సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక విధానం అవినీతికి ఆలవాలంగా మారిందని.. అక్రమాలను అరికట్టేందుకు కొత్త విధానం తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటంతోపాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త పాలసీని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక రవాణా, టీఎస్‌ఎండీసీ కార్యకలపాలపై విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో భూగర్భ గనులు, ఖనిజ వనరుల శాఖపై మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, ఆ శాఖ అధికారులతో రేవంత్ సమీక్షించారు.
అన్ని స్థాయిల్లో అవినీతి
ఇసుక క్వారీయింగ్, రవాణాకు సంబంధించి అన్నిస్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని వెంటనే అరికట్టాలని అధికారులను సీఎం హెచ్చరించారు. 48 గంటల్లోగా అన్నిస్థాయిల అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలన్నారు. రెండు రోజుల తర్వాత ఏసీబీ, విజిలెన్స్ విభాగాలను రంగంలోకి దింపాలని.. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
అక్రమాలకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని స్పష్టం చేశారు. అన్నిరూట్లలో ఉన్న టోల్‌గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని బయటికి తీయాలని సూచించారు. ఇసుక రీచ్‌లు, డంపులను తనిఖీ చేయాలని.. అక్రమాలకు పాల్పడినవారికి జరిమానాలు విధిస్తే సరిపోదని, కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆకస్మిక తనిఖీలు చేయించి..: ఇసుక రీచ్‌లన్నింటా సీసీ కెమెరాలు ఉన్నాయని అధికారులు చెప్పడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 1న తాను కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాదయాత్ర చేసినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లానని.. అక్కడ సీసీ కెమెరాలు లేవని చెప్పారు.
ఈనెల 3న రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించామన్నారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. అందులో 22 లారీలకు అనుమతి లేదని.. ఒకే పర్మిట్, ఒకే నంబర్‌తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నాయని తేలిందని స్పష్టం చేశారు. అంటే 25శాతం ఇసుక అక్రమంగా తరలిపోతోందన్నారు.
అనుమతిలేని క్రషర్స్ సీజ్ చేయండి
హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. భారీ భవన సముదాయాలు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సెల్లార్ల కోసం ఆరు మీటర్ల కంటే లోతుగా తవ్వితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఖనిజ వనరుల శాఖను ఆదేశించారు.
అలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేప్పుడే.. వాటి వివరాలు ఖనిజ వనరుల శాఖకు చేరేలా సమీకృత ఆన్‌లైన్ విధానం అమలు చేయాలన్నారు. గ్రానైట్, ఖనిజ తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్‌ఎస్‌ను వినియోగించాలని సూచించారు. గ్రానైట్‌తోపాటు ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు ఏమేం ఉన్నాయి, ఏయే ఏజెన్సీల వద్ద ఉన్నాయి, వాటి పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment