సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది అక్టోబర్‌లోనే విద్యుత్ వాహన విధానాన్ని ప్రవేశపెట్టామని, భవిష్యత్‌లో విద్యుత్‌వాహనాలదే హవా అని పరిశ్రమలు,ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి సంబంధించి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.5,600 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి సంబంధించి రాష్ట్రానికి తొమ్మిది అంతర్జాతీయ కంపెనీలు రానున్నాయని వెల్లడించారు.
వీటితోపాటు మరో రెండు భారతీయ కంపెనీలతో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. శాసనమండలిలో శుక్రవారం విద్యుత్‌వాహనాల విధానంపై ఎమ్మెల్సీ కె.నవీన్‌కుమార్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ హైదరాబాద్‌కు సమీపంలోని చేవెళ్ల, షాబాద్, చందనవెల్లి, సీతారాంపూర్‌లతో పాటు మహబూబ్‌నగర్‌లోని జిగిటిపల్లిలో రెండు క్లస్టర్స్ వస్తున్నాయన్నారు. విద్యుత్ వాహనాల తయారీకి ఉపయోగపడే లిక్వినిటైన్ 80% చైనాలో ఉత్పత్తి అవుతున్నందున ఆ దేశంతోనూ చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 6,311 విద్యుత్ వాహనాలు (వాటిలో 40 టీఎస్‌ఆర్టీసీ బస్సులు) రోడ్లపైకి వచ్చాయని, వినియోగదారులకు రూ.26.18 కోట్ల మేర ప్రోత్సాహకాలను అందజేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 98 ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లున్నాయని, వాటి సంఖ్యను త్వరలోనే 150కు పెంచుతామని హామీనిచ్చారు. విద్యుత్ వాహనాలు, వాటి విడిభాగాల తయారీలో పెట్టుబడులు పెంపొందించడం, వినియోగదారులు విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నట్టు కేటీఆర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment