
ఓపెనైతే అంతే!
- పబ్లిక్‌గా తాగితే కేసులు
- మందుబాబుల వీరంగాలకు చెక్
- నేటి నుంచి కొత్త విధానం అమలు : సీపీ
సాక్షి, సిటీబ్యూరో:బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే మందుబాబుల భరతం పట్టేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు. వైన్‌షాప్‌లు, నిర్మానుష్య ప్రదేశాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర బహిరంగ ప్రదేశాల్లో మందు తాగి పోలీసులకు చిక్కితే గతంలో సిటీ పోలీసు చట్టం కింద చిన్నపాటి శిక్షతో వదిలి పెట్టేవారు. ఇకపై ఏకంగా ఐపీసీ 188 కింద కేసు నమోదు చేసి కోర్టుకు పంపనున్నారు. ఈ కొత్త పద్ధతిని శనివారం నుంచి అమలు చేయనున్నారు.
ఇందుకుగాను నగరంలోని అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌ఓలకు పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మందుబాబుల ఆగడాలు అరికట్టేందుకు శనివారం నుంచి ఏడో తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. మద్యం తాగి వాహ నం నడిపిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి పట్టుబడిన వారిని ఉపేక్షించకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టుకు పంపనున్నారు. ఇలా చేయడంతో రహదారులపై వెళ్లే మిహ ళలు, చిన్న పిల్లలకు రక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
బాబుల వీరంగంపై గత పక్షం రోజులుగా ఆయా కాలనీలు, బస్తీ సంఘాల నేతలు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి మహిళలు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. వారి విజ్ఞప్తుల మేరకు కమిషనర్ మందుబాబులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.