
ఇక రుణ రేట్లపై బ్యాంకుల కొత్త విధానం
♦ ఏడాదికి ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ 9.2 శాతం
♦ బేస్‌రేటు కన్నా 10 బేసిస్ పాయింట్లు తక్కువ...
♦ ఇదే బాటలో ఇతర బ్యాంకులు...
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రుణ రేటుపై శుక్రవారం నుంచీ కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ సహా పలు బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) గురువారం ప్రకటించాయి.
ఎస్‌బీఐ తాజా రేటు చూస్తే...
♦ ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.30 శాతంగా ఉంది. తాజా విధానం ప్రకారం... ఏడాది రేటు 9.20 శాతంగా బ్యాంక్ నిర్ణయించింది. ఇది బేస్ రేటు కన్నా 10 బేసిస్ పాయింట్లు తక్కువ. ఇందులో ఓవర్‌నైట్ (8.95 శాతం), నెల (9.05 శాతం), మూడు నెలలు (9.10 శాతం), ఆరు నెలలు (9.15 శాతం), రెండేళ్లు (9.30 శాతం), మూడేళ్లు (9.35 శాతం) ఉన్నాయి.
♦ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఏడాది కాలానికి రుణ రేటు రుణ రేటు 9.20 శాతంగా ఉంటుంది. రెండేళ్లకు 9.3 శాతం. మూడేళ్ల కాలానికి 9.35 శాతం. ప్రస్తుతం బ్యాంక్ బేస్ రేటు 9.3 శాతం.
♦ బ్యాంక్ ఆఫ్ బరోడా...: ఐదేళ్ల రుణానికి బ్యాంక్ స్థిర వడ్డీ రేటును 9.65 శాతంగా నిర్ణయించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రేటుతో పోల్చితే బ్యాంక్ రుణ రేటు 0.35 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది.
♦ పీఎన్‌బీ..: ఏడాది రేటు 9.40 శాతం. మూడేళ్లకు 9.55 శాతం. ఐదేళ్లకు 9.70 శాతం.
ఇదీ నేపథ్యం... ప్రయోజనం!
ఇప్పటివరకూ బ్యాంకులు వాటి పాత డిపాజిట్ వ్యయాలు, ఇతర నిధుల సేకరణ వ్యయాలన్నింటినీ పరిగణన లోకి తీసుకుని రుణాలపై రేట్లను నిర్ణయిస్తున్నాయి. దాంతో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గిం చినంత మేర బ్యాంకులు రుణాల రేట్లను తగ్గించడం లేదు. దాంతో ఏప్రిల్ 1 నుంచీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) విధానాన్ని అనుసరించాలంటూ గత డిసెంబర్‌లో ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీచేసింది. దీనితో ఇకపై డిపాజిట్, రుణ రేటు ప్రాతిపదికన బ్యాంకు వడ్డీ రేటు వుంటుంది. ఒకవేళ ఆర్‌బీఐ కీలక రేట్లలో మార్పుచేస్తే... వెంటనే ఆ ఫలితం బ్యాంకుల రుణ రేటుపై కనిపిస్తుంది.