Pakistan Car Sales: భారతీయ మార్కెట్లో ప్రతి నెలా మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన ఆటోమొబైల్ మార్కెట్.. పాకిస్తాన్‌లో బాగా క్షీణించి.. గత నెలలో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని పీఏఎమ్ఏ (PAMA) వెల్లడించింది. అక్కడ కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం ఏంటి? ఈ నెలలో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందా.. లేదా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
పాకిస్తాన్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (PAMA) ప్రకారం.. పాకిస్తాన్‌లో నవంబర్ 2023లో కేవలం 4875 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు తెలుస్తోంది. గత ఏడాది ఇదే నెలలో అక్కడి అమ్మకాలు 15,432 కావడం గమనార్హం.
పాకిస్తాన్‌లో కార్ల అమ్మకాలు భారీగా తగ్గడానికి కారణం 'పెరిగిన ఆర్థిక సంక్షోభం, తారా స్థాయికి చేరిన కార్ల ధరలు, సగటు వ్యక్తి సంపాదన క్షీణించడం' మాత్రమే కాకుండా పరిశ్రమ డిమాండ్ పడిపోవడం, కరెన్సీ తరుగుదల, అధిక పన్నులు, ఆటో ఫైనాన్సింగ్ వంటివి ఖరీదైనవి కావడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.
నిత్యావసర వస్తువులే కొనలేని పరిస్థితిలో ఉన్న ఆ దేశ ప్రజలకు కార్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఈ కారణంగానే పాకిస్తాన్‌లో ఆటోమొబైల్ మార్కెట్ బాగా క్షీణించింది. పాక్ సుజుకి, ఇండస్ మోటార్ కంపెనీ లిమిటెడ్, హోండా అట్లాస్ కార్ వంటి ప్రధాన వాహన తయారీదారుల అమ్మకాలు వరుసగా 72 శాతం, 71 శాతం, 49 శాతం క్షీణించాయి. మరి కొన్ని సంస్థలు పూర్తిగా ఉత్పత్తి నిలిపివేసి ప్లాంట్స్ కూడా మూసివేసాయి.
2023 జులై నుంచి అక్టోబర్ వరకు పాకిస్తాన్‌లో అమ్ముడైన మొత్తం కార్ల సంఖ్య 20,871. అంటే నాలుగు నెలల కాలంలో అమ్ముడైన వాహనాల సంఖ్య సగటున ఐదు వేలు మాత్రమే అని స్పష్టమవుతోంది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ అమ్మకాలు కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నెలలో కూడా అమ్మకాలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ!
భారతీయ మార్కెట్లో అమ్మకాలు
పాకిస్తాన్‌లో కార్ల అమ్మకాలను పక్కన పెడితే.. భారతదేశంలో కార్ల విక్రయాలు గత నెలలో జోరుగా సాగాయి. నవంబర్ 2023లో మారుతి సుజుకి ఇండియా సేల్స్ 1,64,439 యూనిట్లు, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 17,818 యూనిట్లుగా నమోదయ్యాయి. గత నెలలో దేశంలో జరిగిన మొత్తం కార్ల అమ్మకాలు 3.60 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ.
పాకిస్తాన్‌లో అమ్ముడైన కార్ల సంఖ్య.. భారతదేశంలో సగం రోజులో అమ్ముడైన కార్ల సంఖ్య కంటే తక్కువని తెలుస్తోంది. భారతదేశంలోని ద్విచక్ర వాహన తయారీదారులు నవంబర్‌లో తమ ఫోర్ వీలర్ కౌంటర్‌పార్ట్‌లను అధిగమించారు. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్' (FADA) గణాంకాల ప్రకారం నవంబర్‌లో ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment