్ట్రంలో త్వరలో 178 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,401 ఎలక్ట్రిక్‌ వాహనాలు రిజిస్ట్రర్‌ అయ్యాయని, వీటిలో 4,292 ద్విచక్రవాహనాలు, 491 మోటార్‌ క్యాబ్స్, 194 ఈ–రిక్షా, 40 ఆర్టీసీ బస్సులున్నాయని మంత్రి అజయ్‌కుమార్‌ తెలిపారు. ఈ–ఆటో రిక్షాలను ప్రోత్సహించేందుకు త్వరలో ఆటో రిక్షాలపై ఉన్న ఆంక్షలు తొలగిస్తూ జీవో 135, 14కు సవరణలు తీసుకొస్తామని స్పష్టంచేశారు. 

ఫాస్ట్‌ చార్జింగ్‌ నెట్‌వర్క్‌.. 
టీఎస్‌ రెడ్‌కో, హైదరాబాద్‌ మెట్రో రైల్, పవర్‌గ్రిడ్, పెట్రోలియం కంపెనీలతో పాటు ఫోటం వంటి ప్రైవేట్‌ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. రెసిడెన్షియల్‌ టౌన్‌ షిప్, మాల్స్‌ తప్పనిసరిగా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ నిబంధనలు తెచి్చందన్నారు. ఆర్టీసీ తొలుత 40 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల భాగస్వామ్యంతో ప్రారంభించిందని, మెయింటెనెన్స్‌ పూర్తిగా తగ్గి సంస్థకు లాభాలొస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో మరో 325 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ తీసుకొస్తుందని వెల్లడించారు. 

పలు కంపెనీలతో ఎంఓయూలు
ఈ సందర్భంగా పలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రూ.300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రా సంస్థ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొల్పనుంది. దీని ద్వారా 3,500 ఉపాధికి ఉపాధి లభించనుంది. రూ.200 కోట్ల పెట్టుబడితో మైత్ర కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో స్థాపించి 2,250 మందికి ఉపాధి కల్పించనుంది. ఈటీఓ మోటార్స్‌ రూ.150 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ త్రీవీలర్స్‌ తయారీ పరిశ్రమను 3–5 ఏళ్లలో స్థాపించి 1,500 మందికి ఉపాధి కలి్పంచనుంది. మైత్ర ఎనర్జీ రూ.2 వేల కోట్లను, ఒలెక్ట్రా రూ.300 కోట్లను, ఈటీఓ మోటార్స్‌ రూ.150 కోట్లను, గాయం మోటార్స్‌ రూ.250 కోట్లను, ప్యూర్‌ ఎనర్జీ రూ.500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా 14,750 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏఆర్‌ఏఐ కంపెనీతో మరో ఎంఓయూ కుదుర్చుకున్నా వివరాలు వెల్లడించలేదు. మరో రెండు కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ లేఖ అందజేశాయి. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సలహాదారుడు అన్నా రాయ్, మహీంద్రా గ్రూపు ఎండీ, సీఈఓ పవన్‌ గోయంకా, ఎస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ సునీల్‌ మెహతా తదితరులు మాట్లాడారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement