ఏలూరు : కొద్ది నెలలుగా ఇసుక విధానంపై నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడిపోయింది. ఈ అంశంపై ప్రభుత్వం చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. నూతన ఇసుక విధానాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. ఇసుక రీచ్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించాలని.. తద్వారా వచ్చే ఆదాయంతో డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలని తొలినుంచీ ప్రభుత్వం భావిస్తున్న విషయం విది తమే. ఈ నేపథ్యంలోనే ఇసుక రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెం బర్ 1 నుంచి జిల్లాలోని 16 రీచ్‌లను వారికి అప్పగించనున్నారు. ఇందుకోసం ఇటీవలే వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ కమిటీ వేశారు. ప్రభుత్వం జీవో జారీ చేయడంతో రీచ్‌లను మహిళా సంఘాలకు అప్పగించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
కమిటీ చైర్మన్‌గా కలెక్టర్
నూతన ఇసుక విధానంపై జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన కమిటీలో స్వల్ప మార్పు చేశారు. ఇకపై ఆ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తారు. గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్, అదే శాఖకు చెందిన విజిలెన్స్ అసిస్టెంట్ డెరైక్టర్, భూగర్భ జలశాఖ డెప్యూటీ డెరైక్టర్, డీఆర్‌డీఏ పీడీ, జిల్లా పంచాయతీ అధికారి, ఇరిగేషన్ ఎస్‌ఈ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, డ్వామా పీడీ, ఏపీఎండీసీ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీఇసుక రీచ్‌ల స్థితిగతుల్ని పరిశీలించి మహిళా సంఘాలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తుంది. క్యూబిక్ మీటర్ ఇసుకను ఎంతకు విక్రయించాలనే విషయంపైనా జిల్లా కమిటీయే నిర్ణయం తీసుకుంటుంది.
వే బిల్లు తప్పనిసరి
భూగర్భ జలాలకు ఇబ్బంది లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇసుక రీచ్‌ల పర్యవేక్షణను ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించారు. ఇకపై వే బిల్లు లేకుండా ఇసుకను తరలిస్తే సంబంధిత వ్యక్తుల నుంచి భారీగా జరిమానా వసూలు చేస్తారు. జిల్లా నుంచి సరిహద్దులు దాటించి ఇసుక తరలించడాన్ని నిషేధించారు. ఇసుక అమ్మకాలు, ఇతర అంశాలను సమీక్షించేందుకు నెలకొకసారి రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం అవుతుంది.
ఇసుక.. తొలగింది మసక
Published Fri, Aug 29 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement
Advertisement