మెలానియా ట్రంప్, టెక్సాస్‌లోని ఓ వసతి కేంద్రంలో తల్లిదండ్రుల నుంచి వేరైన పిల్లలు
వాషింగ్టన్: అమెరికా సరిహద్దుల్లో వలసదారుల నుంచి వారి పిల్లల్ని వేరుచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ‘జీరో టాలరెన్స్’ ఇమిగ్రేషన్ పాలసీగా అమెరికా పేర్కొంటున్న ఈ విధానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియాతో పాటు మాజీ ప్రథమ మహిళలు కూడా తప్పుపట్టారు. వేలాది మంది చిన్నారుల్ని తల్లిదండ్రుల నుంచి విడదీయడం అమానుషమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.‘జీరో టాలరెన్స్’ వలస విధానం అమల్లో భాగంగా.. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోని అక్రమ వలసదారుల నుంచి చిన్నారుల్ని బలవంతంగా వేరు చేసి వివిధ వసతి కేంద్రాల్లో ఉంచారని అమెరికా హోంల్యాండ్ భద్రతా విభాగమే స్వయంగా వెల్లడించింది. అయితే ట్రంప్ వివాదాస్పద వలస విధానానికి చిన్నారుల్ని బలిపశువుల్ని చేయడం అన్యాయమని మానవతావాదులు మండిపడుతున్నారు.
పసివారిని వేరు చేయొద్దు
పిల్లల హక్కులకు భంగం కలిగించే ‘జీరో టాలరెన్స్’ వలస విధానాన్ని ట్రంప్ భార్య మెలానియా సైతం తప్పుపట్టారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తోన్న మెక్సికన్ల నుంచి వారి పిల్లలను వేరుచేయడంపై ఆమె స్పందించారు. ‘చట్టప్రకారం వ్యవహరించండి, కానీ మానవత్వంతో వ్యవహరించండి’ అని అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు. తల్లిదండ్రుల నుంచి పసివారిని వేరు చేయడాన్ని సహించలేనని మెలానియా వ్యాఖ్యానించారని, రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఏకమై ఉన్నతమైన వలస సంస్కరణల్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారని మెలానియా ప్రతినిధి స్టిఫాని గ్రీషం వెల్లడించారు. మెలానియా కూడా అమెరికాకు వలస వచ్చి ఆ దేశ పౌరసత్వం పొందడం గమనార్హం.
జీరో టాలరెన్స్ దారుణం: లారా బుష్
అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ భార్య లారా బుష్ స్పందిస్తూ.. ‘ఈ జీరో టాలరెన్స్ విధానం అమానుషం. అనైతికం. ఇది విన్నాక నా గుండె బద్దలైంది’ అని వాషింగ్టన్ పోస్టు పత్రికలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘నేను కూడా సరిహద్దు రాష్ట్రంలోనే నివసిస్తున్నాను. మన అంతర్జాతీయ సరిహద్దుల్ని కాపాడాల్సిన అవసరాన్ని, ప్రయత్నాల్ని నేను అభినందిస్తున్నాను. అయితే ఈ జీరో టాలరెన్స్ విధానం దారుణం’ అని పేర్కొన్నారు. పిల్లల్ని వేరుగా ఉంచడం వంటి చర్యలకు అమెరికా ప్రభుత్వం పాల్పడకూడదని లారా బుష్ చెప్పారు. పిల్లల పట్ల అలాంటి చర్యలకు పాల్పడడం అనైతికమని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్ హై కమిషనర్ జైద్ రాద్ అల్ హుస్సేన్ అన్నారు.
అనుమతించేది లేదు: ట్రంప్
అయితే జీరో టాలరెన్స్ విధానాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఇకపై అమెరికా వలసదారుల శిబిరంగా, శరణార్థుల కేంద్రంగా ఉండబోదని తేల్చి చెప్పారు. యూరప్, ఇతర దేశాల్లో వల్లే అమెరికాలో జరిగేందుకు అనుమతించమని స్పష్టం చేశారు.
తల్లిదండ్రులకు దూరంగా...
అమెరికా సరిహద్దుల నుంచి మెక్సికో చొరబాటుదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలను కట్టుదిట్టం చేస్తూ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో వారిని ఉంచుతున్నారని అమెరికా మహిళా శరణార్థుల కమిషన్ డైరెక్టర్ మైఖేల్ బ్రేన్ తెలిపారు.
ఈ అమానుషంపై అమెరికా వెలుపల, లోపల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అమెరికా ప్రతినిధి జాన్‌తన్ హాఫ్‌మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా నూతన వలస విధానం అమలులోకి వచ్చాక.. ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు 2వేల మంది పసివారు తల్లిదండ్రులకు దూరమయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన విధానాన్ని సమర్థించారని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ మే 7న ప్రకటించారు. మెక్సికన్ చొరబాటుదారుల పిల్లల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న అమెరికాపైనా, ఆ దేశ భద్రతా దళాల విధానాలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇరు దేశాల్లోనూ ఉద్యమాలు పెల్లుబికాయి.
Comments
Please login to add a commentAdd a comment