సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఓ వైపు మద్యం పాలసీ గడువు ముగుస్తోంది... కొత్త పాలసీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది... పెద్ద మొత్తాలతో షాపులు దక్కించుకున్న మద్యం వ్యాపారుల్లో అలజడి రేగుతోంది. వ్యాపారం ప్రారంభించింది మొదలు ప్రతికూల పరిస్థితులు తలెత్తడంతో ఆశించిన స్థాయిలో పెట్టుబడి దక్కించుకోలేకపోయారు. గడువు దగ్గరపడుతున్నకొద్దీ ఎమ్మార్పీని పక్కన పెట్టి మేం చెప్పిందే రేటు అన్నట్టు అమ్మకాలు సాగించారు. విస్తృతంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి తమ దందా సాగించారు. ఒక విధంగా చెప్పాలంటే వీరికి అధికారులు సైతం ఇతోధికంగా సాయపడ్డారు. వీరి ఆగడాలను అడ్డుకునేందుకు సాహసించలేదు. అయితే రాష్ట్ర స్థాయి నిఘా అధికారులు ఇప్పుడు జిల్లాపై కన్నేయడంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు స్థానికంగా ఉండడంతో దాడులపైనే దృష్టిసారించారు.
ఇన్నాళ్లూ చూసీచూడనట్టు వ్యవహరించినా మద్యం చట్టం ప్రకారం కేసుల నమోదు, లక్ష్య సాధన విషయమై స్థానిక ఉద్యోగులు తనిఖీల్ని ముమ్మరం చేశారు. లెసైన్సీలకు తెలియకుండా అక్రమాలు జరగవన్న ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులకు రహస్యంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. దుకాణాల్లోని గుమాస్తాల్ని తీసుకువచ్చి అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. ‘టాస్క్‌ఫోర్స్ అధికారులు జిల్లాలో ఉన్నప్పుడు కూడా వ్యాపారులు జాగ్రత్త వహించడం లేదు. మా పని మేం చేసుకోక తప్పదు కదా’అని ఎక్సైజ్‌శాఖలోని ఓ అధికారులు తెలిపారు. ఈ తనిఖీలతో వ్యాపారుల్లో అలజడి మొదలైంది. ఏడాదిపొడవునా వచ్చిన కష్టాలతో తాము పూర్తిగా నష్టపోయామనీ, ఇప్పుడు అధికారులు చేసిన ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు.
వ్యాపారుల విలవిల
పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి షాపులు దక్కించుకుని అమ్మకాలు చేపట్టాక వరుసగా తమకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాపారులు వాపోతున్నారు. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో కొంత నష్టపోగా... ఎచ్చెర్లలో మద్యం డిపోను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేయడం, మధ్యలో ఆమదాలవలస గోదాములనుంచి మద్యం సరఫరా చేయడంవల్ల సరకు సక్రమంగా సరఫరా కాక అమ్మకాలు చేయలేకపోయామని వారు చెబుతున్నారు. తమకు నష్టాలొస్తున్నాయని, అధికారుల దాడులతో విసిగిపోతున్నామని, మామూళ్లు ఇస్తున్నా సోదాల పేరిట ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టారు. గడువు సమీపిస్తుండడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై చూసీ చూడనట్టు వ్యవహరించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారుల చేతుల్లో లేకపోవడంతో టీడీపీ నాయకుల వెంట పడుతున్నారు.
కఠినంగా వ్యవహరిస్తున్న ఎస్టీఎఫ్
ఈ నేపథ్యంలో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల్ని గుర్తించి తాజా నివేదికను హైదరాబాద్ పంపించినట్టు తెలిసింది. వాస్తవానికి గతంలో వ్యాపారులు హోలోగ్రామ్, కంప్యూటర్ పరికరాల సహాయంతోనే వ్యాపారం సాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అది ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఎక్కడా అమలు కాలేదు. ఇప్పుడు ఎక్కడ వ్యాపారులు దొరికినా కేసులు పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ వెనుకాడటంలేదని తెలుస్తోంది.
కిక్కు దిగింది
Published Sun, May 17 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement