మద్యం విక్రయాలకు 11 రోజులే గడువు!
- ఈ నెలతో ముగియనున్న మద్యం దుకాణాల కాంట్రాక్ట్
- జూలై 1నుంచి కొత్త పాలసీ
- దుకాణాల దరఖాస్తులకు ఈ నెల 21 చివరి తేదీ
- ఆదాయం పెంపునకు పట్టణంలో అదనపు దుకాణం
తాండూరు : ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల కాంట్రాక్టు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. జూలై 1వ తేదీ నుంచి 2014-15 సంవత్సరానికి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానున్నది. ఈ నేపథ్యంలో పాత మద్యం నిల్వలు విక్రయించుకోవడానికి మరో పన్నెండు రోజుల గడువు మాత్రమే ఉంది. కొత్త పాలసీ అమల్లోకి వచ్చే లోపు తాండూరు నియోజకవర్గంలోని 12 మద్యం దుకాణాల్లో ఉన్న నిల్వలను విక్రయించడంపై వ్యాపారులు దృష్టిసారించారు.
పట్టణంలో ప్రభుత్వం లెసైన్స్ ఫీజు రూ.42లక్షలపై గత ఏడాది నిర్దేశించిన ఏడు రెట్ల ప్రకారం ఒక దుకాణంలో రూ.2కోట్ల 92లక్షల 50వేల మద్యం అమ్మకాలకుగాను ఇప్పటి వరకు సగటున రూ.4.62కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని అంచనా. ఈ లెక్కన ఒక దుకాణంలో రూ.1.70కోట్ల మద్యం అమ్మకాలు పెరిగాయి. అదనపు అమ్మకాలపై సర్కారుకు 14శాతం ఆదాయం లభించింది. ఇదిలా ఉంటే, ఈ నెల 31వ తేదీ నాటికి పాత కాంట్రాక్ట్ ప్రకారం మిగిలిన మద్యం నిల్వలను సీజ్ చేయాలని ఎక్సైజ్ అధికారులు యోచిస్తున్నారు.
పట్టణంలో రూ.32.34 కోట్ల మద్యం అమ్మకాలు...
పట్టణంలోని మొత్తం ఏడు మద్యం దుకాణాల్లో రూ.4.62 కోట్ల లెక్కన సగటున రూ.32.34కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ కారణంతోనే పట్టణంలో అదనంగా మద్యం దుకాణం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక బషీరాబాద్‌లో రెండు మద్యం దుకాణాల్లో ఒక దుకాణాన్ని ప్రభుత్వం తగ్గించింది.
రూరల్‌లో రూ.17.87కోట్ల విక్రయాలు...
తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాల్లో ఒక్కో దుకాణంలో రూ.32.50లక్షల లెసైన్స్ ఫీజుపై ఏడు రెట్ల ప్రకారం రూ.2కోట్ల 27లక్షల 50వేల అమ్మకాలు జరగాలి. కాగా ఇప్పటివరకు సగటున ఒక్కో దుకాణంలో రూ.3కోట్ల 57లక్షల 50వేల మద్యం అమ్మకాలు జరిగాయి. అదనంగా రూ.1.30కోట్ల అమ్మకాలు జరిగాయి. 11రెట్ల ప్రకారం మొత్తం రూరల్‌లోని ఐదు దుకాణాల్లో రూ.17కోట్ల 87లక్షల 50వేల మద్యం విక్రయాలు జరిగాయి.
30వ తేదీ వరకే నిల్వ మద్యం అమ్మకాలు..
పాత పాలసీ ప్రకారం మద్యాన్ని దుకాణాలకు తరలించుకోవడానికి మరో వారం రోజులు మాత్రమే అధికారులు గడువు విధించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉన్న మద్యం నిల్వలను ఈ నెల 30వ తేదీ వరకు విక్రయించుకోవాల్సి ఉంటుంది. కాగా, కొత్త మద్యం పాలసీలో దుకాణాల లెసైన్స్‌లు దక్కించుకోవడానికి పాత వ్యాపారులతోపాటు కొత్త వారూ ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలోని 14 మద్యం దుకాణాల లెసైన్స్‌ల కోసం పెద్దఎత్తున దరఖాస్తు ఫారాలు తీసుకువెళుతున్నట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. పట్టణంలోని ఏడు దుకాణాలకు 13, రూరల్‌లో 6 దుకాణాలకు ఇప్పటి వరకు 9 దరఖాస్తు ఫారాలు తీసుకువెళ్లినట్టు అధికారులు చెప్పారు. ఈ నెల 21వ తేదీ దుకాణాల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్‌భూషణ్ బుధవారం తెలిపారు.