ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యమిస్తూ యూజీసీ కొత్త విధానం!
రెండు దశల్లో వర్సిటీలు,కాలేజీల నాణ్యత మదింపు
ఎన్‌ఈపీ అమలు చేస్తున్న విద్యాసంస్థలకు ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్ద పీట వేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలు తీసుకు వస్తోంది. ఇందులో జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) అమలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ ఇచ్చే న్యాక్ అక్రిడిటేషన్‌లో అదనపు ఫ్రేమ్‌వర్క్‌ను పరిచయం చేస్తోంది. ఈ ప్రక్రియలో రెండు దశల్లో విద్యా సంస్థల మదింపు చేసి ర్యాంకులు ఇవ్వనుంది. తొలి దశ ‘ఎలిజిబులిటీ క్వాలిఫైయర్’లో ప్రాథమిక అర్హతలను పరిశీలిస్తారు.
ఇందులో ఎంపికైన విద్యా సంస్థలు రెండో దశ పరిశీలనకు వెళ్తాయి. తొలి దశలో విద్యా సంస్థ 11 రకాల అంశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వీటిలో యూజీసీ గుర్తింపు, న్యాక్ అక్రిడిటేషన్, ఏఐఎస్హెచ్ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్, విద్యార్థుల ఫిర్యాదు పరిష్కార కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను ప్రాథమికంగా పాటించాల్సి ఉంటుంది.
ఇవన్నీ ఉంటేనే రెండో దశకు అర్హత లభిస్తుంది. రెండో దశలో నాణ్యత ధ్రువీకరణ కోసం నిర్ణీత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యా సంస్థలోని కనీసం 75 శాతం బోధనా పోస్టుల్లో శాశ్వత సిబ్బంది ఉండాలి. ఈ శాశ్వత సిబ్బంది మాలవీయ మిషన్ ద్వారా శిక్షణ పొంది ఉండాలి. అలాగే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, పర్యావరణ విద్యను ఆయా సంస్థలు బోధిస్తూ ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కనీసం 3 వేల మంది విద్యార్థులను చేర్చుకున్నారా? ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ఉందా? తదితర ప్రశ్నలు ఉంటాయి.
మొత్తం 49 ప్రశ్నలకు గానూ 30 ప్రశ్నలు అన్ని ఉన్నత విద్యా సంస్థలకూ వర్తిస్తాయి. మరో 13 ప్రశ్నలు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు సంబంధించినవి. ముఖ్యంగా వైస్ చాన్సలర్‌ల నియామకం యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదో పరిశీలించనున్నారు. ఈ తాజా మార్గదర్శకాలపై 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని యూజీసీ కోరింది.
అయితే జాతీయ విద్యా విధానం అమలు ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ఇవ్వడాన్ని తమిళనాడు, కర్ణాటక విశ్వవిద్యాలయాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్‌ఈపీని అమలు చేయని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment