ముంబై: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 2032 నాటికి ఏటా 2.72 కోట్ల యూనిట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది. ఇంధన రంగంలో సలహాలు, సాఫ్ట్‌వేర్, సేవలు అందిస్తున్న కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రకారం.. 2032 నాటికి ఏటా ఈవీ పరిశ్రమ 35 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది.
ఈవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం కేటాయించిన 1.2 బిలియన్ డాలర్ల సబ్సిడీ ఈ వృద్ధిని నడిపిస్తుంది. ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాల తయారీకి 3.5 బిలియన్ డాలర్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఆమోదం పొందడం ద్వారా దేశీయ ఈవీ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.
ఇది దేశంలో ఈవీ సరఫరా వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈవీలను ప్రోత్సాహించేందుకు, ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వివిధ విధానాల ద్వారా ఈ రంగానికి చురుకుగా మద్దతు ఇస్తున్నాయి. ఈ విషయంలో తమిళనాడు, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఈవీ, విడిభాగాల తయారీకై కంపెనీలకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment