సిమెంట్ పిడుగు
Published Sun, Dec 29 2013 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే పేదల నెత్తిన సిమెంట్ పిడుగుపడింది. బస్తా రూ.188 ఉన్న సిమెంట్ ధరను అమాంతం రూ.235కి పెంచుకునేలా ఆ కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఒక్కో బస్తాకు రూ.47 చొప్పున ధర పెరిగింది. ఇది నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభా వం చూపనుంది. ప్రత్యేకించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుం టున్న పేదలపై రూ.1.50 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటిపై కనీసం రూ.2,500 చొప్పున వ్యయం పెరగనుంది. సిమెంట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కొద్దినెలలుగా కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. సిమెంట్ సరఫరాను
నిలిపివేశాయి కూడా. ఇది కాకుండా ఐరన్, ఇసుక, కంకర ధరలు సైతం ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పెరుగుతున్నారుు.
70 వేల పేద కుటుంబాలపై
మోయలేని భారం
జిల్లాలో ఇందిరమ్మ, రచ్చబండ-1, 2 దశల్లో మంజూరు చేసిన 70వేల ఇళ్ల నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయడానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తాజా పెంపుతో పేదలపై మొత్తం 1.50 కోట్లమేర అదనపు భారం పడనుంది. ఇదిలావుండగా, పేదల ఇంటి నిర్మాణాలకు సంబంధించిన మెటీరియల్‌ను గృహ నిర్మాణ శాఖ నుంచి సరఫరా చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ధరలు పెరిగిన నేపథ్యంలో మెటీరియల్ సక్రమంగా అందుతుందా లేదా అనే అనుమానం లబ్ధిదారుల్లో నెలకొంది.
రెండేళ్లలో మూడోసారి
పేదలకు ఇంటి రుణం పెంచుతున్న ప్రభుత్వం వెనువెంటనే సిమెంట్ ధరలు, ఇతర భారాలను వేస్తూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ఇంటి రుణం గ్రామాల్లోని లబ్ధిదారులకు రూ.75 వేలకు, పట్టణాల్లోని వారికి రూ.85 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం సరిపోకపోవడంతో కనిష్టంగా మరో రూ.50 వేలను లబ్ధిదారులు భరించాల్సి వస్తోంది. అప్పోసొప్పో చేసి ఈ మొత్తాన్ని పేదలు సమకూర్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సిమెంట్ ధర పెంపుతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెండేళ్ల క్రితం సిమెంట్ బస్తా ధర రూ.135 ఉండగా, ఒకసారి రూ.160కు, ఆ తరువాత రూ.188కి పెరిగింది. గృహ నిర్మాణ శాఖ ఇచ్చే రుణంతో ఇళ్లు నిర్మించుకునే పేదలకు పాత ధరకే సిమెంట్ అందించాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Advertisement
Advertisement